
స్కామ్ ఇండియా కాదు, స్కిల్ ఇండియా: మోడీ
న్యూఢిల్లీ: స్కాం ఇండియాను స్కిల్ ఇండియాగా మారాలన్నదే తన స్వప్నం అని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చెప్పారు. లోక్సభలో ఈరోజు ఆయన మాట్లాడుతూ యువతలో నైపుణ్యాలను పెంచడానికి సాహసోపేత నిర్ణయాలను తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సభలో తాను కొత్త సభ్యుడినని చెప్పారు. ఎన్నికలలో మాత్రమే మనం పోటీ దారులం, సభలో మాత్రం ప్రజల ఆకాంక్షలకు ప్రతినిధులం అన్నారు. ప్రపంచానికి మన సత్తా చాటాలన్నారు. పేదరికం నుంచి పేదవాళ్లని బయటపడేస్తామన్న ధీమా వ్యక్తం చేశారు. ధరలను తగ్గించేందుకు కృతనిశ్చయంతో ఉన్నట్లు తెలిపారు. అధికధరలను తగ్గించేందుకు రియల్ టైం డేటాను అందుబాలోకి తీసుకుకొస్తామని చెప్పారు.
యూపీ తరహా దారుణాలకు ఒడిగట్టేవారిపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మహిళలపై వేధింపులకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. మహిళలకు భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. మహిళలకు భద్రత ఇవ్వడం, వారిని గౌరవించడం 125 కోట్ల మంది భారతీయుల బాధ్యత అని చెప్పారు. ప్రజల నమ్మకాలను నిలబెడదామన్నారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు ప్రోత్సాహం ఇవ్వనున్నట్లు ప్రధాని తెలిపారు. గుజరాత్లో 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తామని చెబితి ఎవరూ నమ్మలేదు, అది సాధ్యం కాదన్నారు. అయితే అందరూ ముక్కుమీద వేలేసుకునేలా చేసి చూపించామని మోడీ చెప్పారు. ప్రతిపక్ష నేతల సందేహాలకు మోడీ సవివరంగా సమాధానాలు చెప్పారు. ఇచ్చిన హామీలు అన్నింటినీ చేసి చూపిస్తానని చెప్పారు.