సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఓడించేందుకు ఒక బాహుబలి వస్తాడన్న సీఎల్పీ నేత జానారెడ్డి చేసిన వ్యాఖ్యలపై అసెంబ్లీ లాబీల్లో శనివారం ఆసక్తికరమైన చర్చ జరిగింది. అధికార పార్టీ సభ్యులతోపాటు కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన వారు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దీనిపై సరదా వ్యాఖ్యలు జోడిస్తూ చర్చలకు దిగారు. ఏ ఇద్దరు నాయకులు కలిసినా.. విలేకరులు ఎదురైనా బాహుబలిపైనే జోకులు వేయడం కనిపించింది. బాహుబలి ఎవరో కాదు.. మాలో నుంచే ఒకరు వస్తారంటూ తనను కలసిన విలేక రులతో జానారెడ్డి వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ‘మీరు నా అంతరార్థాన్ని గ్రహించారేమో అనుకుంటున్నా...’ అంటూ విలేకరులకు ఓ పజిల్ విసిరారు. బాహుబలి బయట ఎక్కడ్నుంచో వస్తాడని అనలేదని, కాంగ్రెస్ నుంచే ఒక బాహుబలి వస్తాడని మరోసారి చెప్పారు. ‘‘కాంగ్రెస్ నాయకుల్లో ఎవరైనా బాహుబలి కావచ్చు. ఎవరికి వారే బాహుబలి అనుకుంటే తప్పేమీ లేదు. అప్పుడు విజయం మాదే కదా..’’ అని వ్యాఖ్యానించారు.
మా బాహుబలి ఆయనే: కోమటిరెడ్డి
కాంగ్రెస్‌కు బాహుబలి జానారెడ్డేనని ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌లో చాలామంది బాహుబలిలు ఉన్నారని, సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నారని ఆయన అన్నారు.
కేసీఆర్ చేసింది కట్టప్ప పనే: డీకే అరుణ
కట్టప్పలాంటి సీఎం కేసీఆర్‌ను ఓడించేందుకు కాంగ్రెస్‌లోనే ఒకరు బాహుబలిగా బలోపేతం అవుతామని ఎమ్మెల్యే డి.కె.అరుణ అన్నారు. జానారెడ్డి కూడా అదే చెప్పారని, కాంగ్రెస్‌లోనే బాహుబలి ఉన్నారన్నారు. బాహుబలి మొదటి భాగంలో కట్టప్ప వెన్నుపోటు పొడిచాడని, ఇప్పటిదాకా కేసీఆర్ చేసింది అదేనన్నారు. బాహుబలి రెండో భాగం వస్తోందని, ఇక రానున్నదంతా కట్టప్ప చరిత్రను ముగించేయడమేనన్నారు.
తెలంగాణకు నేనే బాహుబలి: సంపత్
తెలంగాణకు బాహుబలిని తానేనని కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ అన్నారు. ఢిల్లీలో బాహుబలి రాహుల్ గాంధీ అని పేర్కొన్నారు. తెలంగాణకు బాహుబలి సంపత్ అని జానారెడ్డి చెప్పారని వెల్లడించారు. గతంలో అభిమన్యుడు అని వ్యాఖ్యానించిన జానారెడ్డి... ఇప్పుడు బాహుబలిగా తనకు ప్రమోషన్ ఇచ్చారన్నారు. టీఆర్‌ఎస్‌పై బాహుబలి స్థాయిలో పోరాడుతానని చెప్పారు.
సత్తా లేని వారని ఒప్పుకున్నారు: జగదీశ్‌రెడ్డి
కాంగ్రెస్‌లో సత్తా ఉన్న బాహుబలి వంటివారెవరూ లేరని జానారెడ్డి అంగీకరించినట్టుగా ఉందని మంత్రి జగదీశ్‌రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ వాస్తవ పరిస్థితిని అంగీకరించిం దన్నారు. టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనే వారెవరూ కాంగ్రెస్‌లో లేరన్న విషయాన్ని అంగీకరించడంతోపాటు, సత్తాలేని వారంతా కాంగ్రెస్‌లోనే ఉన్నారని స్వయంగా జానారెడ్డి అంగీకరించారని చెప్పారు. కాంగ్రెస్‌లో సత్తా ఉన్నవారె వరూ లేరని ఏడాది క్రితమే తెలిసిందని కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్‌లో ఉన్నవారంతా నాజర్ క్యారెక్టర్లేనని వ్యాఖ్యానించారు.