Union Minister of Urban Development
-
'కేంద్ర సంక్షేమ పథకాలపై దేశవ్యాప్త ప్రచారం'
న్యూఢిల్లీ : నరేంద్ర మోదీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలపై మే 26 నుంచి దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తామని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు వెల్లడించారు. ప్రధాని నరేంద్రమోదీ యూపీలోని సహరన్పూర్ నుంచి ప్రారంభిస్తారని చెప్పారు. శనివారం న్యూఢిల్లీలో వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.... ప్రతిరాష్ట్రంలో కనీసం ఆరు బహిరంగ సభలు నిర్వహిస్తామని చెప్పారు. ఓటమి నుంచి కాంగ్రెస్ పార్టీ ఇంకా గుణపాఠం నేర్చుకోవడం లేదని వెంకయ్య విమర్శించారు. -
నేను లేకుంటే మీకు దిక్కేలేదు
కాంగ్రెస్ నేతలపై విరుచుకుపడ్డ వెంకయ్యనాయుడు సాక్షి ప్రతినిధి, ఏలూరు: ‘‘ఆంధ్రప్రదేశ్‌ను అన్యాయంగా, ఏకపక్షంగా విభజించారు. ఒక రాష్ర్ట ప్రజల గొంతుకోశారు. ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం ఉద్యమిస్తున్న నేతలు అప్పుడెందుకు మాట్లాడలేదు. వెంకయ్యనాయుడును అడ్డుకుంటామని అంటున్నారు. నేను లేకుంటే మీకు దిక్కే లేదు. నేను ఇక్కడి ఎంపీని కాదు. ఈ రాష్ట్రం నుంచి ఎన్నిక కాలేదు. భవిష్యత్‌లో కూడా ఇక్కడి నుంచి పోటీ చేయను. కానీ తెలుగు రాష్ట్రాలు బాగుండాలనే మాట్లాడుతున్నా. నేను రాష్ట్రానికి వస్తే ఓ ప్రాజెక్టు వస్తుంది. నేను రాకపోతే ఏమిరాదో వారికే తెలుసు’’ అని కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు కాంగ్రెస్ నేతలపై విరుచుకుపడ్డారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో గురువారం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) ఏర్పాటుకు ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు, కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ అంకురార్పణ చేశారు. శాశ్వత భవనాల నిర్మాణానికి శంకుస్థాపన గావించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో వెంకయ్యనాయుడు ప్రసంగిస్తుండగా కొందరు యువకులు ప్రత్యేక హోదా కోరుతూ నినాదాలు చేశారు. ‘దయచేసి నినాదాలివ్వొద్దు’ అంటూ అసహనం వ్యక్తం చేసిన ఆయన ఆ సందర్భంలోనే పరోక్షంగా కాంగ్రెస్ నేతలపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కేవలం తాము పదవిలోకి వచ్చి 15 నెలలు మాత్రమే అయ్యిందని, ఈ కాలంలోనే ఎంతో అభివృద్ధి చేశామనీ, అయినప్పటికీ ఇంకా ఏదో చేయలేదంటూ కాంగ్రెస్ తీవ్ర రాద్ధాంతం చేస్తోందని ధ్వజమెత్తారు. త్వరలోనే రాష్ట్రానికి ప్రత్యేక రైల్వే జోను తీసుకొస్తామని చెప్పారు.అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటుకు కసరత్తు జరుగుతోందని తెలిపారు. 