నేను లేకుంటే మీకు దిక్కేలేదు | Central minister M Venkaiah naidu counter on congress leaders | Sakshi
Sakshi News home page

నేను లేకుంటే మీకు దిక్కేలేదు

Published Fri, Aug 21 2015 2:29 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

నేను లేకుంటే మీకు దిక్కేలేదు - Sakshi

నేను లేకుంటే మీకు దిక్కేలేదు

కాంగ్రెస్ నేతలపై విరుచుకుపడ్డ వెంకయ్యనాయుడు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ‘‘ఆంధ్రప్రదేశ్‌ను అన్యాయంగా, ఏకపక్షంగా విభజించారు. ఒక రాష్ర్ట ప్రజల గొంతుకోశారు. ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం ఉద్యమిస్తున్న నేతలు అప్పుడెందుకు మాట్లాడలేదు. వెంకయ్యనాయుడును అడ్డుకుంటామని అంటున్నారు. నేను లేకుంటే మీకు దిక్కే లేదు. నేను ఇక్కడి ఎంపీని కాదు. ఈ రాష్ట్రం నుంచి ఎన్నిక కాలేదు. భవిష్యత్‌లో కూడా ఇక్కడి నుంచి పోటీ చేయను. కానీ తెలుగు రాష్ట్రాలు బాగుండాలనే మాట్లాడుతున్నా. నేను రాష్ట్రానికి వస్తే ఓ ప్రాజెక్టు వస్తుంది.

నేను రాకపోతే ఏమిరాదో వారికే తెలుసు’’ అని కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు కాంగ్రెస్ నేతలపై విరుచుకుపడ్డారు.  పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో గురువారం నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) ఏర్పాటుకు ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు, కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ అంకురార్పణ చేశారు. శాశ్వత భవనాల నిర్మాణానికి శంకుస్థాపన గావించారు.

అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో వెంకయ్యనాయుడు ప్రసంగిస్తుండగా కొందరు యువకులు ప్రత్యేక హోదా కోరుతూ నినాదాలు చేశారు. ‘దయచేసి నినాదాలివ్వొద్దు’ అంటూ అసహనం వ్యక్తం చేసిన ఆయన ఆ సందర్భంలోనే పరోక్షంగా కాంగ్రెస్ నేతలపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కేవలం తాము పదవిలోకి వచ్చి 15 నెలలు మాత్రమే అయ్యిందని, ఈ కాలంలోనే ఎంతో అభివృద్ధి చేశామనీ, అయినప్పటికీ ఇంకా ఏదో చేయలేదంటూ కాంగ్రెస్ తీవ్ర రాద్ధాంతం చేస్తోందని ధ్వజమెత్తారు. త్వరలోనే రాష్ట్రానికి ప్రత్యేక రైల్వే జోను తీసుకొస్తామని చెప్పారు.అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటుకు కసరత్తు జరుగుతోందని తెలిపారు. 14వ ఆర్థిక సంఘం నివేదిక ఆధారంగా ప్రత్యేక హోదా విషయం చర్చలో ఉందని, తుది నిర్ణయం కోసం అనేక రాష్ట్రాలు ఎదురుచూస్తున్నాయని తెలిపారు. ఏ విషయంలోనూ ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరగకుండా చూస్తామన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇందుకు పూర్తి సహకారం అందిస్తున్నారని చెప్పారు.
 
మోదీ మెడలు వంచుతారా.. అదేం భాష..
అన్నిదేశాల అధిపతులు, ప్రపంచమంతా మోదీని కీర్తిస్తుంటే.. మోదీ మెడలు వంచుతామంటూ ప్రతిపక్షాలు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాయని వెంకయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.  దేశాన్ని విశ్వగురు చేయాలన్న లక్ష్యంతో మోదీ ప్రపంచ దేశాలు తిరుగుతుంటే ‘టూరిస్ట్ మోదీ’ అని ఆక్షేపిస్తున్నారని విమర్శించారు. ప్రధానంటే నూతిలో కప్పలా ఒకేచోట కూర్చుని అరుస్తుండాలా? అని ఎద్దేవా చేశారు. రాజకీయాలంటే వారసత్వం కాదనీ, జవసత్వాలు కావాలని కాంగ్రెస్ నేతలనుద్దేశించి వ్యాఖ్యానించారు.
 
ఎడ్యుకేషన్ హబ్‌గా ఏపీ: చంద్రబాబు
యువత భవిష్యత్‌ను తీర్చిదిద్దేందుకు ఆంధ్రప్రదేశ్‌ను నాలెడ్జ్ స్టేట్, ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దుతామని సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. త్వరలో విజయనగరంలో గిరిజన విశ్వవిద్యాలయం, అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలన్నింటిలో మరుగుదొడ్లు నిర్మిస్తామని, వాటి నిర్వహణ బాధ్యతలను డ్వాక్రా గ్రూపు మహిళలకు అప్పగిస్తామని చెప్పారు.
 
వచ్చే పంద్రాగస్టుకల్లా ప్రతి స్కూల్లో టాయిలెట్లు: స్మృతి
ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నత విద్య కోసం కేంద్ర ప్రభుత్వం రూ.మూడు వేల కోట్లను మంజూరు చేసిందని, తాడేపల్లిగూడెంలోని నిట్‌కు రూ.300 కోట్లు మంజూరు చేసిందని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. ఉన్నత సాంకేతిక విద్య చదువుకున్న విద్యార్థులు రైతులకు ఉపయోగపడే పరిశోధనలు చేయాలని ఆమె పిలుపునిచ్చారు. వచ్చే పంద్రాగస్టు నాటికి దేశంలోని ప్రతి స్కూల్లోనూ మగపిల్లలు, ఆడపిల్లలకు విడివిడిగా టాయిలెట్లు ఉండేవిధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఏపీ ప్రభుత్వం ఈ విషయమై చొరవ తీసుకుని 100 శాతం విజయం సాధించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement