‘బొగ్గు’ మార్గదర్శకాలను మా ముందుంచండి
న్యూఢిల్లీ: యూపీఏ ప్రభుత్వాన్ని కుదిపేస్తున్న బొగ్గు గనుల స్కాంలో సర్కారుకు మరో ఎదురుదెబ్బ. ఈ కేసు దర్యాప్తునకు సంబంధించి సీబీఐ నివేదికపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు గనుల కేటాయింపుపై ప్రశ్న ల వర్షం కురిపించింది. బొగ్గుగనుల కేటాయింపునకు సంబంధించి స్క్రీనింగ్ కమిటీ అనుసరించిన విధివిధానాలను తమ ముందుంచాలని న్యాయమూర్తులు ఆర్.ఎం.లోధా, మదన్ బి.లోకూర్, కురియన్ జోసెఫ్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం కేంద్రాన్ని బుధవారం ఆదేశించింది. కేటాయింపులపై స్క్రీనింగ్ కమి టీ అనుసరించిన విధానాలు ఏమిటని ప్రశ్నించిన న్యాయమూర్తులు సదరు విధివిధానాలను దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఇచ్చిన ప్రకటనల్లో పేర్కొన్నారా అని ప్రశ్నించారు. అదేవిధంగా బొగ్గు గనుల శాఖలోని స్క్రీనింగ్ కమిటీ జరిపిన ఈ కేటాయింపుల నిర్ణయం సహేతుకంగా జరిగిందో లేదో కూడా తాము పరిశీలిస్తామని అటార్నీ జనరల్ జీఈ వాహనవతికి తెలిపారు. కాగా, ఇప్పటి వరకు జరిగిన 41 కేటాయింపులు రద్దు చేయనున్నట్టు కేంద్రం తెలిపింది.
న్యాయమూర్తుల వ్యాఖ్యలు వారి మాటల్లోనే..
స్క్రీనింగ్ కమిటీ 36వ భేటీలో తీసుకున్న నిర్ణయాల తాలూకు పూర్తి వివరాలు సమర్పించండి. కేటాయింపులు నిబంధనల మేరకే జరిగాయో లేదో మేం పరిశీలిస్తాం. దరఖాస్తులను ఏవిధంగా అనుమతించారో, ఏవిధంగా తిప్పికొట్టారో కూడా దృష్టి సారిస్తాం. కేటాంపులో కేంద్ర విద్యుత్ అథారిటీ (సీఈఏ) సిఫార్సులు ఆశ్చర్యకరం. స్క్రీనింగ్ కమిటీ వాటిని ఆమోదించి ఉండాల్సింది కాదు. మొత్తం 28 దరఖాస్తులను సీఈఏ సిఫార్సు చేస్తే 20 ఎలా ఆమోదించారు? మరో 11 కంపెనీల దరఖాస్తులను స్క్రీనింగ్ కమిటీ ఏవిధంగా జోడించింది? వీటిని కూడా సీఈఏ సిఫార్సు చేసిందా?