మళ్లీ సుప్రీం‘కోర్టు’లో కౌన్సెలింగ్ | supreme court hearing over eamcet counselling again | Sakshi
Sakshi News home page

మళ్లీ సుప్రీం‘కోర్టు’లో కౌన్సెలింగ్

Published Sat, Sep 27 2014 12:39 AM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM

మళ్లీ సుప్రీం‘కోర్టు’లో కౌన్సెలింగ్ - Sakshi

మళ్లీ సుప్రీం‘కోర్టు’లో కౌన్సెలింగ్

సాక్షి, న్యూఢిల్లీ: అనుమతుల ఆలస్యం కారణం గా ఎంసెట్ కౌన్సెలింగ్‌లో అవకాశం కోల్పోయామని, మరోసారి కౌన్సెలింగ్‌కు అనుమతించాలని కోరుతూ రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలలు దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు శుక్రవారం విచారణకు స్వీకరించింది. దీనిపై కౌంటర్లు దాఖలు చేయాలని కోరుతూ జేఎన్‌టీయూహెచ్, తెలంగాణ ప్రభుత్వం, ఏపీ ఉన్నత విద్యా మండలికి ఆదేశాలు జారీ చేసింది. ఈ పిటిషన్లపై విచారణను బెంచ్‌కు అప్పగిస్తామని.. వచ్చే నెల 10 వీటిపై విచారణ జరుగుతుందని పేర్కొంది. నిబంధనలకు అనుగుణంగా లేవం టూ గత నెలలో 174 ఇంజనీరింగ్ కళాశాలలకు గుర్తింపును జేఎన్‌టీయూహెచ్ నిరాకరించిన విషయం తెలిసిందే. దానిపై కళాశాలల యాజ మాన్యాలు హైకోర్టును ఆశ్రయించడంతో... ఏఐసీటీఈ ప్రమాణాల మేరకు వసతులు సమకూర్చుతామంటూ అఫిడవిట్ తీసుకుని కళాశాలలకు గుర్తింపు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఈ మేరకు సుమారు 130 కాలేజీలు యూనివర్సిటీకి అఫిడవిట్ ఇచ్చాయి. కానీ అప్పటికే సమయం మించిపోయిందంటూ.. ప్రభుత్వం ఆయా కళాశాలలను కౌన్సెలింగ్‌లో చేర్చలేదు.
 
 దాంతోపాటు రెండో విడత కౌన్సెలింగ్‌కు అనుమతివ్వాలంటూ ఏపీ ఉన్నత విద్యామండలి సుప్రీంకోర్టును ఆశ్రయించినా... అంతకుముందే గడువు పెంచామని, మళ్లీ అనుమతివ్వబోమని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో అనుమతుల ఆలస్యం కారణంగా తాము నష్టపోయామంటూ 25 ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహించేందుకు అనుమతించాలని, లేదంటే ప్రత్యేకంగా కౌన్సెలింగ్ నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థించాయి. దీనిని శుక్రవారం జస్టిస్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్, జస్టిస్ అనిల్ దవేలతో కూడిన ధర్మాసనం  విచారణకు స్వీకరించింది.
 
 ముందుగానే చేపట్టాల్సిన తనిఖీలను చివరివరకూ చేపట్టలేదని.. చిన్న చిన్న కారణాలను చూపుతూ అఫిలియేషన్‌ను నిరాకరించడం సరి కాదంటూ కాలేజీల యాజమాన్యాల తరఫున న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వి, కపిల్ సిబల్, జీఎన్ రెడ్డి, తెలంగాణ అడ్వొకేట్ ఆన్ రికార్ట్స్ ఉదయ్‌కుమార్ సాగర్ వాదనలు విని పించారు. అనుమతుల విషయంలో జాప్యం జరగడంతో.. కళాశాలలు నష్టపోయాయని కోర్టుకు తెలిపారు. ఈ కాలేజీలను కౌన్సెలింగ్‌కు అనుమతించాలని హైకోర్టు ఆదేశించినా.. అప్పటికే ఆలస్యమైందంటూ జాబితాలో చేర్చలేదని విన్నవించారు. అయితే దీనిపై తెలంగాణ ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి వాదనలు వినిపిస్తూ... రాష్ట్ర విభజన నేపథ్యంలో కౌన్సెలింగ్ గడువును జూలై31 నుంచి ఆగస్టు  31 వరకు పొడిగించారని కోర్టుకు తెలిపారు. అప్పటికీ కౌన్సెలింగ్ పూర్తికాకపోవడంతో రెండో దశ కౌన్సెలింగ్‌కు అనుమతి ఇవ్వాలన్న విజ్ఞప్తిని ఇంతకుముందే సుప్రీంకోర్టు ధర్మాసనం తోసిపుచ్చిందని వివరించారు.
 
 అయితే ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మా సనం పిటిషన్లను విచారణకు స్వీకరించింది. ఈ విచారణను సంబంధిత ధర్మాసనానికి బదిలీ చేస్తామని పేర్కొంటూ.. విచారణను వచ్చే నెల 10వ తేదీకి వాయిదా వేసింది. దీనిపై కౌంటర్లు దాఖలు చేయాల్సిందిగా ఆదేశిస్తూ.. తెలంగాణ ప్రభుత్వం, ఏపీ ఉన్నత విద్యామండలి, జేఎన్‌టీయూలకు నోటీసులు జారీ చేసింది.
 
 మాకు న్యాయం చేయండి
 రెండో దశ కౌన్సెలింగ్‌కు అనుమతించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాం. న్యాయస్థానం దీనిపై విచారణను వచ్చేనెల 10వ తేదీకి వాయిదా వేసింది. జేఎన్‌టీయూహెచ్‌కు, తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. కళాశాలల తనిఖీకి, నివేదిక ఇచ్చేందుకు... కౌన్సెలింగ్ తేదీకి మధ్య వ్యవధి తక్కువగా ఉన్నం దున హడావుడి నిర్ణయం తీసుకున్నారు. దీంతో కొన్ని కాలేజీల వాళ్లు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. ఎక్కడో సమాచార లోపంతోనే ఈ పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం, జేఎన్‌టీయూహెచ్ సహృదయంతో ఆలోచించి విద్యార్థులకు, కళాశాలల యాజమాన్యాలకు న్యాయం చేసేలా నిర్ణయం తీసుకోవాలి
     - నీల సత్యనారాయణ, చైర్మన్, కోదాడ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఫర్ విమెన్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement