అభ్యర్థుల వెంట షాడో టీమ్‌లు
* నామినేషన్ల ఉపసంహరణ పూర్తయ్యేదాకా విపక్షాల్లో టెన్షన్
* ఎమ్మెల్సీ ఎన్నికల చేదు అనుభవాల భయం
* అనుమానితులకు చివరి రోజుదాకా బీ ఫారాలు ఇవ్వకూడదని నిర్ణయం
* అభ్యర్థులను జాగ్రత్తగా చూసుకునే పనిలో కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో గత ఎమ్మెల్సీ ఎన్నికల నాటి చేదు అనుభవం ఎక్కడ ఎదురవుతుందోనని కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలు ఆందోళన చెందుతున్నాయి.
గత డిసెంబర్‌లో జరిగిన స్థానిక సంస్థల కోటా ఎన్నికల్లో కొన్ని చోట్ల కాంగ్రెస్, మరికొన్ని చోట్ల టీడీపీ అభ్యర్థులు చివరి క్షణంలో నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో ఆరు ఎమ్మెల్సీ స్థానాలను టీఆర్‌ఎస్ ఏకగ్రీవంగా కైవసం చేసుకున్న ఉదంతం ఈ మూడు పార్టీలకు ఇప్పుడు వణుకు పుట్టిస్తోంది. గ్రేటర్‌లో మొత్తం 150 డివిజన్లలో సగం మహిళలకు కేటాయించడం కూడా తమ ఆందోళనకు కారణమని ఈ పార్టీల సీనియర్ నేతలు బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు.
టీడీపీ- బీజేపీల నుంచి పోటీ చేస్తున్న వారిలో 65 నుంచి 70 మంది కొత్తగా ఎన్నికల్లో పోటీ చేస్తుంటే, కాంగ్రెస్‌లోనూ అంతే సంఖ్యలో ఉన్నారు. మహిళలకు ఎక్కువ సంఖ్యలో డివిజన్లు రిజర్వు కావడంతో ఈ సమస్య ఏర్పడిందని, కొన్ని చోట్ల కొత్తవారికి కూడా టిక్కెట్లు ఇవ్వాల్సి వచ్చిందని కాంగ్రెస్‌కు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే చెప్పారు. ఈ విషయం బయటకు చెప్పలేక లోలోపల తామే తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని వాపోయారు. తన నియోజకవర్గంలో మహిళకు రిజర్వు అయిన ఓ డివిజన్‌లో తన భార్యకు టికెట్ కావాలని వచ్చిన వ్యక్తి రూ.5 కోట్లు ఖర్చు చేస్తానని చెప్పడంతో అనుమానం వచ్చి విచారిస్తే ఉపసంహరణ పథకంలో భాగంగానే ఆ వ్యక్తి తన దగ్గరకు వచ్చాడని తేలిందని మరో మాజీ ఎమ్మెల్యే వివరించారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న అంబర్‌పేట నియోజకవర్గంలో దాదాపు అన్ని డివిజన్లు మహిళలకు రిజర్వు చేశారు. పార్టీలో చాలాకాలం నుంచి ఉన్నవారు, తనకు తెలిసిన వారే అయినా ఉపసంహరణ దాకా జాగ్రత్తగా ఉండాలని తన సన్నిహితులకు బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం.
చివరి క్షణంలో తప్పుకుంటే...
ఎవరైనా చివరి క్షణంలో పోటీ నుంచి తప్పుకుంటారని అనుమానం వస్తే వారి వెంటే షాడో టీమ్‌లను ఏర్పాటు చేయాలని టీడీపీ, బీజేపీ ప్రాథమికంగా నిర్ణయించుకున్నాయి. దీనికోసం నమ్మకస్తులైన పార్టీ నేతలు, సీనియర్ కార్యకర్తలతో టీమ్‌లు ఏర్పాటు చేశారు. నామినేషన్ పరిశీలన పూర్తయిన నాటి నుంచి ఉపసంహరణ గడువు పూర్తయ్యేదాకా ఈ షాడో టీమ్‌లు అభ్యర్థుల కదలికలను పర్యవేక్షిస్తుంటాయి. ఎవరైనా తప్పుకుంటున్నారని సమాచారం అందితే అదనంగా నామినేషన్ వేసిన అభ్యర్థి తరఫున ఎన్నికల రిటర్నింగ్ అధికారికి బీ ఫారమ్ అందజేస్తారు.