అమరావతి అతిథులకు జాంధానీ చీరలు !
పిఠాపురం: నూతన రాజధాని అమరావతి శంకుస్థాపనకు వస్తున్న అతిథులకు ఉప్పాడ జాంధానీ చీరలు అందించనున్నారు. ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు తూర్పు గోదావరి జిల్లా జెడ్పీ అధికారులు రెండు రోజుల నుంచి ఈ చీరలను కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. శుక్రవారం ఉప్పాడ, కొత్తపల్లి, వాకతిప్ప తదితర గ్రామాల్లో కొన్ని చీరలు కొనుగోలు చేసిన అధికారులు మరిన్ని చీరలకు ఆర్డర్లు ఇచ్చినట్లు చెబుతున్నారు. అయితే అత్యంత గోప్యంగా జరుగుతున్న ఈ వ్యవహారం బయటకు పొక్కకూడదని అధికారులు హెచ్చరించడంతో ఎన్ని చీరలు ఆర్డర్లు ఇచ్చారన్న విషయాన్ని వ్యాపారులు వెల్లడించడంలేదు.
శంకుస్థాపనకు వచ్చే మహిళా అతిథుల్లో ఇతర రాష్ట్రాల ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఉన్నతాధికారుల వంటి ముఖ్యమైన వారికి వీటిని బహుమతిగా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. రూ. 5 వేల నుంచి రూ. 50 వేల వరకు విలువైన చీరలకు ఆర్డర్లు ఇచ్చారని, చేనేత, జౌళి శాఖ ఉన్నతాధికారులు ఈ వ్యవహారంలో తమ వంతు సహకారం అందిస్తున్నారని సమాచారం. వీటికి సుమారు రూ. కోటి వెచ్చిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.