సీఎం కేసీఆర్‌కు షబ్బీర్‌అలీ సవాల్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి జైళ్లు కొత్తకాదని, స్వాతంత్ర్యం తెచ్చిన ఘనత తమ పార్టీదని శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ పేర్కొన్నారు. దమ్ముంటే కాంగ్రెస్ నేతలపై కేసులు పెట్టిచూడాలని ఆయన సీఎం కేసీఆర్‌కు సవాల్ సవాల్ చేశారు. ’తేల్చుకుందా రా’ అంటూ సీఎం చంద్రశేఖర్‌రావు మాట్లాడుతున్న భాష, పదజాలం ఏ మాత్రం హుందాగా లేదని విమర్శించారు. పొంగులేటి సుధాకర్ రెడ్డితో కలిసి ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి అన్‌పార్లమెంటరీ భాషను వాడిన కేసీఆర్ తన పదజాలాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రజల దృష్టిని మళ్లించేవిధంగా మైండ్‌గేమ్ ఆడుతూ, ప్రజల సమస్యలను మరుగునపడేస్తున్నారని, అందుకే రెచ్చగొట్టే పదజాలాన్ని సీఎం కేసీఆర్ వాడుతున్నారని విమర్శించారు. కేవలం ఒక్కరోజుకే అసెంబ్లీని పరిమితం చేయకుండా కనీసం 15 రోజులపాటు నడిపించాలని కోరారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతీయేటా 50 రోజులకుపైగా అసెంబ్లీ నిర్వహించామన్నారు. ఇప్పుడు ఏడాదంతా 18 రోజులకే పరిమితమైందని, సభలో చర్చ అంటే సీఎం కేసీఆర్‌కు వణుకు పుడుతున్నదని విమర్శించారు. సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే సవాళ్లు చేస్తున్నారని పొంగులేటి విమర్శించారు. కేసీఆర్ మాట్లాడిన భాషను మార్చుకోవాలని, ఉపసంహరించుకుంటే హూందాగా ఉంటుందని పొంగులేటి సూచించారు.