మీ ఇంటికొచ్చాం.. మీ నట్టింటికొచ్చాం...
దొంగవాహనాల సీజ్ పేరుతో గ్రామాల్లో పోలీసులు హల్‌చల్ చేశారు. శనివారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో జనమంతా ఆదమరిచి నిద్రించే వేళ ఊళ్లలోకి ప్రవేశించారు. ఇంటిముందు వాహనం కనిపిస్తే చాలు ఆ ఇంటికి వెళ్లారు. నిద్రలేపి మరీ బండి కాగితాలు చూపించమని ప్రశ్నించారు. ఏ ఒక్క కాగితం లేకపోయినా సమీప పోలీస్‌స్టేషన్లకు వాహనాలను తరలించారు. పోలీసులు చేసిన ఈ వినూత్న ప్రయోగమేమోగానీ..వేళకాని వేళ ఊళ్లలోకి ప్రవేశించి నిద్రిస్తున్న వారిని ఇబ్బందులకు గురిచేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది.
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: శనివారం తెల్లవారుజామున 3:30 గంటల సమయం... అందరూ ఆదమరిచి నిద్రలో ఉన్న వేళ... పోలీసులు మూకుమ్మడిగా గ్రామాల్లోకి ప్రవేశించారు.... నిద్రపోతున్న వారినీ వదల్లేదు...తలుపులు వేసి ఉంటే తట్టి మరీ లేపారు...ఇది ఒకటి, రెండు గ్రామాల్లో కాదు... జిల్లాలోని 124 గ్రామాల్లో... అది కూడా ఏకకాలంలో... ఇదంతా చదువుతుంటే.. ఇంత హంగామా ఎందుకు...? మావోయిస్టులేమైనా జిల్లాలోకి వచ్చారా? లేదంటే టైస్టులు సంచరిస్తున్నారని ఇంటెలిజెన్స్ బ్యూరో ఏమైనా జిల్లా పోలీసు యంత్రాంగానికి హెచ్చరికలు పంపిందా...? అని అనుకుంటున్నారా.. అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే... ఇదంతా ఎందుకో తెలుసా? గ్రామాల్లో ఉన్న దొంగ వాహనాలను పట్టుకునేందుకట.
లెసైన్సులు, ఇతర కాగితాలు లేకుండా జిల్లాలో తిరుగుతున్న వాహనాలను నియంత్రించేందుకట. వాహనాల తనిఖీ పేరుతో జిల్లా పోలీసు యంత్రాంగం శనివారం విన్నూత్నంగా చేపట్టిన ఈ ‘ఆపరేషన్ దొంగ వాహనాల’ ప్రక్రియ ఒక రకంగా జిల్లా ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించింది. ఎన్నడూ లేనివిధంగా తెల్లవారుతుండగానే పోలీసులు ఊర్లోకి ఎందుకు వచ్చారో అర్థం కాక గ్రామస్తులు ఆందోళనలకు గురయ్యారు. పోలీసులు చేపట్టిన ఈ ఆపరేషన్ దొంగ వాహనాలను పట్టుకునేందుకే అయినా ఆ ఆపరేషన్ నిర్వహించిన తీరు విమర్శలకు తావిస్తోంది.
పీఎస్‌కో రెండు గ్రామాలు
జిల్లాలో తిరుగుతున్న దొంగ వాహనాలను పట్టుకోవాలని పోలీసుశాఖ నిర్ణయించింది. అందులో భాగంగా జిల్లా పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా పోలీసులు పెద్ద ఎత్తున ఆపరేషన్ చేపట్టారు. ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలో రెండు గ్రామాలను ఎంచుకున్నారు. అంతే... ఆ గ్రామాల్లోకి వెళ్లిపోయారు. తెల్లవారుజామున 3:30 నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమం కొన్ని గ్రామాల్లో అయితే 9 గంటల వరకు కొనసాగింది. పోలీసులు వెళుతున్న సమయంలో ఏదైనా వాహనం కనిపిస్తే చాలు ఆ ఇంట్లోకి వెళ్లి బండి కాగితాలు చూపించాలని అడిగారు. ఏ చిన్న కాగితం లేకపోయినా వాహనాన్ని సీజ్ చేసి సంబంధిత పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
ఇలా జిల్లా మొత్తంమీద 62 పీఎస్‌ల పరిధిలో 403 వాహనాలను సీజ్ చేసినట్టు అధికారికంగానే చెప్పారు. ఇందులో ద్విచక్రవాహనాలు, ట్రాక్టర్లు, ఆటోలు, లారీలు ఉన్నాయి. ఆపరేషన్ దొంగ వాహనాల ప్రక్రియలో భాగంగా పోలీసులు మూకుమ్మడిగా గ్రామాల్లోకి ప్రవేశించడం చర్చనీయాంశం అయింది. కొన్ని గ్రామాల్లో అయితే ప్రజలు పలు రకాలుగా చర్చించుకున్నారు. గ్రామంలోకి మావోయిస్టులు వచ్చి ఉంటారని.. అందుకే ఇంతమంది పోలీసులు వచ్చి తనిఖీలు చేస్తున్నారని కొందరు, ఇంతమంది పోలీసులు వచ్చారంటే ఏదో జరిగే ఉంటుందని మరికొందరు... ఇలా రకరకాలుగా చర్చించుకోవడం కనిపించింది. అయితే శనివారం తనిఖీలు జరిపిన గ్రామాల పరిసరాల ప్రజల్లో మరో అలజడి మొదలైంది.
పోలీసులు మళ్లీ తమ గ్రామంలోకి ఎప్పుడొస్తారో..? అనే ఆందోళలో ఆయా గ్రామాల ప్రజలున్నారు. మరోవైపు వ్యవసాయ పనులు చేయాల్సిన ట్రాక్టర్లను కూడా కాగితాలు లేవంటూ స్టేషన్‌కు తీసుకెళ్లారని కొన్ని గ్రామాలకు చెందిన రైతులు ఆరోపిస్తున్నారు. ఏ చిన్న కాగితం లేకపోయినా, కనీసం కాగితాలు కూడా చూడకుండానే పోలీసులు తమ బండ్లను తీసుకెళ్లారని మరికొందరు చెపుతున్నారు. పోలీసులు తీసుకెళ్లిన వాహనాల కోసం తాము స్టేషన్ల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. పోలీసుల పరమార్థం ఏదైనా ఆపరేషన్ దొంగవాహనాల ప్రక్రియ మాత్రం జిల్లాలో హల్‌చల్ సృష్టించిందనడంలో సందేహం లేదు.