
కశ్మీర్ ఎమ్మెల్యేపై సిరా దాడి
ఢిల్లీలో విలేకర్ల సమావేశంలో అబ్దుల్ రషీద్‌పై దుశ్చర్య
♦ గోమాతను అవమానిస్తే సహించబోమన్న దుండగులు
♦ అసెంబ్లీలో ఇదివరకే బీజేపీ ఎమ్మెల్యేల చేతిలో దాడికి గురైన రషీద్
న్యూఢిల్లీ: బీఫ్ విందు ఇచ్చి జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో ఇటీవల బీజేపీ ఎమ్మెల్యేల చేతిలో దాడికి గురైన ఆ రాష్ట్ర స్వతంత్ర ఎమ్మెల్యే షేక్ అబ్దుల్ రషీద్‌పై సోమవారం దేశ రాజధానిలో సిరా దాడి జరిగింది. ఉధంపూర్ లో ట్రక్కు డ్రైవర్లపై జరిగిన దాడిని ఖండిస్తూ ప్రెస్‌క్లబ్‌లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసిన రషీద్‌పై హిందూ అతివాదులుగా భావిస్తున్న దుండగులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. సమావేశం ముగిశాక గేటు వద్ద టీవీ జర్నలిస్టులతో మాట్లాడుతున్న ఆయనను దుండగులు తోసేసి, ముఖానికి నల్లరంగు, సిరా, ఇంజిన్ ఆయిల్ పులిమారు. ‘గోమాతను అవమానిస్తే హిందుస్తాన్ సహించదు’ అని నినాదాలు చేశారు. రషీద్‌ను దాడి నుంచి కాపాడబోయిన కొంతమంది జర్నలిస్టులు, పోలీసుల ముఖాలపైనా సిరా, ఆయిల్ పడ్డాయి.
దాడికి సంబంధించి పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేసి పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అదనపు బలగాలు వచ్చేవరకు ఎమ్మెల్యేను ప్రెస్‌క్లబ్‌లో ఉంచి, తర్వాత బయటకు తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఉధంపూర్‌లో దాడి బాధితుల బంధువు అషఫ్‌ప్రైనా సిరా మరకలు పడ్డాయి. తర్వాత రషీద్, ఆయన అనుచరులు తమను రేస్‌కోస్ రోడ్డులోని ప్రధానమంత్రి నివాసానికి వెళ్లేందుకు అనుమతించాలని చాణక్యపురిలోని జమ్మూకశ్మీర్ హౌస్ ముందు ధర్నాచేశారు. ‘దాడి చేసినవాళ్లు మానసిక రోగులు. కశ్మీరీల గొంతును ఎలా నొక్కుతున్నారో ప్రపంచానికి చెప్పాలకున్నా’ అని రషీద్ అన్నారు.
అంతకు ముందు ప్రెస్ క్లబ్‌లో విలేకర్లతో మాట్లాడుతూ.. తన బీఫ్ విందుపై వివరణ ఇచ్చారు. తాను బీఫ్, మటన్, చికెన్ తిననని, అయితే మతవిషయాల్లో అధికారులు జోక్యం చేసుకోవద్దని చెప్పడానికి ఆ విందు ఇచ్చానన్నారు. ఉధంపూర్ ఘటనపై ప్రధాని క్షమాపణ చెప్పాలన్నారు. దాద్రీ ఘటనకు యూపీ ప్రభుత్వానికి బాధ్యత అయితే, ఉధంపూర్ ఘటనకు బీజేపీ, పీడీపీలది బాధ్యత అని అన్నారు. ఈ నెల 9న కశ్మీర్‌లోని ఉధంపూర్‌లో ఓ ట్రక్కుపై దుండగులు పెట్రోల్ బాంబు విసరడంతో అందులోని ఇద్దరు డ్రైవర్లు గాయపడ్డారు. వారిలో జహీద్(19) అనే యువకుడు ఢిల్లీ సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఆదివారం చనిపోయాడు. రషీద్‌పైదాడిని పలు పార్టీలు తీవ్రంగా ఖండించాయి. భిన్నాభిప్రాయాలను గౌరవించాలని, దేశంలో అసహనం, హింస పెరుగుతున్నాయని కశ్మీర్ సీఎం ముఫ్తీ మొహమ్మద్ సయీద్, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా తదితరులు పేర్కొన్నారు.
కశ్మీర్‌లో బంద్.. జహీద్ అంత్యక్రియలను అనంత్‌నాగ్ జిల్లాలోని అతని స్వగ్రామం బతెంగూలో పూర్తి చేశారు. అంతిమయాత్రలో పాక్ జెండాలు ప్రదర్శించారు. జహీద్ మృతికి నిరసనగా వేర్పాటువాదులు కశ్మీర్ లోయలో బంద్ నిర్వహించారు. పలుచోట్ల నిరసనకారులకు, పోలీసులకు మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి.ఉధంపూర్ దాడిని ఖండిస్తూ రాష్ట్ర కేబినెట్ ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. మృతుని కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామంది.