Shadow teams
-
వికారం పుట్టిస్తున్న షాడో టీం పోలీసుల వ్యవహారం!
హిమాయత్‌నగర్: పోలీసు శాఖలోని లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ విభాగాలు ఏ వి ధంగా పనిచేస్తున్నాయో.. ఉన్నతాధికారులు ఆధారాలతో చూసేందుకు వినేందుకు గాను ‘షాడో’ పోలీసులను నియమించారు. వీరు ఆయా పోలీస్ స్టేషన్ల లోని పోలీసులు విధులు చేస్తున్నారా.. లేదా అనే విషయాలను కాస్తంత దూరం నుంచి తీసి వాటిని ఉన్నతాధికారులకు పంపించే పని. కానీ కొందరు షాడో పోలీసులు లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీసులను నీడలా వెంటాడుతున్నారు. ఇబ్బందికరంగా దగ్గరకు వచ్చి మరీ.. లాక్డౌన్ విధించినప్పటి నుంచి ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల వద్ద లా అండ్ ఆర్డర్ ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరు విధులు ఏ విధంగా నిర్వర్తిస్తున్నారు? సరిగ్గా చేస్తున్నారా? లేదా? అనే అంశాలపై షాడో పోలీసులు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి వీడియోలు, ఫొటోలు తీసుకుని ఉన్నతాధికారులకు అప్డేట్ చేస్తున్నారు. కాస్తంత దూరం నుంచి తీయాల్సిన వీడియోలు, ఫొటోలను కూడా సిబ్బంది ముఖం వద్ద ఫోన్ కెమెరాను పెట్టి మరీ తీస్తున్నారు. దీంతో సక్రమంగా విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది కాస్త ఇబ్బందికి గురవుతున్నారు. అత్యుత్సాహం కూడా... పెట్రోకార్, పెట్రోలింగ్ చేసే సిబ్బంది ఎక్కడైనా వాహనాలను ఆపి రెండు నిమిషాల పాటు ఉంటే చాలు.. షాడో సిబ్బందికి సంబంధం లేకపోయినా వారి వద్దకు వెళ్లి మరీ మీరు ఇక్కడెందుకు ఉన్నారంటూ ప్రశ్నిస్తున్నారు. కొన్ని నెలల క్రితం నారాయణగూడ ఠాణా పరిధిలో ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో షాడో టీం అత్యుత్సాహాన్ని ప్రదర్శించి కానిస్టేబుళ్ల సస్పెన్షన్‌కు కారకులైయ్యారు. ఈ నెల 8వ తేదీ మంగళవారం రాత్రి లిబర్టీ చౌరస్తాలో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది వద్దకు వచ్చి ముఖానికి కెమెరా అనించి మరీ వీడియోస్ తీసి వారి విధులకు సైతం ఆటంకం కలిగించారు. దూరం నుంచి వీడియో తీయకుండా దగ్గరకు వచ్చి మరీ సిబ్బందిని రెచ్చగొట్టే పనులు చేస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు సైతం మౌనంగా ఉంటూ.. షాడో ఇచ్చిన వీడియోల ఆధారంగా లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీసులపై ఆగ్రహావేశాలను చూపించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చదవండి: దారి తప్పిన పోలీసు! -
ఆపరేషన్ ఐ
ప్రత్యర్థులపై అభ్యర్థుల నిఘా దెబ్బతీసేందుకుపణాళికలు.. రంగంలోకి సొంత షాడో టీమ్స్,ఇంటెలిజెన్స్, డిటెక్టివ్ బృందాలు కోవర్టు ఆపరేషన్లకూ కుట్ర అప్రమత్తమైన పోలీసులు షాడో టీమ్స్.. ఇంటెలిజెన్స్ బ్యూరో.. ఇదేంటి రాజకీయంలో పోలీస్ విచారణ బృందాలు అనుకుంటున్నారా? అవును.. రాజకీయ నాయకులు ఇప్పుడు పోలీస్ భాష్యం నేర్చుకున్నారు. షాడో టీమ్స్, ఇంటెలిజెన్స్ బ్యూరో తరహాలో ప్రత్యర్థులపై అనుక్షణం నిఘా పెడుతున్నారు. మరికొందరైతే ఇంకో అడుగు ముందుకేసి ‘కోవర్ట్ ఆపరేషన్లు’ చేయిస్తున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ఎన్నికలప్పుడు రాజకీయ పార్టీలు, నాయకులు ప్రత్యర్థుల ఎత్తులకు పైఎత్తులు వేయడం మామూలే. కానీ ఈ రకంగా ‘సీక్రెట్ ఆపరేషన్’లకు నాయకులు తెరదీయడంతో అందరిలో ఆందోళన నెలకొంది. ఈ పోటాపోటీ చర్యల నేపథ్యంలో ఎలాంటి అపశృతులు, ఉద్రిక్తతలు జరగకుండా, శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా పోలీసులు డేగకన్ను వేసి ఉంచుతున్నారు. ఎత్తులు తెలిస్తేనేగా పైఎత్తులు వేసేది.? అన్ని పార్టీల్లో కార్పొరేటర్ సీట్ల కోసం ఏర్పడిన విపరీతమైన పోటీయే ‘ప్రత్యామ్నాయ మార్గాలు’ అన్వేషించేలా చేస్తోంది. ఇందుకు ప్రతి ఒక్కరూ ప్రత్యర్థి ఏం చేస్తున్నారనేది తెలుసుకోవడంపైనే దృష్టి పెట్టారు. వారు ఎవరిని కలుస్తున్నారు? ఎక్కడ కలుస్తున్నారు? ఏమి హామీలు ఇస్తున్నారు? ఎలాంటి ప్రలోభాల ఘట్టం ప్రారంభించారు?.. తదితర అంశాలు స్పష్టంగా తెలిస్తేనే వాటిని దీటుగా తిప్పికొట్టొచ్చు. దీంతో పాటు ఓటర్లు వారి వైపు ఆకర్షితులు కాకుండా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ‘గ్రేటర్ అభ్యర్థులు’ అందుబాటులో ఉన్న అవకాశాలను వినియోగించుకుంటున్నారు. అనుచరుల ఆపరేషన్... ఈ వ్యూహాన్ని అమలు చేయడంలో భాగంగా కొందరు తమ అనుచరుల్ని ప్రత్యేకంగా రంగంలోకి దింపుతున్నారు. వీరు తమ అభ్యర్థి తరఫున పని చేసినా, చేయకున్నా.. ప్రత్యర్థి ఏం చేస్తున్నాడనేది తెలుసుకోవడం తప్పనిసరి. ఈ నేపథ్యంలోనే మరికొందరితో కలిసి ‘షాడో టీమ్స్’ మాదిరిగా పనిచేస్తూ ఎప్పటికప్పుడు తమ అభ్యర్థికి అప్డేట్స్ అందిస్తున్నారు. కొందరు అభ్యర్థులైతే మరో అడుగు ముందుకేసి ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీలనూ ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోంది. అనునిత్యం తన పోటీదారులపై కన్నేసి ఉంచాల్సిన బాధ్యతల్ని వీరికి అప్పగిస్తున్నారు నాయక గణం. ప్రత్యర్థి అనుచరులకు ఎర... తన వేగుగా ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి వెంట తిరిగే వ్యక్తిని అవతలి వారు గుర్తించకూడదు. అలా జరిగితే మొదటికే మోసం వస్తుంది. అలాగని పూర్తిగా కొత్తవారిని రంగంలోకి దింపితే వారికి స్థానిక రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితులపై