వడ్డీరేట్లు మరింత కిందికి!
వడ్డీరేట్లు మరింత కిందికి!
Published Mon, Nov 21 2016 2:12 AM | Last Updated on Sat, Sep 22 2018 7:51 PM
డిపాజిట్ల జోరుతో అదనపు ద్రవ్యలభ్యత కొనసాగుతుంది...
రెపో తగ్గింపునకు ఆస్కారం...
ఎస్‌బీఐ అంచనా...
నోట్ల రద్దు ఎఫెక్ట్..
న్యూఢిల్లీ: మోదీ ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసిన(డీమోనిటైజేషన్) నేపథ్యంలో వడ్డీరేట్లు మరింత తగ్గుముఖం పట్టొచ్చని దేశీ బ్యాంకింగ్ అగ్రగామి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) అంచనా వేసింది. డిపాజిట్లు వెల్లువెత్తడంతో బ్యాంకింగ్ వ్యవస్థలో ద్రవ్య లభ్యత(లిక్విడిటీ) భారీగా ఎగబాకిందని.. ఇప్పటికిప్పుడు ఇది మళ్లీ వెనక్కివెళ్లిపోయే అవకాశంలేదని కూడా పేర్కొంది. ‘ప్రభుత్వం తీసుకున్న డీమోనిటైజేషన్ చర్య ఆహ్వానించదగినదే. సేవింగ్‌స, కరెంట్ అకౌంట్లలోకి భారీ మొత్తంలో నగదు జమ అవుతోంది. ఈ డిపాజిట్ల కారణంగా వ్యవస్థలో అవసరానికి మించి లిక్విడిటీ వచ్చిచేరుతోంది. అరుుతే, ప్రభుత్వం నిబంధనలు సడలించిన వెంటనే మళ్లీ ఈ అదనపు ద్రవ్య లభ్యత మొత్తం వెనక్కివెళ్లిపోతుందని భావించడం లేదు.
దీంతో వడ్డీరేట్లు మరింత తగ్గే అవకాశం ఉంది’ అని ఎస్‌బీఐ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. నల్లధనానికి అడ్డుకట్ట వేసే చర్యల్లో భాగంగా రూ.500; 1,000 నోట్లను రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఈ నెల 8న హఠాత్తుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, పాత నోట్లను ఎక్స్ఛేంజ్ చేసుకోవడానికి, అదేవిధంగా బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకునేందుకు 50 రోజుల గడవును ఇచ్చింది. ఈ చర్యలతో బ్యాంకుల్లో డిపాజిట్లు పోటెత్తుతున్నాయి. ఒక్క ఎస్‌బీఐలోనే నగదు డిపాజిట్లు నవంబర్ 9 నుంచి 17 వరకు రూ.1.27 లక్షల కోట్లు జమ అయినట్లు అంచనా.
మరింత మంది ప్రజలు బ్యాంకింగ్‌లోకి...
ఖాతాదారులు ఎస్‌బీఐ బ్రాంచ్‌లలో డిపాజిట్ చేస్తున్న నగదును తమకు నచ్చినవిధంగా వాడుకోవచ్చని.. ప్రస్తుతం అమల్లో ఉన్న వడ్డీ(ఎస్‌బీ లేదా టెర్మ్ డిపాజిట్ ఖాతాలపై) రేట్ల మేరకు వడ్డీని చెల్లిస్తామని ఎస్‌బీఐ అధికారి వెల్లడించారు. కాగా, ఈ అదనపు నిధులను ఎందులోనైనా ఇన్వెస్ట్ చేస్తారా అన్న ప్రశ్నకు.. రివర్స్ రెపో(ఆర్‌బీ వద్ద), ట్రెజరీ బిల్స్(ప్రభుత్వ బాండ్‌లు)లో స్వల్పకాలిక ప్రాతిపదికన పెట్టుబడిపెడతామని వివరించారు.‘డీమోనిటైజేషన్ వల్ల పాత నోట్ల మార్పిడి, డిపాజిట్ చేయడం ద్వారా మరింత మంది ప్రజలు బ్యాంకింగ్ వ్యవస్థలో భాగం కానున్నారు. దీనివల్ల పన్ను ఎగవేతదారులు, ఇతరత్రా అక్రమ కార్యకలాపాలను గుర్తించొచ్చు. పన్ను ఎగవేతలకు అడ్డుకట్టవేయడం తద్వారా పన్ను చెల్లింపుదారుల పరిధిని పెంచడంవల్ల ప్రభుత్వ ఖజానాకు ఆదాయం పెరుగుతుంది.
బ్యాంకింగ్ వ్యవస్థలోకి డిపాజిట్లు పెరగడం వల్ల రుణాలకు మరిన్ని నిధులు అందుబాటులోకి వస్తారుు. దీంతో స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధికి దోహదం చేస్తుంది. అయితే, ఈ అదనపు నగదు లభ్యత కారణంగా బ్యాంకులకు స్వల్పకాలానికి అదనంగా వ్యయాలు పెరగుతుతాయి. ఆర్‌బీఐకి కూడా కొత్త నోట్ల ప్రింటింగ్ వల్ల వ్యయ భారం తప్పదు. అయితే, ప్రారంభంలో తలెత్తే ఈ ఇబ్బందులు అన్నీ నెమ్మదిగా సర్దుకుంటే.. పారదర్శకమైన, తక్కువ నగదు లావాదేవీలు గల సమాజం ఆవిష్కృతమవుతుంది’ అని ఎస్‌బీఐ ఉన్నతాధికారి వివరించారు.
మార్చిలోగా మరో అర శాతం రెపో కోత!
ద్రవ్యోల్బణం దిగొచ్చేందుకు కూడా డీమోనిటైజేషన్ తోడ్పాటును అందించనుందని ఎస్‌బీఐ అధికారి పేర్కొన్నారు. ‘మా అంచనా ప్రకారం నవంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 4 శాతం దిగువకు చేరే అవకాశం ఉంది. నోట్ల రద్దుతో వినియోగదారుల డిమాండ్‌పై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుండటమే దీనికి కారణం. దీంతో ద్రవ్యోల్బణం తగ్గేందుకు దారితీస్తుంది. మొత్తం మీద ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే(2017 మార్చిలోగా) ఆర్‌బీఐ మరో పావు నుంచి అర శాతం మేర రెపో రేటు(ఆర్‌బీఐ బ్యాంకులకు ఇచ్చే స్వల్పకాలిక రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు)ను తగ్గిస్తుందని అంచనా వేస్తున్నాం’ అని చెప్పారు. అక్టోబర్ నెలలో జరిగిన పాలసీ సమీక్షలో ఆర్‌బీఐ రెపో రేటును పావు శాతం తగ్గించిన సంగతి తెలిసిందే. దీంతో ఇది 6.25%కి చేరింది. 2015 జనవరి నుంచి రెపో రేటు 1.75% తగ్గింది. కాగా, డిపాజిట్ల జోరు నేపథ్యంలో ఎస్‌బీఐ గత వారం వివిధ కాలవ్యవధులకు చెందిన డిపాజిట్లపై వడ్డీరేట్లను 0.15% వరకూ తగ్గించడం తెలిసిందే.
Advertisement
Advertisement