'డబుల్ బెడ్ రూమ్ ట్రబుల్గా మారింది'
హైదరాబాద్: డబుల్ బెడ్రూమ్ స్కీమ్ ఇప్పుడు ట్రబుల్ బెడ్ రూమ్ స్కీమ్గా మారిందని తెలంగాణ సీఎల్పీ నాయకుడు జానారెడ్డి ఆరోపించారు. గాంధీభవన్లో ఆదివారం కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో హైదరాబాద్ నగర నేతలతో పాటు పలువురు తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేతలు హాజరు అయ్యారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నాయకులు చర్చించారు.
ఈ సందర్భంగా జానారెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్కు తాగునీటి సమస్య లేకుండా చేసింది కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు. దానిని ప్రచారం చేసుకోవడంలో కాంగ్రెస్ పార్టీ వెనుకబడిందన్నారు. ఏడాదిన్నర కాలంలో కేసీఆర్ హైదరాబాద్కు తాగునీరిచ్చినట్లు ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం కేసీఆర్ వల్ల కాదని.. నిబంధనల వల్లే కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు 4 శాతం మించి రిజర్వేషన్లు ఇవ్వలేకపోయిందని చెప్పారు. అలాంటిది టీఆర్ఎస్ ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఏవిధంగా ఇస్తుందని ప్రశ్నించారు. గ్రేటర్లో టిక్కెట్ల కోసం గొడవలకు దిగి కాంగ్రెస్ పరువుతీయొద్దని జానారెడ్డి నాయకులను కోరారు.
టీఆర్ఎస్ ఏడాదిన్నర పాటు మెట్రోను జాప్యం చేయడం వల్లే రూ.600 కోట్ల భారం ప్రజలపై పడిందని కాంగ్రెస్ మండలి పక్షనేత షబ్బీర్ అలీ అన్నారు. సెటిలర్లను పరిరక్షించేది కాంగ్రెస్ పార్టీనేనని...త్వరలో ఎంఐఎం మాజీ కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని షబ్బీర్ చెప్పారు. మరో నేత వీహెచ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్లో కోవర్టులున్నారు, వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేతలు కొందరు తెలంగాణ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని వారిని హైకమాండ్ కట్టడి చేయాలని వీహెచ్ కోరారు.