బీడు భూములకు మహర్దశ
ఖమ్మం మయూరిసెంటర్: జిల్లాలోని బీడు భూములకు మహర్దశ రానుంది. ప్రతి వర్షం చుక్క సాగుకు ఉపయోగకరంగా మరల్చడం, అడుగంటి పోతున్న భూగర్భజలాలు పెంపుకోసం ఇటు సాగునీటి వనరుల పెంపు, అటు కూలీలకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో చేపడుతున్న వాటర్ షెడ్ పనుల కోసం జిల్లా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి ఈ పనుల కింద రూ. 23 కోట్లు మంజూరు అయినట్లు ఉపాధి హామీ పథకం జిల్లా అధికారులు చెబుతున్నారు.
ఇప్పుడు విడుదలైన రూ.23.37 కోట్లతో జిల్లాలోని ములకలపల్లి మండలంలోని పొగళ్లపల్లి గ్రామంలో రూ.705 లక్షలతో, చండ్రుగొండ మండలం రావికంపాడు గ్రామంలో 578.61 లక్షలతో, పాల్వంచలోని పాయకారి యానంబైలులో 634.64 లక్షలతో, కొత్తగూడెం మండలంలోని చుంచుపల్లి గ్రామంలో 419.72 లక్షలతో ఆయా ఏజెన్సీల ఆధ్వర్యంలో పనులు చేపడుతామని అధికారులు వెల్లడించారు.
ఏరియా గుర్తింపుకు ప్రమాణాలు..
కోట్లాది రూపాయల ఖర్చుతో చేపట్టే వాటర్ షెడ్ పనులకు రైతులకు, కూలీలకు ఉపయోగపడటంతోపాటు పేదరిక నిర్మూలన, ఉపాధి అవకాశాలు పెంచేలా ఉండాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. ఇందుకోసం ల్యాండ్‌రెవెన్యూ న్యూఢిల్లీ సంచాలకులు వాటర్‌షెడ్ ఏరియాను గుర్తించేందుకు 13 ప్రమాణికాలను సూచించారు. ఇందులో వాటర్ షెడ్ పనులు చేపట్టే ప్రాంతంలో పేదరిక జనాభా శాతం,ఎస్సీ,ఎస్టీ జనాభాశాతం, సరాసరి దినసరి కూలిశాతం, చిన్న, సన్న కారు రైతుల శాతం, భూగర్భ జలాలస్థితి, తేమ సూచిక, వర్షాధారపు భూమి విస్తీర్ణం.
తాగునీటి పరిస్థితి, కొరత, బంజర భూములు/క్షీణతకు గురైన భూములు, భూమి ఉత్పాదక శక్తి, వాటర్ షెడ్ పథకం అమలు చేస్తున భూములకు దూరం, సమమైన భూములలో వివిధ గ్రామాలు/ మైక్రో వాటర్‌షెడ్ సమూహాలు, గుట్టలలో ఉన్న వివిధ గ్రామాల సమూహం. మొదలగు అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. అదేవిధంగా సగటున 1000-5000 హెక్టార్ల విస్తీర్ణం కలిగిన కొన్ని గ్రామాల సముదాయం ఒక్క ప్రాజెక్టుగా చేపడుతారని జిల్లా వాటర్ షెడ్ నిర్వాహకాధికారి విజయ్‌చందర్ తెలిపారు. ఎంపిక చేసిన ప్రాజెక్టును 4నుండి 7 సంవత్సరాల కాలవ్యవధిలో పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు.
నిరుపేదలకు జీవనోపాధి...
వాటర్‌షెడ్ పథకంలో ప్రాజెక్టు నిధుల నుంచి 9 శాతం బడ్జెట్ కేటాయించారు. ఇందులో 5 శాతం నిధులు సెర్ఫ్ కమిషనర్ ఆధ్వర్యంలో ఖర్చు చేస్తారు. మిగిలిన 4 శాతం నిధులు డ్వామా పరిధిలో వాటర్‌షెడ్ పథకంలోని గ్రామాల్లో ఉన్న గ్రామ సమాఖ్యల ద్వారా వ్యవసాయ ఆధారిత జీవనోపాధి, వ్యవసాయేతర జీవనోపాధికి సమకూరుస్తారు.
ఈ నిధులను డీఆర్డీఏ ప్రాజెక్టు డెరైక్టర్ ద్వారా ఖర్చు చేస్తారు. అదేవిధంగా వాటర్‌షెడ్ పథకంలో సహజ వనరుల యాజమాన్యానికి అత్యధిక ప్రాధాన్యతను ఇచ్చి 56 శాతం నిధులు కేటాయించారు. క్షీణిస్తున్న సహజ వనరులైన భూమి, నీరు, పచ్చదనం, పశు సంపద, మానవ అభివృద్ధి కార్యక్రమాలను చేపడతారు.
భూమిని ఎత్తు నుంచి పల్లపు ప్రాంతం మొత్తాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడానికి ఉపాధి హామీ పథకం సమన్వయంతో అధిక మొత్తంలో నిధులు వెచ్చించి పనులు చేపట్టేందుకు కార్యక్రమం రూపొందించారు. దీనికింద చెక్‌డ్యామ్ లు, చెక్ వాల్స్, రాతి కట్టడాలు, ఫారంపాండ్, నాడెప్ కంపోస్ట్ ఎరువు గుంత, నీటి నిల్వ కందకాలు, చిన్న ఊట కుంట, ఊటగుంత, రోడ్డు ఇరువైపులా మొక్కల పెంపకం, గట్లపై మొక్కల పెంపకం, పండ్ల తోటల పెంపకం తదితర పనులు చేపడుతున్నారు.