
మోదీపై సోనియా గాంధీ విసుర్లు
న్యూఢిల్లీ: వరుస ఆందోళనలతో సభా సమయాన్ని వృథా చేస్తున్నారంటూ విపక్ష పార్టీలపై అధికార బీజేపీ వ్యాఖ్యాలు చేసిన నేపథ్యంలో అంతకు రెట్టింపు స్వరంతో, ఘాటైన పదజాలంతో బీజేపీపై విరుచుకుపడ్డారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ. పనిలోపనిగా ప్రధాని నరేంద్ర మోదీపైనా విమర్శనాస్త్రాలు సంధించారు. సోమవారం పార్లమెంట్ సమావేశాలకు బయలుదేరేముందు సోనియా మీడియాతో మాట్లాడారు.
'మేం చాలా స్పష్టంగా చెబుతున్నాం. ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ మంత్రులు, ముఖ్యమంత్రులు రాజీనామాలు చేసేదాకా మా నిరసనలు కొనసాగిస్తూనే ఉంటాం. సభ కొనసాగనివ్వబోము. మమ్మల్ని విమర్శించేవారు ఒక్క విషయం గుర్తుంచుకోవాలి.. సభలో మెజారిటీ ఉన్నంత మాత్రాన తప్పులు ఒప్పులైపోవు' అని విమర్శించారు.
తరచూ మనసులో మాట (మన్ కీ బాత్) వెల్లడించే మనిషి తన సహచరులు కుంభకోణాలకు పాల్పడినప్పుడు మాత్రం మౌనవ్రతం చేపడతారని ప్రధానిని ఉద్దేశించి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గతంలో సభాకార్యక్రమాలను అడ్డుకున్నవారు నేడు డిబేట్లు, డిస్కషన్ల ఛాంపియన్లయ్యారని బీజేపీ సభ్యులపై మండిపడ్డారు.