snow toofan
-
అమెరికాలో భారీ మంచు తుపాను
న్యూయార్క్/టోక్యో: అమెరికాలో బుధ, గురువారాల్లో కురిసిన తుపాను కారణంగా పలు ప్రాంతాల్లో 40 అంగుళాల మేర రోడ్లపై మంచు పేరుకుపోయింది. మంచు తుఫానుకు చలిగాలి తోడవడంతో న్యూఇంగ్లాండ్ప్రాంతంలోని రాష్ట్రాల్లో, మిడ్ అట్లాంటిక్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నారు. మంచు తుఫానుతో ప్రభావితం అవుతారని భావిస్తున్న 60 లక్షల మందిని అప్రమత్త పరిశీలనలో ఉంచినట్లు అధికారులు చెప్పారు. పలు విమానాశ్రయాల్లో మంచు పేరుకుపోతోందని తెలిపారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. తుపాను తగ్గగానే మంచు తవ్వే ప్రక్రియ ఆరంభిస్తామన్నారు. ఒకటీ రెండు రోజుల్లో తుపాను కాస్త తగ్గు ముఖం పట్టవచ్చని అంచనా. జపాన్‌లో జా..మ్ గురువారం రాత్రి నుంచి మంచు తుపాను కారణంగా జపాన్‌లో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దాదాపు 15 కిలోమీటర్ల పొడవున వాహనాలు ఆగిపోగా, సుమారు 1000 మందికి పైగా ఇందులో చిక్కుకుపోయారు. టోక్యో, నైగటాలను కలిపే కనెట్సు ఎక్స్‌ప్రెస్‌వేలో ట్రాఫిక్ జామ్ బుధవారం నుంచి ఆరంభమై, గురువారం నాటికి తీవ్రతరమైంది. దీంతో ప్రస్తుతం సదరు రహదారి ఎంట్రన్స్‌ను అధికారులు మూసివేసి ట్రాఫిక్ క్లియరెన్సు చేపట్టారు. ట్రాఫిక్ నిలిచిపోవడంతోప్రయాణికులు, బైక్ చోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శుక్రవారానికి ఇంకా 1000కిపైగా కార్లు నిలిచిపోయి ఉన్నట్లు అధికారులు చెప్పారు. వాహనదారులకు ఆహారం, నీరు, ఇంధనం అందిస్తున్నారు. అయితే, తీవ్రమైన చలి వారిని భయపెడుతోంది. -
మంచు తుఫాన్లో నలుగురు సైనికుల మృతి
న్యూఢిల్లీ: సియాచిన్లోని ఉత్తర సెక్టార్లో సోమవారం మంచు తుఫాన్లో చిక్కుకుని నలుగురు సైనికులు, ఇద్దరు కూలీలు ప్రాణాలు కోల్పోయారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో 8 మంది సైనికులు సియాచిన్‌లో సుమారు 19 వేల అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు మంచు తుఫాన్లో చిక్కుకున్నారని అధికారులు తెలిపారు. వారిని గుర్తించి, వెలికి తీసేందుకు సహాయక బృందాలను సంఘటనాస్థలికి పంపామన్నారు. మంచు కింది చిక్కుకుపోయిన 8 మందిని వెలికి తీశామని, వారిలో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారని వెల్లడించారు. క్షతగాత్రులను వెంటనే హెలికాప్టర్ల ద్వారా మిలిటరీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినట్లు వివరించారు. వైద్యులు తీవ్రంగా శ్రమించినప్పటికీ నలుగురు జవాన్లు, ఇద్దరు కూలీలు మరణించారని వెల్లడించారు. ఈ మేరకు వారి కుటుంబసభ్యులకు సమాచారమిచ్చామన్నారు. -
అమెరికాలో హిమోత్పాతం
అట్లాంటా: అమెరికాలో అరుదైన హిమపాతం బీభత్సాన్ని సృష్టించింది. సాధారణంగా హిమపాతాన్ని ఎరుగని అమెరికా దక్షిణ ప్రాంతాన్ని మంచు తుపాను ముంచెత్తింది. మంచు తుపాను బారినపడి ఆరుగురు మరణించారు. టెక్సాస్ మొదలుకొని జార్జియా మీదుగా కరోలినాల వరకు గల పలు రాష్ట్రాలు మంచుతాకిడికి విలవిలలాడాయి. ఈ ప్రాంతాల్లో మంగళ, బుధవారాల్లో భారీస్థాయిలో మంచు కురవడంతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. రహదారులపై పేరుకుపోయిన మంచులో వాహనాలు ఎక్కడికక్కడ చిక్కుకుపోయాయి. పాఠశాలల నుంచి విద్యార్థులు ఇళ్లకు వెళ్లలేక పాఠశాలల్లోనే ఉండిపోయారు. పలు రాష్ట్రాల్లో వందలాది విమానాలు రద్దయ్యాయి. అట్లాంటాలో పలువురు వాహనదారులు మంచులో చిక్కుకుపోయిన వాహనాల్లోనే దాదాపు పద్దెనిమిది గంటలకు పైగా గడిపారు. మంచు తుపానులో చిక్కుకుని అలబామాలో ఐదుగురు, జార్జియాలో ఒకరు మరణించారు. హూస్టన్ నుంచి అట్లాంటా వరకు గల విమానాశ్రయాల నుంచి రాకపోకలు జరిపే వందలాది విమానాలను రద్దు చేశారు. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే అట్లాంటా విమానాశ్రయంలోనే ఐదువందలకు పైగా విమానాలు నిలిచిపోయాయి. మంచులో కూరుకుపోయిన వాహనాల్లో చిక్కుకుపోయిన వారిని సురక్షితంగా వెలికితీసేందుకు సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. వాతావరణంలో బుధవారం స్వల్పంగా మెరుగుదల కనిపించినా, గురువారం వేకువ నుంచి దక్షిణ, ఆగ్నేయ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మళ్లీ పడిపోయాయి.