
క్యూ3 ఫలితాలే దిక్సూచి..!
జోరు కొనసాగిస్తున్న స్టాక్ మార్కెట్లకు దేశీ కంపెనీల పనితీరు ఇక దిశానిర్దేశం చేయనుంది.
* ఈ నెల 9న ఇన్ఫోసిస్‌తో ఆర్థిక ఫలితాల సీజన్ షురూ..
* షేర్ల స్థిరీకరణకు అవకాశం...
* అంతర్జాతీయ పరిణామాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులపైనా దృష్టి
* ఈ వారం మార్కెట్ కదలికపై నిపుణుల అంచనా
న్యూఢిల్లీ: కొత్త సంవత్సరంలో బంపర్ లాభాలతో బోణీ చేసి.. జోరు కొనసాగిస్తున్న స్టాక్ మార్కెట్లకు దేశీ కంపెనీల పనితీరు ఇక దిశానిర్దేశం చేయనుంది. ప్రధానంగా ఐటీ అగ్రగామి ఇన్ఫోసిస్ శుక్రవారం(9న) ప్రకటించనున్న ఫలితాలతో మూడో త్రైమాసిక(క్యూ3) ఆర్థిక ఫలితాల సీజన్ షురూ కానుంది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఫలితాలపైనే అధికంగా దృష్టిసారించనున్నారని.. మార్కెట్లో ఈ వారం కొంత షేర్ల స్థిరీకరణ(కన్సాలిడేషన్)కు అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అదేవిధంగా అంతర్జాతీయ మార్కెట్ల గమనం, విదేశీ పరిణామాలు కూడా కీలకమేనని పేర్కొన్నారు. డాలరుతో రూపాయి మారకం విలువ కదలికలు... అంతర్జాతీయంగా ముడిచమురు ధర హెచ్చుతగ్గులు కూడా దేశీ మార్కెట్ ట్రెండ్‌ను నిర్ధేశించనున్నాయనేది విశ్లేషకుల అభిప్రాయం.
గత శుక్రవారం 380 పాయింట్లు హైజంప్ చేసిన బీఎస్‌ఈ సెన్సెక్స్.. నాలుగు వారాల గరిష్టస్థాయిలో 27,888 పాయింట్ల వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కూడా 111 పాయింట్లు ఎగసి... 8,395 వద్ద స్థిరపడింది. బడా స్టాక్స్ కంటే చిన్న, మధ్య స్థాయి షేర్లు భారీగా దూసుకెళ్లాయి. కాగా, ఫలితాల సీజన్ మొదలవుతున్న నేపథ్యంలో మార్కెట్లకు ఈ వారం చాలా కీలకమని రెలిగేర్ సెక్యూరిటీస్ ప్రెసిడెంట్(రిటైల్ డిస్ట్రిబ్యూషన్) జయంత్ మాంగ్లిక్ పేర్కొన్నారు. దేశీ తయారీ రంగం గతేడాది డిసెంబర్లో రెండేళ్ల గరిష్టానికి పుంజుకున్నట్లు హెచ్‌ఎస్‌బీసీ గణాంకాలు వెలువడటం కూడా మార్కెట్లో జోష్ నింపింది.
ఇక సేవల రంగం హెచ్‌ఎస్‌బీసీ డేటాపై ఇన్వెస్టర్లు దృష్టిసారించనున్నారని ఆయన చెప్పారు. మరోపక్క, బ్యాంకింగ్ స్టాక్స్‌పైనా ఈ వారం అధికంగా దృష్టిపెట్టే అవకాశం ఉంది. కేంద్రం నిర్వహించిన రెండు రోజుల జ్ఞాన సంగం సదస్సులో బ్యాంకింగ్ రంగంలో సాహసోపేతమైన సంస్కరణలకు కట్టుబడి ఉన్నామని, బ్యాంకులకు మరింత స్వేచ్ఛనిస్తామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పడం దీనికి ప్రధాన కారణం. మొండిబకాయి పెరుగుదల ఏమాత్రం ఆమోదనీయం కాదని.. దీని కట్టడికి చర్యలు తీసుకుంటామని కూడా ఆయన హామీనిచ్చారు. సదస్సు నేపథ్యంలో బ్యాంకుల మధ్య కొనుగోళ్లు, విలీనాల దిశగా సానుకూల అడుగులు పడొచ్చని పరిశ్రమ విశ్లేషకులు భావిస్తున్నారు.
8,100-8,550 శ్రేణిలో నిఫ్టీ...
మార్కెట్లు ఈ వారం కొంత అప్రమత్త ధోరణిలో(సైడ్‌వేస్) ఉండొచ్చని బొనాంజా పోర్ట్‌ఫోలియో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాకేశ్ గోయల్ పేర్కొన్నారు. నిఫ్టీ 8,100-8,550 శ్రేణిలో కదలాడే అవకాశం ఉందన్నారు. అమెరికా, బ్రిటన్‌లలో వెలువడే పరిశ్రమ, ఉద్యోగ గణాంకాలు ఈ వారం ప్రపంచ మార్కెట్లపై ప్రభావం చూపించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
డిసెంబర్లో వేగం తగ్గిన విదేశీ పెట్టుబడులు..
విదేశీ ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణ నేపథ్యంలో గతేడాది డిసెంబర్లో ఈ పెట్టుబడుల వేగం తగ్గింది. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) డిసెంబర్ నెలలో దేశీ స్టాక్స్‌లో నికరంగా రూ.2,132 కోట్లను వెచ్చించారు. ఇది పది నెలల కనిష్టస్థాయి కావడం గమనార్హం. గత ఫిబ్రవరిలో అత్యల్పంగా రూ.1,404 కోట్ల పెట్టుబడి నమోదుకాగా.. మళ్లీ ఇంత తక్కువస్థాయిలో పెట్టుబడులు ఇదే తొలిసారి.
కాగా, 2014 పూర్తి ఏడాదికి ఎఫ్‌పీఐల నికర కొనుగోళ్లు రూ.98,158 కోట్లుగా లెక్కతేలింది. డెట్(బాండ్లు) మార్కెట్లో రూ.1.6 లక్షల కోట్ల నికర పెట్టుబడులతో కలిపితే.. మొత్తం రూ.2.58 లక్షల కోట్లుగా నమోదైంది. దేశీ మార్కెట్లు కొత్త రికార్డుల సృష్టికి ప్రధానంగా ఎఫ్‌పీఐలే కీలకంగా నిలిచారు. తాత్కాలికంగా విదేశీ పెట్టుబడులు తగ్గినా... మోదీ సర్కారు సంస్కరణలపై కీలక చర్యల నేపథ్యంలో మళ్లీ ఎఫ్‌పీఐలు కొనుగోళ్ల జోరు పెంచుతారని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.