రాష్ట్రాన్ని వేలం వేశారా!? | state was auctioned !? | Sakshi
Sakshi News home page

రాష్ట్రాన్ని వేలం వేశారా!?

Published Wed, Aug 19 2015 1:38 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

state was auctioned !?

ప్రధానిపై నితీశ్ ధ్వజం 
ప్యాకేజీ కాదు.. ప్రత్యేక హోదా కావాలి: లాలూ

 
పట్నా: బిహార్‌కు మోదీ ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీని, ఆ సందర్భంగా ఆయన వ్యవహరించిన తీరును బిహార్ సీఎం నితిశ్ కుమార్ తీవ్రంగా ఆక్షేపించారు. ప్రధానికి బిహారంటే, కేంద్రం నుంచి నిధులు కోరే రాష్ట్రాలంటే చులకనభావం ఉన్నట్లుందని మండిపడ్డారు. ప్యాకేజీని ప్రకటించిన తీరు బిహార్‌ను వేలంపాట వేస్తున్నట్లుగా ఉందన్నారు. ‘ఇదేనా మీరు ముప్పొద్దులా చెప్పే సహకారాత్మక సమాఖ్య విధానం’ అని ధ్వజమెత్తారు. ‘ఒకవైపు నన్ను కేంద్రం నుంచి నిధులు అడుక్కుంటున్న యాచకుడు అంటున్నారు. మరోవైపు, నాది అహంకార వైఖరి అని విమర్శిస్తున్నారు. ఇవి పరస్పర విరుద్ధంగా లేవా?’ అని మోదీని ప్రశ్నించారు. బిహార్ కోసం కేంద్రం ముందు చేతులు చాచేందుకు తాను ఎల్లప్పుడూ సిద్ధమేనన్నారు. ప్రధాని ప్రకటించిన ప్యాకేజీలోని ప్రాజెక్టుల్లో కొత్తవేం లేవని అన్నారు. తాము కోరుతోంది నిధులు కాదని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలన్నది తమ డిమాండని స్పష్టం చేశారు.

బిహార్‌ను ప్రధాని బీమారు రాష్ట్రాల్లో ఒకటని అనడాన్ని నితీశ్ మండిపడ్డారు. కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చిన రాష్ట్రాలన్నీ బీమారువేనా? అని ప్రశ్నించారు. అభివృద్ధిలో ముందుకుపోతున్న రాష్ట్రాన్ని ప్రోత్సహించడానికి బదులుగా పరిహాసం చేయడం తగదన్నారు. వాజ్‌పేయి హయాంలో బిహార్‌కు ప్రకటించిన రూ. 10 వేల కోట్లు, యూపీఏ ఇచ్చిన రూ. 12 వేల కోట్లను రాష్ట్రం ఖర్చు చేయలేదన్న విమర్శలపై స్పందిస్తూ.. ఆ నిధులను ఖర్చు చేయాల్సింది కేంద్రమేనన్న  విషయం ప్రధానికి తెలియదేమోనన్నారు. బిహార్‌కు ప్రత్యేక ప్యాకేజీ కాకుండా, ప్రత్యేక హోదా కావాలని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement