కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు! నల్గొండలో ప్రచారానికి వచ్చి కాంగ్రెస్ గోసీలు ఊడిపోతాయని అన్నారని, అధికారం కోల్పోతే టీఆర్‌ఎస్‌కు లాగులు ఊడుతాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి వ్యాఖ్యానించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ పార్టీ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని అన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేమన్న భయంతోనే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వచ్చారని పేర్కొన్నారు. రుణమాఫీ ఏకకాలంలో చేయకపోవటం వల్ల వడ్డీ భారం రైతులపై పడిందన్నారు. అసెంబ్లీలో నిలదీస్తే వడ్డీ మాఫీ చేస్తామని చెప్పిన కేసీఆర్ మాట నిలుపుకోలేదని మండిపడ్డారు.
కాంగ్రెస్ రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకంతో 2లక్షలు ఇచ్చిందని, తద్వారా లబ్ధిపొందిన వారు భూములు అమ్ముకోకుండా కాంగ్రెస్ కాపాడిందని చెప్పారు. తాము చేసిన సంక్షేమ పథకాల కింద రైతు బంధు పథకం ఏ పాటిది అంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణలో ఆత్మగౌరవం కోల్పోయామని, కేసీఆర్‌కు అహంకారం ఎక్కువైందని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌కు అధికారం లేకపోతే అహంకారం పోతుందని అన్నారు. కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తే అణిచివేత ధోరణి అవలంభిస్తారని చెప్పారు. కేసీఆర్ ఒక్క నిమిషం కూడా అధికారంలో ఉండకూడదని ప్రజలు అనుకుంటూన్నారని, కేసీఆర్‌ను గద్దెదించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment