ఇక వెయ్యిరెట్ల వేగంతో ఇంటర్నెట్ బ్రౌజింగ్
కలలో కూడా ఊహించలేనంత వేగంతో ఇంటర్నెట్ పనిచేస్తే మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడున్న వేగానికి కొన్ని వేల రెట్ల వేగంతో సైట్లు ఓపెన్ అవుతుంటే ఎంత ఆనందంగా ఉంటుంది? సరిగ్గా ఇదే జరగబోతోంది. అమెరికాలో ఇప్పుడున్న సగటు ఇంటర్నెట్ వేగానికి వెయ్యిరెట్ల వేగంతో ... అంటే సెకనుకు 10 గిగాబిట్ల వేగంతో పనిచేసే ఇంటర్నెట్ అందించేందుకు గూగుల్ సిద్ధమవుతోంది. దీనిపై తాము ఇప్పటికే పరిశోధనలు సాగిస్తున్నామని, త్వరలోనే ఇది సాధ్యం ఆకవచ్చని గూగుల్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ పాట్రిక్ పిచెట్ తెలిపారు.
ఇదే అందుబాటులోకి వస్తే, ఇక ఇంటర్నెట్ ప్రపంచం రూపురేఖలే ఒక్కసారిగా మారిపోతాయి. వాణిజ్యపరమైన ఇంటర్నెట్ సేవల రంగంలోకి కూడా గూగుల్ ప్రవేశించి, ఇంత వేగవంతమైన ఇంటర్నెట్ సర్వీసులు అందిస్తే, ఇప్పటివరకు ఉన్న సర్వీస్ ప్రొవైడర్లందరూ దుకాణాలు సర్దుకోక తప్పని పరిస్థితి ఏర్పడవచ్చు. అయితే ఇందుకు ఇంకా చాలా సమయం పట్టేలాగే ఉంది. సమీప భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా 10 గిగాబిట్ల ఇంటర్నెట్ అందించే ప్రతిపాదనలు లేవని గూగుల్ ప్రతినిధి ఒకరు తెలిపారు.