ముంబై: ఉదయం సెషన్ నుంచి ఊగిసలాటలో నడిచిన మంగళవారం నాటి స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ ముగిసేనాటికి స్వల్పలాభాలను నమోదుచేశాయి. సెన్సెక్స్ 41 పాయింట్ల లాభంతో 27,787 దగ్గర, నిఫ్టీ 19 పాయింట్ల లాభంతో 8,528 వద్ద ముగిసింది. ఐసీఐసీఐ బ్యాంకు, లుపిన్, రిలయెన్స్, టీసీఎస్, ఓఎన్జీసీ లు టాప్ లో నిలవగా.. హెచ్ యూఎల్, హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు, కోల్ ఇండియా, యాక్సిస్ బ్యాంకు, హీరో నష్టాలను నమోదుచేశాయి.
హిందూస్తాన్ యూనీలివర్ కంపెనీ సోమవారం ప్రకటించిన ఫలితాలతో వరుసగా రెండోరోజు నష్టాల్లోనే నమోదుచేసింది. వాల్యుమ్ గ్రోత్ లో దలాల్ స్ట్రీట్ ను నిరాశరచడంతో, స్టాక్ 2.9 శాతం కిందకు పడిపోయి, రూ.895గా ట్రేడ్ అయింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల రీకాపిటలైజేషన్ కోసం కేటాయించిన నిధుల్లో మొదటి విడత నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నేపథ్యంలో నిఫ్టీ పీఎస్ యూ బ్యాంకు ఇండెక్స్ 0.26శాతంతో స్వల్పంగా లాభపడింది.
అటు కరెన్సీ మార్కెట్ లో డాలర్ తో రూపాయ మారకం విలువ 0.06పైసలు లాభపడి, రూ.67.14గా ఉంది. 10 గ్రాముల పుత్తడి ధర రూ.46 లాభంతో రూ.31,061గా నమోదైంది.