భయంతోనే టీఆర్ఎస్ కు ఓటేశారు: షబ్బీర్
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుపై శాసనమండలి కాంగ్రెస్ పక్షనేత షబ్బీర్ ఆలీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వరంగల్లో టీఆర్ఎస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని....టీఆర్ఎస్కు ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని బెదిరించారని ఆయన బుధవారమిక్కడ ఆరోపించారు.
ప్రశ్నించిన వారిని జైలులో పెట్టడంతో ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారని, అందుకే ఓటర్లు భయంతో టీఆర్ఎస్కు ఓటేశారని షబ్బీర్ అన్నారు. వరంగల్ గెలుపుతో ప్రజలు తమ వైపే ఉన్నారని కేసీఆర్ అంటున్నారని...అలా అయితే, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని కేసీఆర్కు షబ్బీర్ ఆలీ సవాల్ విసిరారు. తమ సవాల్ను సీఎం స్వీకరిస్తారని అనుకుంటున్నానని ఆయన అన్నారు.
ప్రతిపక్షాలు సలహాలు, సూచనలు ఇవ్వాలన్న సీఎం సలహాలిచ్చే అవకాశాన్ని కల్పించడం లేదని ఎద్దేవా చేశారు. అఖిలపక్ష సమావేశాలు కేసీఆర్ ఏర్పాటు చేయరు, అసెంబ్లీలో మాట్లాడనీవ్వడం లేదని అన్నారు. అందుకే సలహాలు, సూచనలు మీడియా ద్వారానే ఇస్తున్నానని అయిన కూడా కేసీఆర్ స్వీకరించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.