
‘సంపూర్ణ గోవధ నిషేధం’పై సుప్రీం కీలక తీర్పు
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నవేళ గోవధకు సంబంధించిన పిటిషన్ విచారణపై సుప్రీంకోర్టు కీలకమైన నిర్ణయం తీసుకుంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో గోవధను సమూలంగా నిషేధించాలని, కబేళాలను ఎత్తేసేలా ఉత్తర్వులు జరీచేయాలని కోరుతూ దాఖలైన ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్)ను శుక్రవారం కొట్టేసింది. సదరు వ్యాజ్యం విచారణకు ఏమాత్రం అర్హం కాదని స్పష్టం చేసింది.
‘కొన్ని రాష్ట్రాలు గోవధను నిషేధించాయి. ఇంకొన్ని రాష్ట్రాలు అలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. రాష్ట్రాలు రూపొందించుకునే చట్టాలపై మేం జోక్యం చేసుకోలేం. దేశమంతటా గోవధను నిషేధించేలా ఆదేశాలు ఇవ్వలేం..’అని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. గోవుల అక్రమ రవాణాపై ఇప్పటికే తాను మార్గదర్శకాలు ఇచ్చానన్న సుప్రీంకోర్టు.. కొత్తగా సంపూర్ణ గోవధ నిషేధం పిటిషన్‌ను విచారించాల్సిన అవసరం లేదని పేర్కొంది.
మహారాష్ట్ర, హరియాణా, మధ్యప్రదేశ్ సహా పలు బీజేపీ పాలిత రాష్ట్రాలు గోవధను, గోమాంసాన్ని నిషేధించిన నేపథ్యంలో, దేశంలోని మిగతా రాష్ట్రాలు కూడా అదే విధానాన్ని అవలంభించాలని ఒక వర్గం నుంచి డిమాండ్ వ్యక్తమైన సంగతి తెలిసిందే. ఆ మేరకు వినీత్ సహాయ్ అనే న్యాయవాది సుప్రీంకోర్టులో పిల్ వేశారు.