అభ్యర్థులతో టీడీపీ అధినేత చంద్రబాబు వర్క్‌షాప్
అభ్యర్థుల పని తీరుపై సర్వే ఉంటుందన్న బాబు
25 రోజుల తర్వాత ఫోన్లు వస్తాయని.. పరోక్షంగా అభ్యర్థితత్వం మార్పుపై బెదిరింపులు
సీట్లు రానివాళ్లు త్యాగం చేశారంటూ వ్యాఖ్యలు
జనసేన కార్యకర్తలతో మీరే సమన్వయం చేసుకోవాలంటూ నాదెండ్ల సూచన
నాదెండ్ల వ్యాఖ్యలపై మండిపడుతున్న టీడీపీ శ్రేణులు
సాక్షి, విజయవాడ: టీడీపీ అధినేత చంద్రబాబు.. పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు షాకిచ్చారు. రానున్న 25 రోజుల్లో వారి పని తీరుపై సర్వేలు జరిపి అంచనా వేస్తానని బాబు చెప్పుకొచ్చారు. సర్వేల్లో అనుకూల ఫలితాలు రాకపోతే పార్టీ ఆఫీసు నుంచి ఫోన్లు వస్తాయని.. పరోక్షంగా అభ్యర్థి మార్పు కూడా ఉండొచ్చని సంకేతాలిచ్చారు.
కాగా, టీడీపీ అభ్యర్థులకు నేడు విజయవాడలో వర్క్ షాప్ జరిగింది. ఈ కార్యక్రమానికి చంద్రబాబు, నాదెండ్ల మనోహర్, బీజేపీ నుంచి పాతూరి నాగభూషణం హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో సీటు రాని వారంతా కేవలం త్యాగం చేశారు అంతే. రాష్ట్ర ప్రయోజనాల కోసమే పొత్తులు పెట్టుకున్నాం. ఏకైక అభిప్రాయంతో జనసేన ముందుకు వచ్చింది. పద్ధతి ప్రకారం రాజకీయం చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా పొత్తుకు పవన్ ముందుకు వచ్చారు. జనసేన కార్యకర్తలు కూడా ఒక పద్ధతి ప్రకారం పని చేస్తున్నారు.
రాష్ట్రంలో కూటమి పొత్తులో భాగంగా టీడీపీలో 31 మందికి సీట్లు ఇవ్వలేకపోయాం. సీట్లు రానివారు కష్టపడలేదని కాదు.. రాష్ట్రం కోసం త్యాగం చేస్తున్నారు. మూడు పార్టీల పొత్తు తర్వాత చాలా జాగ్రత్తగా అభ్యర్థుల ఎంపిక చేశాం. రాజకీయాల్లో అభ్యర్థుల ఎంపిక అనేది చాలా కీలకం. అభ్యర్థుల ఎంపికలో తప్పు చేస్తే కొన్ని సీట్లు పోయే ప్రమాదం ఉంది. సమర్ధులైన వ్యక్తులను ఎంపిక చేయకపోతే ప్రజల ఆమోదం ఉండదు. డబ్బు సంపాదన ఒక్కటే కాదు సమాజానికి ఉపయోగపడాలన్న ఆలోచన వస్తున్నందుకు ధన్యవాదాలు.
రాబోయే రోజుల్లో డబ్బుతో కాకుండా సేవాభావంతోనే ముందుకొచ్చే పరిస్థితి తీసుకురావాలి. ఇవాళ కొంతమందికి సీట్లు ఇవ్వకపోవచ్చు.. వాళ్లు చేసిన త్యాగం ఎప్పటకీ ఉంటుంది. నమ్మిన సిద్ధాంతం కోసం వాళ్లు కష్టపడి పని చేశారని అన్నారు. ఇదే సమయంలో టీడీపీ అభ్యర్థులకు షాకిచ్చారు. టిక్కెట్ దక్కిందని సంబురపడకండి. రానున్న 25 రోజుల్లో మీ పనితీరుపై మళ్లీ అంచనాలు వేస్తాను. సర్వేల్లో అనుకూలంగా రాకపోతే పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్లు వస్తాయని వార్నింగ్ ఇచ్చారు. ఇక, చంద్రబాబు వ్యాఖ్యలతో అభ్యర్ధుల్లో కలవరం చోటుచేసుకుంది.
మరోవైపు, జనసేన నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. జనసేన కార్యకర్తలతో మీరే సమన్వయం చేసుకోవాలి. ఇబ్బందులు వస్తే అప్పుడు ఇరు పార్టీల అధినాయకత్వంతో చర్చిస్తాం అని అన్నారు. దీంతో, నాందెడ్ల వ్యాఖ్యలపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment