
సునందను థరూర్ ఆస్పత్రికి తీసుకెళ్లలేదు!
సునందా పుష్కర్ స్పృహలేకుండా పడి ఉన్నా.. ఆమె పలకకపోయినా ఆమె భర్త శశి థరూర్ మాత్రం ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లలేదట! ఈ విషయాన్ని ఆ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు, కేప్ వెర్డెలో గౌరవ కాన్సల్ జనరల్ సంజయ్ దేవన్ చెప్పారు. ఆయనను సిట్ బృందం ప్రశ్నించనుంది. శశి థరూర్ తనకు 2006 నుంచి తెలుసన్న ఆయన.. సునంద మరణించిన జనవరి 17 విషయం గురించి వివరించారు.
ఆరోజు సాయంత్రం 5 గంటలకు థరూర్ ఇంటి పనిమనిషి నారాయణ్ సింగ్ తనకు ఫోన్ చేసి, సునంద హోటల్లోనే ఉన్నారని.. కలవాలంటే హోటల్కు రావచ్చని చెప్పాడన్నారు. అయితే, ఆమె ఏమీ తినట్లేదని, అందువల్ల ఆమెను ఏదైనా తినేలా నచ్చజెప్పాలని కూడా కోరాడన్నారు. రాత్రి 8 గంటల సమయంలో శశిథరూర్ వచ్చి, డాక్టర్ను కలవాలని చెప్పారని, ఆరోజు రాత్రి 9 గంటలకు ఆయన టీవీలో కనిపించాల్సి ఉందని సంజయ్ దేవన్ అన్నారు.
అయితే రాత్రి 8.30 గంటల ప్రాంతంలో సునందను లేపేందుకు ప్రయత్నించిన థరూర్.. గట్టిగా అరిచారని, దాంతో ఏదో జరిగిందని అర్థమైందని చెప్పారు. తాము లోపలకు వెళ్లి చూడగా, థరూర్ హోటల్ యాజమాన్యానికి ఫోన్ చేసి డాక్టర్ను పంపాలని కోరారన్నారు. ఈలోపు గంగారాం ఆస్పత్రి నుంచి డాక్టర్ రజత్ మోహన్ వచ్చారని, ఆయన ఈసీజీ తీసి.. సునంద అప్పటికే మరణించినట్లు నిర్ధారించారని సంజయ్ దేవన్ తెలిపారు. ఆ విషయాన్ని థరూర్ తన సెక్రటరీ అభినవ్కు చెప్పారని, కొద్దిసేపటికే పోలీసులు వచ్చారని వివరించారు.