
చక్కెర తింటే నిద్రొస్తుందట!
చాక్లెట్లు, స్వీట్లు తినడం వల్ల పిల్లల్లో మంచి ఉత్సాహం, చురుకుదనం వస్తుందని కొందరు తల్లిదండ్రుల నమ్మకం. అయితే నిజానికి ఇలాంటి చక్కెర గల పదార్థాలతో నిద్ర వచ్చే అవకాశాలున్నాయని, చక్కెర మగతను కలిగించగలదని పరిశోధకులు అంటున్నారు. ‘‘అతిగా భోజనం చేసిన తర్వాత నిద్ర ఎక్కువగా వస్తుందని మనలో చాలా మంది అనుకుంటాం. కానీ అంతకంటే అధికంగా చక్కెర గల పదార్థాలు తీసుకుంటే త్వరగా నిద్రలోకి జారుకుంటాం’’ అని లియాన్ న్యూరోసైన్స్‌కు చెందిన పరిశోధకుడు క్రిస్టోఫీ వెరిన్ తెలిపాడు.
ఫ్రాన్స్‌కు చెందిన వెరిన్ బృందం ఎలుకల్లో జరిపిన ప్రయోగం ద్వారా ఈ విషయం వెల్లడైంది. అధ్యయనంలో భాగంగా కొన్ని ఎలుకల మెదడులోకి గ్లూకోజ్ (చక్కెరలోని ఓ రకం)ను ఇంజెక్ట్ చేశారు. మెదడులోని వీఎల్‌పీఓ (వెంట్రోలేటరల్ ప్రీయాప్టిక్ న్యూక్లియస్) ప్రాంతంలో దీన్ని ఇంజెక్ట్ చేశారు. ఎలుకలకు నిద్ర కలిగేందుకు వీఎల్‌పీఓ తోడ్పడుతుంది.
గ్లూకోజ్‌ను ఇంజెక్ట్ చేసిన వెంటనే అవి నిద్రలోకి జారుకున్నాయి. దాదాపు రెండు గంటలపాటు అవి నిద్రలోనే ఉన్నాయి. ఎలుకల్లాగే మానవుల మెదడుపై చక్కెర పదార్థాలు ప్రభావం చూపగలవని అధ్యయనవేత్తలు తెలిపారు. చక్కెర కలిగిన పిండి పదార్థాలు ఉన్న ఆహారం అధికంగా తీసుకున్నప్పుడు మనకు కూడా నిద్ర వచ్చే అవకాశం అధికంగా ఉందని వారు అన్నారు.