
పాక్‌లో కోర్టుపై దాడి
పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లోని ఓ కోర్టుపై సోమవారం ఆత్మాహుతి దళాలు దాడికి దిగాయి. గ్రెనేడ్లు విసురుతూ, విచ్చలవిడిగా కాల్పులు జరుపుతూ మారణకాండకు తెగబడ్డాయి.
జడ్జి సహా 11 మంది మృతి, 25 మందికి గాయాలు
ఇస్లామాబాద్: పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లోని ఓ కోర్టుపై సోమవారం ఆత్మాహుతి దళాలు దాడికి దిగాయి. గ్రెనేడ్లు విసురుతూ, విచ్చలవిడిగా కాల్పులు జరుపుతూ మారణకాండకు తెగబడ్డాయి. ఈ ఉగ్రవాద దాడిలో అదనపు సెషన్స్ జడ్జి రఫాకత్ అహ్మద్ ఖాన్ అవాన్, పలువురు న్యాయవాదులు సహా 11 మంది మరణించారు. మరో 25 మంది గాయపడ్డారు.ఇస్లామాబాద్ ఎఫ్-8 ప్రాంతంలోని జిల్లా కోర్టులో ఈ దాడి జరిగింది.
దాడికి పాల్పడిన వారి సంఖ్య కచ్చితంగా తెలియరాలేదని, అయితే పోలీసులు ఇద్దరిని చుట్టుముట్టగా వారు తమను తాము పేల్చేసుకున్నారని, ఇది ఆత్మాహుతి దాడి అని ఇస్లామాబాద్ పోలీసు చీఫ్ సికందర్ హయాత్ తెలిపారు. మృతుల్లో, గాయపడిన వారిలో అధిక శాతం మంది న్యాయవాదులేనని వెల్లడించారు. కోర్టులో విచారణ నిమిత్తం వచ్చిన తమ సహచరులను విడిపించుకుపోవడానికే ఉగ్రవాదులు దాడికి దిగి ఉంటారని భావి స్తున్నారు.
కానీ పోలీసులు చుట్టుముట్టడంతో వారు తమను తాము పేల్చేసుకుని ఉంటారంటున్నారు. ‘ఇద్దరు సాయుధులు కోర్టు ఆవరణలోకి చొరబడ్డారు.. వచ్చీ రావడంతోనే గ్రెనేడ్లు విసిరా రు.భారీఆయుధాలతో విచక్షణారహితంగా కాల్పు లు జరిపారు’ అని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.