బ్రేకింగ్: తరిమితరిమి అరెస్టులు!
- శాంతియుత ఉద్యమంపై ఉక్కుపాదం
- పోలీసుల తీరుపై భగ్గుమంటున్న విద్యార్థులు
విశాఖపట్నం: ప్రత్యేక హోదా కోసం శాంతియుత ఆందోళనకు దిగిన విద్యార్థులు, యువతను పోలీసులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఆంక్షలను బేఖాతరు చేసి, నిషేధాజ్ఞలను ఉల్లంఘించి.. నల్లబ్యాడ్జీలు ధరించి, పోలీసుల కంటపడకుండా సందుల గుండా, గల్లీల గుండా బీచ్‌రోడ్డుకు చేరుకునేందుకు విద్యార్థులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. నోటికి నల్లబ్యాడ్జీలు ధరించి మౌనపోరాట దీక్షలో పాల్గొనేందుకు ముందుకొస్తున్నారు.
అయితే, బీచ్ రోడ్డు వైపు వస్తున్న విద్యార్థులు, యువతను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. సందులు, గల్లీలలో కవాత్తు చేస్తూ కనిపించిన వారిని తరిమితరిమి అరెస్టు చేస్తున్నారు. శాంతియుత నిరసనలో, కొవ్వొత్తుల ప్రదర్శనలో పాల్గొనేందుకు వచ్చిన విద్యార్థులను బలవంతంగా అరెస్టు చేస్తున్నారు. దీంతో వైజాగ్ అంతటా ఉద్రిక్త వాతారవణం, భయానక వాతావరణం నెలకొంది. వైజాగ్ అంతా పోలీసుల రాజ్యంగా మారిపోయింది.
అయినా అణిచేకొద్ది హోదా ఉద్యమం ఎగిసిపడుతూనే ఉంది. తమ ఆకాంక్షను చాటేందుకు విద్యార్థులు కదం తొక్కుతూనే ఉన్నారు. ఈ ఆందోళనలో భాగంగా పలు ప్రాంతాల నుంచి వైజాగ్ వచ్చిన విద్యార్థులు తమకు ప్రత్యేక హోదా కావాల్సిందేనని నినదిస్తున్నారు. మరోవైపు ప్రత్యేక హోదా ఉద్యమానికి మద్దతుగా జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సాయంత్రం వైజాగ్ రానున్నారు. పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా, నిషేధాజ్ఞలు విధించినా సాయంత్రం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించే కొవ్వొత్తుల ప్రదర్శనలో తాను పాల్గొని తీరుతానని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.