14వ ఆర్థిక సంఘం నివేదిక ఆధారంగా ప్రత్యేక హోదా విషయం చర్చలో ఉందని, తుది నిర్ణయం కోసం అనేక రాష్ట్రాలు ఎదురుచూస్తున్నాయని తెలిపారు. ఏ విషయంలోనూ ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరగకుండా చూస్తామన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇందుకు పూర్తి సహకారం అందిస్తున్నారని చెప్పారు. మోదీ మెడలు వంచుతారా.. అదేం భాష.. అన్నిదేశాల అధిపతులు, ప్రపంచమంతా మోదీని కీర్తిస్తుంటే.. మోదీ మెడలు వంచుతామంటూ ప్రతిపక్షాలు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాయని వెంకయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశాన్ని విశ్వగురు చేయాలన్న లక్ష్యంతో మోదీ ప్రపంచ దేశాలు తిరుగుతుంటే ‘టూరిస్ట్ మోదీ’ అని ఆక్షేపిస్తున్నారని విమర్శించారు. ప్రధానంటే నూతిలో కప్పలా ఒకేచోట కూర్చుని అరుస్తుండాలా? అని ఎద్దేవా చేశారు. రాజకీయాలంటే వారసత్వం కాదనీ, జవసత్వాలు కావాలని కాంగ్రెస్ నేతలనుద్దేశించి వ్యాఖ్యానించారు. ఎడ్యుకేషన్ హబ్‌గా ఏపీ: చంద్రబాబు యువత భవిష్యత్‌ను తీర్చిదిద్దేందుకు ఆంధ్రప్రదేశ్‌ను నాలెడ్జ్ స్టేట్, ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దుతామని సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. త్వరలో విజయనగరంలో గిరిజన విశ్వవిద్యాలయం, అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలన్నింటిలో మరుగుదొడ్లు నిర్మిస్తామని, వాటి నిర్వహణ బాధ్యతలను డ్వాక్రా గ్రూపు మహిళలకు అప్పగిస్తామని చెప్పారు. వచ్చే పంద్రాగస్టుకల్లా ప్రతి స్కూల్లో టాయిలెట్లు: స్మృతి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నత విద్య కోసం కేంద్ర ప్రభుత్వం రూ.మూడు వేల కోట్లను మంజూరు చేసిందని, తాడేపల్లిగూడెంలోని నిట్‌కు రూ.300 కోట్లు మంజూరు చేసిందని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. ఉన్నత సాంకేతిక విద్య చదువుకున్న విద్యార్థులు రైతులకు ఉపయోగపడే పరిశోధనలు చేయాలని ఆమె పిలుపునిచ్చారు. వచ్చే పంద్రాగస్టు నాటికి దేశంలోని ప్రతి స్కూల్లోనూ మగపిల్లలు, ఆడపిల్లలకు విడివిడిగా టాయిలెట్లు ఉండేవిధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఏపీ ప్రభుత్వం ఈ విషయమై చొరవ తీసుకుని 100 శాతం విజయం సాధించాలని కోరారు. -
ఊసులన్నీ చెబుతాడు... కానీ
ముప్పవరపు వెంకయ్యనాయుడు తెలుగు వారికే కాదు దేశ వ్యాప్తంగా వివిధ రాజకీయ పార్టీల నాయకులు, దేశప్రజలకు పరిచయం అక్కర లేకుండానే తెలిసిన పేరు. ఇంకా చెప్పాలంటే 'కమల దళపతుల్లో' తలలో నాలుక. వాజ్‌పేయి... నరేంద్ర మోదీ... ఇలా ఎవరు ప్రధానిగా ఉన్నా వెంకయ్య మాత్రం ఆయా ప్రభుత్వాల్లో వాషింగ్ పౌడర్ 'వీల్ చక్రం' కంటే స్పీడ్‌గా తన హవాను కొనసాగిస్తారు. దాంతో వెంకయ్యే కమలనాధులకే నాధుడుగా మారిపోయారని ఆ పార్టీలోని వర్గాలు సీరియస్‌గా చెప్పుకుంటారు. అయితే వెంకయ్య