- బకాయిలు చెల్లించడం లేదు
- కేంద్ర హోంశాఖకు ఏపీ జెన్‌కో త్వరలో ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ బకాయిల చెల్లింపులో తెలంగాణ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని, దీనివల్ల తమ సిబ్బందికి జీతాల చెల్లింపులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని ఏపీ విద్యుత్ ఉత్పాదక సంస్థ (ఏపీ జెన్‌కో) వాపోతోంది. తెలంగాణ సర్కారుపై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. బకాయిలపై టీజెన్‌కోకు ఇప్పటికే రెండు సార్లు లేఖలు రాశారు. సదరన్ లోడ్ డిస్పాచ్ సెంటర్ దృష్టికి కూడా తీసుకొచ్చారు. అయినా స్పందన లేకపోవడంతో కేంద్రానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు.
విద్యుత్ చట్టం ప్రకారం.. నిర్ణీత గడువులోగా బకాయిలు చెల్లించకపోతే విద్యుత్ సరఫరా నిలిపివేయాల్సి ఉంటుందని, ఇది టీజెన్‌కోకు వర్తిస్తుందని లేఖలో ప్రస్తావించనున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణకు 53.89, ఏపీకి 46.11 శాతం విద్యుత్ పంపకాలు చేశారు. తెలంగాణలోని థర్మల్ ప్రాజెక్టులు పురాతనమైనవి కావడంతో తక్కువ కరెంటును ఉత్పత్తి చేస్తూ ఎక్కువ వాడుకుంటోంది. ఎక్కువ వాడుకున్న మొత్తానికిగాను ఏపీకి డబ్బులు చెల్లించాలి. ఏపీలో 2,810 మెగావాట్లు, తెలంగాణలో 2,220 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. 790 మెగావాట్ల మేర తెలంగాణ ఎక్కువగా వాడుకుంటోంది. తెలంగాణ ప్రభుత్వం తమకు ఇంకా రూ.1,384 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని ఏపీ జెన్‌కో చెబుతోంది.