నోట్లను కత్తిరించి విసిరేశారు..
కోల్కతా: 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించాక నల్లధనం దాచుకున్న కుబేరులు హడలిపోతున్నారు. పన్ను చెల్లించకుండా బ్లాక్ మనీ రూపంలో పెద్దమొత్తంలో పెద్ద నోట్లను దాచుకున్న ధనవంతులు ఇరకాటంలో పడ్డారు.
కొందరు నోట్లను చెత్తకుండీల్లో పడేస్తే, యూపీలో మరికొందరు పెద్ద నోట్లను కాల్చి గంగా నదిలో విసిరేశారు. తాజాగా కోల్కతాలో గుర్తు తెలియని కుబేరులు పెద్ద నోట్లను కత్తిరించి బయట పారేశారు. ఆదివారం నగరంలోని గోల్ఫ్ క్లబ్ సమీపంలో కుప్పలు కుప్పలుగా పడి ఉన్న కత్తిరించిన నోట్లను స్థానికులు గుర్తించారు. సగానికి చినిగిపోయిన 500, 1000 రూపాయల నోట్లు పెద్ద ఎత్తున కనిపించాయి. ఈ విషయం తెలియడంతో పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు చెప్పారు.