ఎక్కడ ఏ సభలో అయినా... వేదిక ఎక్కి ఏ అంశంపై ప్రసంగం మొదలు పెట్టినా... అక్కడ ఆసీనులైన పెద్దలే కాదు.... సభకు వచ్చిన చిన్న చితక మొత్తం ఆయన ఊదే 'నాద స్వరం' కి తలకాయలు తాటికాయల్లా ఊపాల్సిందే. అంతటి వాక్ పటిమ గల మాటల ఘనాపాటి వెంకయ్య. మోదీ ప్రధానిగా పగ్గాలు చేపట్టిన నాటి నుంచి ఎన్ని దేశాలు తిరిగారు.... ఆయా దేశాల నుంచి భారత్‌కు ఎలా లబ్ది చేకూరుతోంది.... సదరు దేశాలు మన దేశంలో ఎన్ని కోట్ల రూపాయిల్లో పెట్టుబడులు పెడుతున్నాయో అంకెలతో సహా వివరించ గల సత్తా ఉన్న నేత. మోదీ వాక్ ప్రవాహంలో పడి భారత ప్రజలు ఆయన్ని ప్రధాని పీఠం ఎక్కిస్తే.. వెంకయ్య వాగ్ధాటికి ముగ్దుడైన మోదీ మాత్రం ఆయనకి అత్యంత కీలకమైన పార్లమెంటరీ వ్యవహారాల శాఖను ఏరి కోరి కట్టబెట్టారు. ఈ విషయం అందరికి తెలిసందే. తాజాగా పశ్చిమగోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెంలో నిట్ శంకుస్థాపన సందర్భంగా వెంకయ్య ..రైల్వే జోన్... ఏపీ ఎక్స్‌ప్రెస్ రైలు వేగం పెంపు.... అవీ ఇవీ అన్నీ తెస్తామని ఊసులు చెప్పారు. కానీ ప్రత్యేక హోదాపై మాత్రం ఒక్క ముక్క మాట్లాడలేదు. అయితే పార్లమెంట్లో విభజన బిల్లు చర్చ సమయంలో ఏపీకి ప్రత్యేక హోదాపై నాటి ప్రధాని మన్మోహన్ అయిదేళ్లంటే...కాదు కాదు పదేళ్లంటూ చెప్పిన నాటి ప్రతిపక్షంలోని వెంకయ్య...అధికారంలోకి వచ్చాక ఆయన ఆ విషయాన్ని మర్చిపోయినట్లున్నారు. దీనిపై ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు ఎన్ని సెటైర్లు వేసిన కూడా ప్రత్యేక హోదా అంశంపై మాత్రం వెంకయ్య ఏమీ స్పందించకుండా ...ఒకటో క్లాస్ పిల్లోడులా నోటి మీద వ్రేలు వేసుకోకుండా వైట్ అండ్ వైట్ డ్రస్‌లో గుడ్ బాయిలా కనిపిస్తుంటారు. అయినా ప్రత్యేక హోదా తన సొంత రాష్ట్రానికి తీసుకురావాలంటే వెంకయ్య తలుచుకుంటే ఎంత పని... కానీ ఆయన తలుచుకోవడమే లేదు. అంతే. -
'రెండు రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం సహకారం'
తిరుమల పవిత్రతను కాపాడవలసిన బాధ్యత అందరిపైన ఉందని కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. శనివారం తిరుమలలో విలేకర్లతో మాట్లాడారు. శేషాచలంలో ఎర్రచందనం స్మగ్లర్లను నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సమకరిస్తుందని ఆయన తెలిపారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుందని ఆయన స్పష్టం చేశారు. అంతకుమందు తిరుమల శ్రీవారిని వెంకయ్యనాయుడు దర్శించుకున్నారు. అనంతరం ఆయనకు స్వామీ వారి తీర్థప్రసాదాలను ఆలయంలోని పూజారులు, అధికారులు అందజేశారు. బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో పాలన పగ్గాలు చేపట్టి.... కేంద్రమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొట్టమొదటి సారిగా వెంకయ్యనాయుడు తిరుమలలో శనివారం శ్రీవారిని దర్శించుకున్నారు.