
పెళ్లయిన 30 ఏళ్లకు ఆ రహస్యాన్ని చెప్పింది!
షికాగోలో ఓ పుస్తక దుకాణాన్ని నడిపించే నాన్సీ ఫగిన్ (62) పెళ్లయి 30 ఏళ్లు అయింది. ఈ 30 ఏళ్లలో ఆమె ఎప్పుడూ ఓ రహస్యాన్ని భర్త రాన్ వెబర్ (75)కు చెప్పలేదు. కానీ ఇటీవల రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మహిళలపై అతి దుర్మార్గంగా చేసిన లైంగిక వ్యాఖ్యల టేప్ వెలుగుచూడటం అమెరికాలో పెద్ద దుమారం రేపింది.
ఈ నేపథ్యంలో నాన్సీ తొలిసారి తన భర్త ఎదుట నిజం చెప్పింది. తాను ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడు షికాగో చరిత్ర మ్యూజియంలో వాలంటీర్‌గా పనిచేశానని, ఆ సమయంలో సెక్యూరిటీ గార్డు తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని భర్తకు వివరించింది. ఆమెను ఓదార్చిన భర్త.. తన మొదటి భార్య కూడా ఏవిధంగా లైంగిక దాడుల బారిన పడిందో వివరించారు.
మహిళలను ముద్దుపెట్టుకోవడం, అసభ్యంగా తాకడం, వాళ్లతో లైంగిక కార్యకలాపాలలో పాల్గొనడం గురించి ట్రంప్ చేసిన దుర్మార్గపు వ్యాఖ్యల ఆడియో టేప్ వెలుగుచూడటం అమెరికాలో పెద్ద చర్చను లేవదీసింది. మహిళలపై ఇలాంటి దుర్మార్గపు వ్యాఖ్యలను ఎంతమాత్రం సహించేది లేదంటూ మిషెల్లీ ఒబామా ఇచ్చిన స్ఫూర్తిదాయకమైన ప్రసంగం మహిళలకు ప్రేరణగా నిలిచింది. అమెరికా అధ్యక్షుడు కావాలన్న ట్రంప్ ఆశలను భారీగా దెబ్బతీసిన ఈ టేప్‌తో అమెరికాలో ఇప్పుడు కొత్త తరహా చర్చ మొదలైంది. మహిళలు ఎదుర్కొంటున్న లైంగిన వేధింపుల గురించి చాలామంది జంటలు ఇప్పుడు చర్చించుకుంటున్నాయి. తొలిసారిగా మహిళలు తమ భర్తలకు, ప్రియులకు.. నైట్‌క్లబ్బుల్లో, సబ్‌వేలలో, వీధుల్లో, పనిచేసే చోట తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి వివరిస్తున్నారు. తమ చీకటి అనుభవాలను వెల్లడిస్తున్నారు. తమ పిల్లలు లైంగిక హింస బారిన పడకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలో చర్చించుకుంటున్నారు.
చాలావరకు ఇలా చీకటి అనుభవాలు భాగస్వాములు ఒకరితో ఒకరు పంచుకోవడం వారి అనుబంధాన్ని మరింతగా పెంపొందిస్తున్నా.. కొన్ని సందర్భాల్లో వీటిని వెల్లడించడం వల్ల చిక్కులూ ఎదురవుతున్నాయి. నార్త్ కరోలినాలో ఓ 52 ఏళ్ల మహిళ తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి తన భాగస్వామికి చెప్పడం వివాదానికి దారితీసింది. తాను బాలికగా ఉన్నప్పుడు లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానని ఆమె మహిళ చెప్పగా.. దానిని ఆమె భాగస్వామి తప్పుబట్టాడు. దీంతో వారిరువురు వీడిపోయి తలోదారి చూసుకున్నారు. ట్రంప్ దుర్మార్గమైన వ్యాఖ్యల టేప్ నేపథ్యంలో లైంగిక వేధింపులకు సంబంధించి ఇలాంటి ఎన్నో ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.