అవగాహన ఉండదు. వీటిని దృష్టిలో పెట్టుకున్న కొందరు ‘గ్రేటర్’ అభ్యర్థులు ఏకంగా కోవర్ట్ ఆపరేషన్లు ప్రారంభించారు. పోటీదారుడి వెనుక తిరుగుతున్న, అతడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తులకు వివిధ రకాలుగా ఎర వేస్తూ సమాచారం సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా కోవర్ట్ ఆపరేషన్లకు సహకరించే వారికి భారీగానే నజరానాలు ఇస్తున్నారని సమాచారం. దెబ్బతీసేందుకే... ఈ నిఘా పర్వంలో ప్రతి పార్టీ అభ్యర్థి పోటీదారుడిని వీలైనన్ని కోణాల్లో దెబ్బతీసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రత్యర్థి ఎలా ప్రచారం చేస్తున్నాడు? ఎవరిని కలుస్తున్నాడు? తదితర అంశాలతో పాటు వారి ‘డంప్స్’కు సంబంధించిన పూర్తి సమాచారం సేకరించడంపై దృష్టి పెడుతున్నారు. ప్రలోభాలకు అవసరమైన సామగ్రి, మద్యం, నగదు సమీకరణ పూర్తయిందా? వాటిని ఆయా అభ్యర్థులు ఎక్కడ దాచి ఉంచుతున్నారు? ఆ కోణంలో వీరికి సహకరిస్తోంది ఎవరు? అనే అంశాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవడానికీ ‘నిఘా’ను వాడుతున్నారు. ఈ వివరాలు తెలిస్తే పోలీసులకు, ఎన్నికల సంఘానికి పరోక్షంగా సమాచారమిచ్చి వారిని దెబ్బతీయాలన్నది వీరి వ్యూహంగా కనిపిస్తోంది. రాజకీయం రణరంగం.. ఎదుర్కోవాలి.. ఎదురించాలి..అలాగైతేనే నిలిచేది.. గెలిచేది.. ఇందుకు తగ్గేట్టే ‘గ్రేటర్’ నాయకులు ‘గ్రేట్’ ఐడియాలతో దూసుకుపోతున్నారు. ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. రాజకీయంతోనే ‘ఆట’ ఆడుకుంటున్నారు. ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. కనీవినీ ఎరుగని రీతిలో ‘స్కెచ్’ వేస్తూ ప్రత్యర్థికి ‘చెక్’ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. గెలుపే లక్ష్యంగా.. తనను తాను కాపాడుకుంటూనే ప్రత్యర్థిని దెబ్బతీసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇవేవో ఆషామాషీ ప్రణాళికలు కాదండోయ్.. పోలీస్ తరహా ఆపరేషన్లు. - సాక్షి, సిటీబ్యూరో -
అభ్యర్థుల వెంట షాడో టీమ్‌లు
* నామినేషన్ల ఉపసంహరణ పూర్తయ్యేదాకా విపక్షాల్లో టెన్షన్ * ఎమ్మెల్సీ ఎన్నికల చేదు అనుభవాల భయం * అనుమానితులకు చివరి రోజుదాకా బీ ఫారాలు ఇవ్వకూడదని నిర్ణయం * అభ్యర్థులను జాగ్రత్తగా చూసుకునే పనిలో కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో గత ఎమ్మెల్సీ ఎన్నికల నాటి చేదు అనుభవం ఎక్కడ ఎదురవుతుందోనని కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలు ఆందోళన చెందుతున్నాయి. గత డిసెంబర్లో జరిగిన స్థానిక సంస్థల కోటా ఎన్నికల్లో కొన్ని చోట్ల కాంగ్రెస్, మరికొన్ని చోట్ల టీడీపీ అభ్యర్థులు చివరి క్షణంలో నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో ఆరు ఎమ్మెల్సీ స్థానాలను టీఆర్ఎస్ ఏకగ్రీవంగా కైవసం చేసుకున్న ఉదంతం ఈ మూడు పార్టీలకు ఇప్పుడు వణుకు పుట్టిస్తోంది. గ్రేటర్లో మొత్తం 150 డివిజన్లలో సగం మహిళలకు కేటాయించడం కూడా తమ ఆందోళనకు కారణమని ఈ పార్టీల సీనియర్ నేతలు బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. టీడీపీ- బీజేపీల నుంచి పోటీ చేస్తున్న వారిలో 65 నుంచి 70 మంది కొత్తగా ఎన్నికల్లో పోటీ చేస్తుంటే, కాంగ్రెస్‌లోనూ అంతే సంఖ్యలో ఉన్నారు. మహిళలకు ఎక్కువ సంఖ్యలో డివిజన్లు రిజర్వు కావడంతో ఈ సమస్య ఏర్పడిందని, కొన్ని చోట్ల కొత్తవారికి కూడా టిక్కెట్లు ఇవ్వాల్సి వచ్చిందని కాంగ్రెస్‌కు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే చెప్పారు. ఈ విషయం బయటకు చెప్పలేక లోలోపల తామే తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని వాపోయారు. తన నియోజకవర్గంలో మహిళకు రిజర్వు అయిన ఓ డివిజన్లో తన భార్యకు టికెట్ కావాలని వచ్చిన వ్యక్తి రూ.5 కోట్లు ఖర్చు చేస్తానని చెప్పడంతో అనుమానం వచ్చి విచారిస్తే ఉపసంహరణ పథకంలో భాగంగానే ఆ వ్యక్తి తన దగ్గరకు వచ్చాడని తేలిందని మరో మాజీ ఎమ్మెల్యే వివరించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న అంబర్‌పేట నియోజకవర్గంలో దాదాపు అన్ని డివిజన్లు మహిళలకు రిజర్వు చేశారు. పార్టీలో చాలాకాలం నుంచి ఉన్నవారు, తనకు తెలిసిన వారే అయినా ఉపసంహరణ దాకా జాగ్రత్తగా ఉండాలని తన సన్నిహితులకు బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. చివరి క్షణంలో తప్పుకుంటే... ఎవరైనా చివరి క్షణంలో పోటీ నుంచి తప్పుకుంటారని అనుమానం వస్తే వారి వెంటే షాడో టీమ్‌లను ఏర్పాటు చేయాలని టీడీపీ, బీజేపీ ప్రాథమికంగా నిర్ణయించుకున్నాయి. దీనికోసం నమ్మకస్తులైన పార్టీ నేతలు, సీనియర్ కార్యకర్తలతో టీమ్‌లు ఏర్పాటు చేశారు. నామినేషన్ పరిశీలన పూర్తయిన నాటి నుంచి ఉపసంహరణ గడువు పూర్తయ్యేదాకా ఈ షాడో టీమ్‌లు అభ్యర్థుల కదలికలను పర్యవేక్షిస్తుంటాయి. ఎవరైనా తప్పుకుంటున్నారని సమాచారం అందితే అదనంగా నామినేషన్ వేసిన అభ్యర్థి తరఫున ఎన్నికల రిటర్నింగ్ అధికారికి బీ ఫారమ్ అందజేస్తారు. -
షాడో బృందాలు.. ఫ్లయింగ్ స్క్వాడ్లు!
* ఎన్నికల్లో అభ్యర్థుల వ్యయ నియంత్రణకు ఈసీ చర్యలు * ప్రత్యేక బ్యాంక్ ఖాతా, చెక్కుల ద్వారానే లావాదేవీలు * పరిమితి మించితే క్రిమినల్ కేసులు * పెయిడ్ న్యూస్ నిర్ధారణకు కమిటీలు * అక్రమాలపై ఫిర్యాదులకు టోల్‌ఫ్రీ నంబర్ 1950 * భారత ఎన్నికల కమిషన్ డెరైక్టర్ జనరల్ పీకే దాస్ వెల్లడి సాక్షి, హైదరాబాద్: ఎన్నికల్లో ధన ప్రభావాన్ని నియంత్రించే దిశగా ఎన్నికల సంఘం పలు చర్యలు చేపట్టనుందని భారత ఎన్నికల సంఘం డెరైక్టర్ జనరల్(డీజీ) పీకే దాస్ వెల్లడించారు. అందుకు మీడియా కూడా సహకరించాలని కోరారు. ఎన్నికల్లో వ్యయ నియంత్రణ, పెయిడ్ న్యూస్ తదితర అంశాలపై బుధవారం హైదరాబాద్‌లో మీడియా ప్రతినిధులతో జరిగిన చర్చాగోష్టిలో దాస్ పాల్గొన్నారు. ఆయన ఏమన్నారంటే... అభ్యర్థులు ఎన్నికల ఖర్చుకు ప్రత్యేకంగా బ్యాంకు ఖాతా తెరచి దాని ద్వారా చెక్కు రూపంలోనే చెల్లింపులు జరిపేలా నిబంధన పెడుతున్నాం. పరిమితికి మించి వ్యయం చేస్తే క్రిమినల్ కేసులు పెట్టడంతోపాటు గెలిచిన అభ్యర్థులను అనర్హులుగా ప్రకటిస్తాం. వచ్చే ఎన్నికల్లో అభ్యర్థుల వ్యయాన్ని నిశితంగా పరిశీలించేందుకు షాడో బృందాలు పనిచేస్తాయి. షెడ్యూల్ ప్రారంభం నుంచి అభ్యర్థులు చేసే ప్రతి చర్యనూ పరిశీలించి ప్రతి అంశాన్నీ ఎన్నికల వ్యయంలో చేర్చుతూ రోజువారీ నివేదికలు రూపొందిస్తాయి. డబ్బు, మద్యం రవాణాను అడ్డుకునేందుకు ప్రత్యేక ఫ్లయింగ్ స్క్వాడ్‌లతోపాటు చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తాం. అభ్యర్థులకు అనుకూలంగా వచ్చే పెయిడ్ న్యూస్‌ను ఎన్నికల సంఘం నిశితంగా పరిశీలించి సంబంధిత ఖర్చును వారి వ్యక్తిగత ఎన్నికల వ్యయంలో జమ చేస్తుంది. పెయిడ్ కథనాలకు సంబంధించి ఎన్నికల సంఘం ఇచ్చే నోటీసులకు 48 గంటల్లో అభ్యర్థులు సమాధానాలు ఇవ్వాలి. పెయిడ్‌న్యూస్ కథనాలు పరిశీలించి తగు చర్యలు తీసుకునేందుకు జిల్లా, రాష్ట్రస్థాయిల్లో కమిటీలు ఏర్పాటు చేస్తాం. వాటిలో అనుభవజ్ఞులైన మీడియా ప్రతినిధులను కూడా నియమిస్తాం. ఓటర్లను చైతన్యపరచడంలో ముందుండే మీడియా సంస్థలకు ప్రత్యేక అవార్డులు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నాం. ఎన్నికల్లో అక్రమాలు, డబ్బు, నజరానాల పంపిణీ వంటి ఫిర్యాదుల కోసం టోల్‌ఫ్రీ నంబరు 1950ని ఏర్పాటు చేస్తాం. దీనికి వచ్చే ప్రతి ఫిర్యాదును రికార్డు చేయడంతోపాటు విచారణ తర్వాత చర్యల నివేదికను కూడా ఫిర్యాదుదారులకు అందజేస్తాం. కొన్ని పార్టీలకు సొంత వార్తాచానళ్లు ఉన్నాయని అవి ఆయా పార్టీలకు బహిరంగంగా మద్దతు పలుకుతున్నందున వాటిని ఎలా నియంత్రిస్తారనే ప్రశ్నకు.. దీనికి ప్రత్యేక నిబంధనలేవీ లేవని దాస్ స్పష్టం చేశారు. పెయిడ్‌న్యూస్ కథనాలకు మాత్రమే ఎన్నికల సంఘం నిబంధనలు రూపొందించిందని, పార్టీల వ్యయంపై పరిమితి ఏమీ లేదన్నారు. ఆయా పార్టీల ప్రచారంలో అభ్యర్థులపై ప్రత్యేక ప్రకటనలు, కథనాలు వస్తే మాత్రం ఆ ఖర్చును ఆయా అభ్యర్థుల ఖాతాలో వేస్తారని తెలిపారు. ఎన్నికల వ్యయం విషయంలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు అతి సున్నిత కేటగిరీలో ఉన్నాయన్నారు.