అమెరికాలో హిమోత్పాతం
అట్లాంటా: అమెరికాలో అరుదైన హిమపాతం బీభత్సాన్ని సృష్టించింది. సాధారణంగా హిమపాతాన్ని ఎరుగని అమెరికా దక్షిణ ప్రాంతాన్ని మంచు తుపాను ముంచెత్తింది. మంచు తుపాను బారినపడి ఆరుగురు మరణించారు. టెక్సాస్ మొదలుకొని జార్జియా మీదుగా కరోలినాల వరకు గల పలు రాష్ట్రాలు మంచుతాకిడికి విలవిలలాడాయి. ఈ ప్రాంతాల్లో మంగళ, బుధవారాల్లో భారీస్థాయిలో మంచు కురవడంతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. రహదారులపై పేరుకుపోయిన మంచులో వాహనాలు ఎక్కడికక్కడ చిక్కుకుపోయాయి. పాఠశాలల నుంచి విద్యార్థులు ఇళ్లకు వెళ్లలేక పాఠశాలల్లోనే ఉండిపోయారు. పలు రాష్ట్రాల్లో వందలాది విమానాలు రద్దయ్యాయి. అట్లాంటాలో పలువురు వాహనదారులు మంచులో చిక్కుకుపోయిన వాహనాల్లోనే దాదాపు పద్దెనిమిది గంటలకు పైగా గడిపారు.
మంచు తుపానులో చిక్కుకుని అలబామాలో ఐదుగురు, జార్జియాలో ఒకరు మరణించారు. హూస్టన్ నుంచి అట్లాంటా వరకు గల విమానాశ్రయాల నుంచి రాకపోకలు జరిపే వందలాది విమానాలను రద్దు చేశారు. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే అట్లాంటా విమానాశ్రయంలోనే ఐదువందలకు పైగా విమానాలు నిలిచిపోయాయి. మంచులో కూరుకుపోయిన వాహనాల్లో చిక్కుకుపోయిన వారిని సురక్షితంగా వెలికితీసేందుకు సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. వాతావరణంలో బుధవారం స్వల్పంగా మెరుగుదల కనిపించినా, గురువారం వేకువ నుంచి దక్షిణ, ఆగ్నేయ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మళ్లీ పడిపోయాయి.