శాస్త్రి మరణంపైనా అనుమానాలు!
ఆయన మృతికి సంబంధించిన ఫైళ్లనూ బయటపెట్టాలి..
- లాల్ బహదూర్ శాస్త్రి తనయుల డిమాండ్
న్యూఢిల్లీ: నేతాజీకి సంబంధించిన రహస్య ఫైళ్లను పశ్చిమబెంగాల్ ప్రభుత్వం బహిర్గతం చేసిన నేపథ్యంలో.. మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి హఠాన్మరణానికి సంబంధించిన ఫైళ్లను కూడా వెల్లడి చేయాలన్న డిమాండ్ ప్రారంభమైంది. లాల్ బహదూర్ శాస్త్రి కుమారుడు, కాంగ్రెస్ నేత అనిల్ శాస్త్రి ఆదివారం ఈ డిమాండ్‌ను ముందుకు తెచ్చారు. నాటి సోవియట్ యూనియన్‌లోని తాష్కెంట్‌లో 1966, జనవరి 11న తన తండ్రి ఆకస్మికంగా చనిపోవడం వెనుక అనేక అనుమానాలున్నాయని, అందువల్ల దానికి సంబంధించిన ఫైళ్లను బహిర్గతం చేయాలని అనిల్ కోరుతున్నారు.
ఈ మేరకు ప్రధాని మోదీకి త్వరలో లేఖ రాస్తానన్నారు. 1965నాటి భారత్-పాక్ యుద్ధానంతర శాంతి ఒప్పందంపై సంతకాలు చేసేందుకు తాష్కెంట్ వెళ్లిన లాల్ బహదూర్ శాస్త్రి(61).. సంతకాలు జరిగిన మర్నాడే హఠాత్తుగా కన్నుమూశారు. ఆయన గుండెపోటుతో మరణించారని నిర్ధారించారు. అయితే, తన తండ్రి మృతదేహం నీలంగా మారిందని, తెల్లటి మచ్చలు కనిపించాయని అనిల్ చెప్పారు. తాష్కెంట్లో కానీ భారత్‌లో కానీ తన తండ్రి మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించలేదని, పోస్ట్‌మార్టం చేసి ఉంటే మరణానికి కారణం తెలిసేదన్నారు. ఆ మరణం వెనుక కుట్ర ఉండి ఉండొచ్చనేది భావిస్తున్నానన్నారు. ‘కచ్చితంగా చెప్పలేను కానీ ఏదో జరిగింది. నాడు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ఆ ఘటనకు సంబంధించి ఎవరికీ శిక్ష పడలేదు. ఒక వెయిటర్‌ను మాత్రం అరెస్ట్ చేసి, వదిలేశారు. తాష్కెంట్‌కు వెళ్లినప్పుడు మా అమ్మ ఆ వెయిటర్‌ను కలవాలనుకుంది. కానీ అతడు ఎక్కడున్నాడో తెలియదని అధికారులు చెప్పారు.
మా నాన్న డైరీ మాయమైంది. తాష్కెంట్ ఒప్పందం గురించీ అందులో రాసి ఉండొచ్చు. నాన్నచనిపోయినప్పుడు ఆయన బెడ్ పక్కన ఉన్న థర్మాస్ ఫ్లాస్క్‌ను భారత్ తీసుకురాలేదు. ఆ థర్మాస్ ఫా్‌లస్కలో ఉన్న దానివల్లే మరణం సంభవించి ఉండొచ్చు. మృతిపై దర్యాప్తు జరుపుతున్న కమిషన్ ముందు వాంగ్మూలం ఇవ్వాల్సి ఉన్న నాన్నగారి డాక్టర్, సహాయకుడు ఇద్దరూ వేర్వేరు ప్రమాదాల్లో చనిపోయారు. ఇవ్వన్నీ అనుమానాలకు తావిచ్చేవిలా ఉన్నాయి’ అని అన్నారు. తన తండ్రి మరణానికి సంబంధించిన ఫైళ్లను బహిర్గత పర్చాల్సిందిగా ఐకే గుజ్రాల్, చంద్ర శేఖర్ సహా ఎందరో ప్రధానులను కోరానని లాల్ బహదూర్ శాస్త్రి మరో కుమారుడు, బీజేపీ నేత సునీల్ శాస్త్రి తెలిపారు.
నేతాజీ ఫైళ్లను బయటపెట్టండి: నేతాజీ కుమార్తె
కోల్‌కతా: నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు సంబంధించి కేంద్రం వద్దనున్న రహస్య ఫైళ్లను బయట పెట్టాలని ఆయన కుమార్తె అనితా బోస్ పాఫ్ ప్రధానిమోదీని కోరారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం బయటపెట్టిన 64 రహస్య ఫైళ్ల కాపీలు ఇంకా తనకు చేరలేదని ఆమె ఆదివారమిక్కడ తెలిపారు. అందుకే వాటిల్లో ఉన్న వివరాలు, ముఖ్యంగా నేతాజీ మరణానికి సంబంధించిన ఎలాంటి సమాచారమూ తన వద్ద లేదన్నారు. ఇన్నేళ్లూ రహస్యంగా మూసి ఉంచిన ఫైళ్లను బహిర్గతం చేయాలని స్కాలర్‌గా, నేతాజీ కుమార్తెగా కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నట్టు 72 ఏళ్ల అనిత చెప్పారు. జపాన్‌లోని నేతాజీ చితాభస్మానికి డీఎన్‌ఏ పరీక్షలు చేస్తే, మిస్టరీ వీడే అవకాశముందని అన్నారు.