‘సూర్య’ గ్రహణంపై లోకాయుక్త విచారణ | 'Sun' eclipse Lokayukta inquiry | Sakshi
Sakshi News home page

‘సూర్య’ గ్రహణంపై లోకాయుక్త విచారణ

Published Thu, Feb 25 2016 2:05 AM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

'Sun' eclipse Lokayukta inquiry

సాక్షి ఎఫెక్ట్..
* ఈ వ్యవహారంపై నివేదిక ఇవ్వాలని మహబూబ్‌నగర్ కలెక్టర్‌కు ఆదేశం
* ‘సాక్షి’ కథనంతో కదలిన అధికారులు
* బీడుగా పేర్కొన్న భూముల్లో పొలాలు, పండ్ల తోటల గుర్తింపునకు చర్యలు

సాక్షి, హైదరాబాద్, కేటిదొడ్డి: సాగు భూములను బీడు భూములంటూ తప్పుడు నివేదికలు ఇచ్చి స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ రెవెన్యూ అధికారులపై దాఖలైన పిటిషన్‌ను తెలంగాణ, ఏపీల ఉమ్మడి లోకాయుక్త జస్టిస్ బి.సుభాషణ్‌రెడ్డి ఇప్పటికే విచారణకు స్వీకరించారు.

ఈ అంశంలో రెవెన్యూ అధికారుల బాధ్యతారాహిత్యంపై లోకాయుక్త విస్మయం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి మార్చి 16లోగా నివేదిక సమర్పించాలని మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. అయితే మహబూబ్‌నగర్ జిల్లా గట్టు మండలంలో సోలార్ పార్కు ఏర్పాటు కోసం ప్రభుత్వం 5,622 ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించింది. అక్కడి అసైన్డ్ భూములకు పరిహారం ఎగ్గొట్టేందుకు.. ఆ భూములన్నీ బీడుగా ఉన్నాయని, వాటి అసైన్‌మెంట్‌ను రద్దు చేస్తున్నామని రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ వ్యవహారంపై లోకాయుక్తలో పిటిషన్ నమోదైంది.
 
తోటల గుర్తింపునకు అధికారుల కసరత్తు
పచ్చని పంట పొలాలను బీడు భూములని పేర్కొంటూ స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేయడంపై బుధవారం ‘సాక్షి’లో ప్రచురితమైన ‘పేద రైతులకు ‘సూర్య’గ్రహణం’ కథనం చర్చనీయాంశమైంది. దీనిపై ఉన్నతాధికారులు స్థానిక అధికారులను ఆరా తీసినట్లు తెలిసింది. దీంతో కాలూర్‌తిమ్మన్‌దొడ్డిని బుధవారం రెవెన్యూ ఇన్స్‌పెక్టర్ కరుణాకర్, వీఆర్వో రవి  సందర్శించి... అసైన్డ్ భూముల్లో పండ్ల తోటలు సాగు చేస్తున్న రైతుల వివరాలను సేకరించారు.

ఈ నేపథ్యంలో పలువురు రైతులు అధికారుల తీరును తప్పుబట్టారు. రైతుల ఆవేదనను ‘సాక్షి’ కథనం కళ్లకు కట్టినట్లు చూపిందని కుచినేర్ల, కాలూర్‌తిమ్మన్‌దొడ్డి గ్రామ రైతులు పేర్కొన్నారు. 6 నుంచి 10 ఏళ్ల తోటలున్న భూములను కూడా అధికారులు గుడ్డిగా బీడుగా పేర్కొంటూ నోటీసులు ఇవ్వడమేమిటన్నారు. ప్రాజెక్టులకు తాము వ్యతిరేకం కాదని, అలాగని అడ్డదారిలో, పరిహారం ఇవ్వకుండా భూములను లాక్కుంటామంటే చూస్తూ ఊరుకోబోమని చెప్పారు.
 
బలవంతపు భూసేకరణను వ్యతిరేకిస్తాం
సోలార్ ప్రాజెక్టు పేరుతో రైతుల నుంచి బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా పోరాటం చేయనున్నట్లు రాష్ట్ర అసంఘటిత కార్మిక సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షుడు గోపాల్‌రావు వెల్లడించారు. సోలార్ ప్రాజెక్టు పేరుతో 18 వేల మంది రైతుల కుటుంబాలను రోడ్డున పడేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. రైతుల తరఫున తాము పోరాటం చేయనున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement