అసహజ మరణమే | Sunanda Pushkar died a 'sudden, unnatural death': doctors | Sakshi
Sakshi News home page

అసహజ మరణమే

Published Sun, Jan 19 2014 1:48 AM | Last Updated on Sat, Sep 2 2017 2:45 AM

అసహజ మరణమే

అసహజ మరణమే

    సునందపుష్కర్ మృతిపై ఎయిమ్స్ వైద్యుల ప్రకటన
    శశిథరూర్ భార్య మరణంపై బలపడుతున్న అనుమానాలు
    మృతదేహానికి ఎయిమ్స్‌లో వైద్యుల బృందం పోస్టుమార్టం
    ఆమె శరీరంపై గాయాలను గుర్తించినట్లు వైద్యుల వెల్లడి
    విషప్రయోగం అవకాశాన్నీ కొట్టివేయని వైనం
    లోతైన పరీక్షలకోసం శరీరం నుంచి నమూనాల సేకరణ
    రెండు రోజుల్లో పూర్తి నివేదిక సమర్పిస్తామన్న వైద్యులు
    పోస్టుమార్టం సమయంలో ఎయిమ్స్‌లోనే థరూర్
    ఛాతీనొప్పి, గుండెదడతో ఆస్పత్రిలో చేరిన కేంద్రమంత్రి
    సునంద మృతి వెనుక కుట్ర ఉందన్న ఆమె బంధువులు
    ఆమె మరణంపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని డిమాండ్


న్యూఢిల్లీ: కేంద్రమంత్రి శశిథరూర్ భార్య సునందపుష్కర్‌ది ఆకస్మిక, అసహజ మరణమని.. ఆమె మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన ఎయిమ్స్ వైద్యులు స్పష్టంచేశారు. ఆమె శరీరంపై కొన్ని గాయాలను కూడా గుర్తించామని తెలిపారు. ఆమెపై విషప్రయోగం జరిగిందనే అవకాశాన్నీ కొట్టివేయలేమని పేర్కొన్నారు. తన భర్త శశిథరూర్‌కు పాక్ జర్నలిస్టు మెహర్‌తరార్‌తో వివాహేతర సంబంధం ఉందని, తమ వైవాహిక బంధాన్ని విచ్ఛిన్నం చేసేందుకు మెహర్ ప్రయత్నిస్తున్నారని గురువారం తీవ్ర ఆరోపణలు చేసిన సునందపుష్కర్ (52) ఆ మరుసటి రోజు శుక్రవారం రాత్రి దక్షిణ ఢిల్లీలోని లీలా ప్యాలెస్ హోటల్ గదిలో అనుమానాస్పద స్థితిలో విగతజీవిగా కనిపించిన విషయం తెలిసిందే. ఆమె మృతదేహాన్ని శుక్రవారం రాత్రికే ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (ఎయిమ్స్) ఆస్పత్రికి తరలించగా.. శనివారం మధ్యాహ్నం ముగ్గురు వైద్యుల బృందం ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహించారు.

సునందది అసహజ మరణమని, ఆమె శరీరంపై పలు గాయాలున్నాయని వైద్యులు ప్రాథమికంగా చెప్పటంతో.. ఆమె మరణంపై అనుమానాలు మరింత బలపడ్డాయి. ఇదిలావుంటే.. సునంద మృతదేహాన్ని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించిన కొద్దిసేపటికే ఆమె భర్త, కేంద్రమంత్రి శశిథరూర్ తనకు ఛాతీనొప్పి వస్తోందం టూ అదే ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు. సునంద మృతదేహానికి వైద్యుల బృందం పోస్టుమార్టం నిర్వహిస్తున్న సమయంలో.. ఆయన ఆస్పత్రిలోనే వైద్యుల పరిశీలనలో ఉన్నారు. థరూర్‌కు ఈసీజీ, తదితర వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. ఆయన ఆరోగ్యం మామూలుగానే ఉందని నిర్ధారించి.. తర్వాత డిశ్చార్జ్ చేశారు. జీవితంలో ఎన్నో కష్టాలను ధైర్యంగా ఎదుర్కొని పోరాడిన సునంద ఆత్మహత్య చేసుకున్నారనే వాదనను ఆమె బంధువులు కొట్టివేశారు. ఆమె మరణం వెనుక కుట్ర ఉందని అనుమానాలు వ్యక్తంచేస్తూ.. దీనిపై సీబీఐ దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. మరోవైపు సునందకు ఎలాంటి తీవ్ర అనారోగ్యం లేదని.. కొద్దిరోజుల కిందట ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించిన తిరువనంతపురం కిమ్స్ వైద్యులు ప్రకటించారు. సునంద భౌతికకాయానికి ఢిల్లీ లోధీరోడ్డులోని శ్మశానవాటికలో బంధువుల సమక్షంలో దహన సంస్కారాలు పూర్తిచేశారు.

రెండు రోజుల్లో పూర్తిస్థాయి పోస్టుమార్టం నివేదిక

సునంద మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన వైద్యుల బృందానికి ఎయిమ్స్ ఫోరెన్సిక్ సెన్సైస్ విభాగం అధిపతి డాక్టర్ సుధీర్ కె.గుప్తా నేతృత్వం వహించారు. ఫోరెన్సిక్ మెడిసిన్స్ అదనపు ప్రొఫెసర్ డాక్టర్ ఆదర్శ్‌కుమార్, అదే విభాగంలో సీనియర్ రెసిడెంట్ డాక్టర్ శశాంక్‌పునియాలు ఈ బృందంలో సభ్యులుగా ఉన్నారు. దాదాపు గంటన్నర పాటు కొనసాగిన పోస్టుమార్టం ప్రక్రియను వీడియోలో చిత్రీకరించారు. అనంతరం.. పోస్టుమార్టంలో ప్రాథమికంగా గుర్తించిన అంశాలను డాక్టర్ గుప్తా, డాక్టర్ ఆదర్శ్‌కుమార్‌లు మీడియాకు తెలిపారు. ముఖ్యాంశాలివీ...

    ‘‘మేం పోస్టుమార్టం పరీక్ష నిర్వహించాం. సునందపుష్కర్‌ది ఆకస్మిక, అసహజ మరణం. విషప్రయోగం జరిగిన దాఖలాలు లేవు. ఆమె శరీరంపై కొన్ని గాయాలు ఉన్నాయి. పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది కాబట్టి.. ఆ గాయాల వివరాలను నేను బహిర్గతం చేయలేను.
    సాధారణంగా.. మెడికో - లీగల్ కేసుల్లో గాయాల సంఖ్య ఎంత అనే దానికి ప్రాధాన్యం లేదు. ఆ గాయాలకు మరణంతో సంబంధం ఉందా? లేదా? అన్నదే ముఖ్యం. సునంద శరీరంపై గాయాల వల్ల ఆమె మరణం సంభవించిందా? లేదా? అనే విషయాన్ని ఇప్పుడు వెల్లడించలేను.
    మరణానికి కారణం విషప్రయోగం కాదు అని ఇప్పుడే చెప్పలేం. దీనికి సంబంధించి లోతైన పరీక్షలు, విశ్లేషణల కోసం సునంద శరీరభాగాలు, గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, కిడ్నీ వంటి అంతర్గత అవయవాల నుంచి కొన్ని నమూనాలు సేకరించాం.
    ఈ పరీక్షలు పూర్తయ్యాక రెండు రోజుల్లో తుది పోస్టుమార్టం నివేదికను రూపొందిస్తాం. ఆకస్మిక, అసహజ మరణానికి సంబంధించి వైద్య కోణంపై కేంద్రీకరించి ఈ నివేదిక ఉంటుంది. దీనిని సోమవారం సీల్డ్ కవర్‌లో కేసు దర్యాప్తు చేస్తున్న సబ్ డివిజినల్ మెజిస్ట్రేట్‌కు అందజేస్తాం.
    సునంద కడుపులో క్షయ, లూపస్ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు గుర్తించాం. దీనిపై ఆమె తీసుకున్న చికిత్స వివరాల్ని అందించాలని కోరాం.’’

ముఖం, చేయిపై గాయాలు!: సునంద ముఖం, చేతి మీద గాయాలున్నట్లు అభిజ్ఞవర్గాలు తెలిపాయి. కానీ.. ఆ గాయాలు ఆమె మరణానికి కారణం కాదని పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు అభిప్రాయపడ్డట్లు సమాచారం. శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 7 గంటల మధ్య సునంద చనిపోయినట్లు వైద్యులు అంచనా వేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. ఒక వ్యక్తి ఎక్కువ మోతాదులో మద్యం సేవించటం.. స్పృహ కోల్పోయి, శ్వాసనాళాలు మూసుకుపోయి, గ్యాస్ట్రిక్ ఆస్పిరేషన్‌కు తద్వారా తీవ్రమైన న్యుమోనియాకు, చివరికి మరణానికి కారణమైన ఉదంతాలున్నాయని ఒక వైద్యుడు పేర్కొన్నారు. అయితే.. సునంద కేసుకు సంబంధించి పరీక్షలు నిర్వహిస్తున్న వైద్యులు.. పూర్తిస్థాయి పోర్టుమార్టం నివేదిక అందకుండా ఆమె మరణానికి కారణాలపై అంచనా వేయటానికి నిరాకరిస్తున్నారు.

