
ఊసులన్నీ చెబుతాడు... కానీ
ముప్పవరపు వెంకయ్యనాయుడు తెలుగు వారికే కాదు దేశ వ్యాప్తంగా వివిధ రాజకీయ పార్టీల నాయకులు, దేశప్రజలకు పరిచయం అక్కర లేకుండానే తెలిసిన పేరు. ఇంకా చెప్పాలంటే 'కమల దళపతుల్లో' తలలో నాలుక. వాజ్పేయి... నరేంద్ర మోదీ... ఇలా ఎవరు ప్రధానిగా ఉన్నా వెంకయ్య మాత్రం ఆయా ప్రభుత్వాల్లో వాషింగ్ పౌడర్ 'వీల్ చక్రం' కంటే స్పీడ్గా తన హవాను కొనసాగిస్తారు. దాంతో వెంకయ్యే కమలనాధులకే నాధుడుగా మారిపోయారని ఆ పార్టీలోని వర్గాలు సీరియస్గా చెప్పుకుంటారు.
అయితే వెంకయ్య ఎక్కడ ఏ సభలో అయినా... వేదిక ఎక్కి ఏ అంశంపై ప్రసంగం మొదలు పెట్టినా... అక్కడ ఆసీనులైన పెద్దలే కాదు.... సభకు వచ్చిన చిన్న చితక మొత్తం ఆయన ఊదే 'నాద స్వరం' కి తలకాయలు తాటికాయల్లా ఊపాల్సిందే. అంతటి వాక్ పటిమ గల మాటల ఘనాపాటి వెంకయ్య.
మోదీ ప్రధానిగా పగ్గాలు చేపట్టిన నాటి నుంచి ఎన్ని దేశాలు తిరిగారు.... ఆయా దేశాల నుంచి భారత్కు ఎలా లబ్ది చేకూరుతోంది.... సదరు దేశాలు మన దేశంలో ఎన్ని కోట్ల రూపాయిల్లో పెట్టుబడులు పెడుతున్నాయో అంకెలతో సహా వివరించ గల సత్తా ఉన్న నేత. మోదీ వాక్ ప్రవాహంలో పడి భారత ప్రజలు ఆయన్ని ప్రధాని పీఠం ఎక్కిస్తే.. వెంకయ్య వాగ్ధాటికి ముగ్దుడైన మోదీ మాత్రం ఆయనకి అత్యంత కీలకమైన పార్లమెంటరీ వ్యవహారాల శాఖను ఏరి కోరి కట్టబెట్టారు. ఈ విషయం అందరికి తెలిసందే.
తాజాగా పశ్చిమగోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెంలో నిట్ శంకుస్థాపన సందర్భంగా వెంకయ్య ..రైల్వే జోన్... ఏపీ ఎక్స్ప్రెస్ రైలు వేగం పెంపు.... అవీ ఇవీ అన్నీ తెస్తామని ఊసులు చెప్పారు. కానీ ప్రత్యేక హోదాపై మాత్రం ఒక్క ముక్క మాట్లాడలేదు. అయితే పార్లమెంట్లో విభజన బిల్లు చర్చ సమయంలో ఏపీకి ప్రత్యేక హోదాపై నాటి ప్రధాని మన్మోహన్ అయిదేళ్లంటే...కాదు కాదు పదేళ్లంటూ చెప్పిన నాటి ప్రతిపక్షంలోని వెంకయ్య...అధికారంలోకి వచ్చాక ఆయన ఆ విషయాన్ని మర్చిపోయినట్లున్నారు.
దీనిపై ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు ఎన్ని సెటైర్లు వేసిన కూడా ప్రత్యేక హోదా అంశంపై మాత్రం వెంకయ్య ఏమీ స్పందించకుండా ...ఒకటో క్లాస్ పిల్లోడులా నోటి మీద వ్రేలు వేసుకోకుండా వైట్ అండ్ వైట్ డ్రస్లో గుడ్ బాయిలా కనిపిస్తుంటారు. అయినా ప్రత్యేక హోదా తన సొంత రాష్ట్రానికి తీసుకురావాలంటే వెంకయ్య తలుచుకుంటే ఎంత పని... కానీ ఆయన తలుచుకోవడమే లేదు. అంతే.