మీకు తోడుగా ఉన్నాం థరూర్‌కు ప్రధాని లేఖ

న్యూఢిల్లీ: సునంద మృతిపై ప్రధాని మన్మోహన్  దిగ్భ్రాం తి వ్యక్తం చేశారు. ఆమె భర్త, మంత్రి థరూర్‌కు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ శని వారం లేఖ రాశారు. ‘ఈ విషాద సమయంలో మీకు తోడుగా ఉన్నామ’న్నారు. కాగా కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, మంత్రులు ఆంటోనీ, వయలార్ రవి తదితరులు ఢిల్లీలోని థరూర్ ఇంటికెళ్లి ఆయన్ను పరామర్శించారు.

చితికి నిప్పంటించిన సునంద కుమారుడు

సునందపుష్కర్ భౌతికకాయానికి శనివారం లోధీ రోడ్డు శ్మశానవాటికలో దహన సంస్కారాలు నిర్వహించారు. సునంద చితికి కుటుంబ సభ్యుల సమక్షంలో ఆమె కుమారుడు శివ్‌మీనన్ (21) కన్నీళ్ల పర్యంతమవుతూ నిప్పంటించారు. ఆమె భర్త శశిథరూర్ తీవ్ర విచారంలో మునిగిపోయి కర్మకాండలు నిర్వహించారు. సునంద తండ్రి పుష్కర్‌నాథ్‌దాస్, సోదరుడు తదితరులు అంత్యక్రియలకు హాజరయ్యారు. అంతకుముందు.. ఎయిమ్స్ ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం సునంద భౌతికకాయాన్ని లోధీ ఎస్టేట్ వద్ద శశిథరూర్ నివాసానికి తరలించారు. రక్షణమంత్రి ఎ.కె.ఆంటోనీ, ప్రవాస భారతీయ వ్యవహారాల మంత్రి వయలార్ రవి, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ తదితర ప్రముఖులు ఆమె భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.

‘ఆమెకు తీవ్ర అనారోగ్యమేదీ లేదు’

తిరువనంతపురం: అనుమానాస్పద స్థితిలో చనిపోయిన సునందకు ఎలాంటి తీవ్రమైన  అనారోగ్యమూ లేదని కేరళ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్(కిమ్స్) వైద్యుల బృందం స్పష్టం చేసింది. చాలా మంది లాగానే సునంద సాధారణ వైద్యపరీక్షలకోసం 12న తిరువనంతపురంలోని కిమ్స్‌లో చేరినట్లు వైద్యులు తెలిపారు. ఆమె భర్త కూడా ఆమెతోపాటు ఉన్నారని.. పరీక్షలు పూర్తయ్యాక 14న డిశ్చార్జ్ అయ్యారని వివరించారు. వైద్యపరీక్షల ఫలితాలు పూర్తిగా వచ్చాక మరోసారి వైద్యులను సంప్రదించేందుకు సునంద ఇంకో వారంలో మళ్లీ ఆస్పత్రికి రావాల్సి ఉందని వెల్లడించారు. శుక్రవారం ఆమె అనుమానాస్పద మరణం నేపథ్యంలో.. కిమ్స్ వైద్యుల బృందం ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ విజయరాఘవన్ నేతృత్వంలో సమావేశమై.. సునంద వైద్య పరీక్షల నివేదికలను అధ్యయనం చేసింది. ఆమెకు ఎలాంటి సీరియస్ అనారోగ్యమూ లేదని ఆ తర్వాత విజయరాఘవన్ మీడియా భేటీలో వెల్లడించారు.

మరణంపై సీబీఐ దర్యాప్తు: సునంద బంధువుల డిమాండ్

‘‘సునంద నాకు మేనత్త కూతురు. నేను తనకు కుమారుడి లాంటి వాడినని ఆమె చెప్తుండేవారు. ఆమెకు మైగ్రేన్ (తరచుగా వచ్చే తలనొప్పి) తప్ప మరెలాంటి తీవ్రమైన వ్యాధీ లేదు. తన జీవితంలో ఇటీవల జరుగుతున్న పరిణామాలతో ఆమె తీవ్ర కలతకు లోనయ్యారనటం నిజమే. ఆమె చాలా ధైర్యవంతురాలు. జీవితంలో ఎదగటానికి చాలా పోరా టం చేశారు. ఆమె తననుతాను మలుచుకున్న మహిళ. ఆమెలాంటి వారు ఆత్మహత్య చేసుకోరు. ఆమె జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. దుర్దినాలు చూశారు. ఆమె మనుగడ కోసం పోరాడటాన్ని మేం చూశాం. బంధువులకు సాయం చేయటానికి ఎల్లప్పుడూ ముందుండేవారు. ఆమె మరణంతో దిగ్భ్రాంతికి లోనయ్యాం. ఆమె మరణంపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని మేం డిమాండ్ చేస్తున్నాం’’ అని సునంద బంధువు, జమ్మూకాశ్మీర్‌లో నివసించే సంజయ్‌పండిత, ఆయన భార్య అనుపండిత డిమాండ్ చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement