విమానం హైజాకింగ్‌పై బలపడుతున్న అనుమానాలు | suspicions strengthening on Aircraft hijacking | Sakshi
Sakshi News home page

విమానం హైజాకింగ్‌పై బలపడుతున్న అనుమానాలు

Published Mon, Mar 17 2014 5:23 PM | Last Updated on Sat, Sep 2 2017 4:49 AM

తప్పిపోయిన ఎంహెచ్370 విమానంలోని ప్రయాణికుల ఎన్డిఏ నమూనాలను సేకరిస్తున్న ఇండోనేషియా పోలీస్ అధికారి

తప్పిపోయిన ఎంహెచ్370 విమానంలోని ప్రయాణికుల ఎన్డిఏ నమూనాలను సేకరిస్తున్న ఇండోనేషియా పోలీస్ అధికారి

కౌలాలంపూర్: మలేషియా ఎయిర్లైన్స్ విమానం ఎంహెచ్370 హైజాక్కు గురైందన్న అనుమానాలు  బలపడుతున్నాయి.  కౌలాలంపూర్ నుంచి ఈ నెల 7వ తేది శుక్రవారం అర్థరాత్రి  227 మంది ప్రయాణికులు 12 మంది సిబ్బందితో చైనా రాజధాని బీజింగ్ బయలుదేరిన ఈ విమానం మరుసటి రోజు శనివారం అదృశ్యమైన విషయం తెలిసిందే. ఇందులో అయిదుగురు భారతీయులు కూడా ఉన్నారు. అప్పటి నుంచి 26 దేశాలు ఈ విమానం గాలింపు చర్యల్లో పాల్గొంటున్నాయి. దాదాపు 43 షిప్పులు, 58 విమానాలు  జల్లెడపడుతున్నాయి. అయినా విమానం జాడ మాత్రం తెలియలేదు. విమానానికి సంబంధించి ఎలాంటి సమాచారంగానీ, శకలాల ఆచూకీగానీ దొరకలేదు.

రాడార్‌కు చిక్కకుండా  భూమికి 5వేల అడుగుల తక్కువ ఎత్తులో విమానం నడిపినట్లు భావిస్తున్నారు. విమానం దారి మళ్లించిన తర్వాత 8 గంటలపాటు గాల్లోనే విమానం తిరిగినట్లుగా చెబుతున్నారు. ఈ విమానం దారి మళ్లించిన తరువాత మూడు దేశాల్లో సంచరించినట్లు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియన్ తీరంలో  విస్తృతంగా  గాలిస్తున్నారు. గాలింపులో  26 దేశాలు  పాలుపంచుకుంటున్నాయి.

అసలు విమానం సముద్రంలో మునిగిందా లేక ఎవరైనా హైజాక్ చేశారా అన్న విషయం  తెలియలేదు. ఒకవేళ హైజాక్ చేసి ఉంటే,  హైజాకర్లు ఈపాటికి వారి డిమాండ్లను చెప్పేవారన్న వాదన వినిపిస్తోంది. మరోవైపు అల్‌ఖైదా 9/11ను పోలిన అటాక్‌ చేయాలనే ఉద్దేశ్యంతో మలేషియా ఫ్లైట్‌ను దారి మళ్లించిందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  అయితే ఇంతవరకూ ఎటువంటి స్పష్టత  రావట్లేదు. రోజులు గడుస్తున్నా తమ వారి ఆచూకీ తెలియక విమాన ప్రయాణికుల కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. సాంకేతికంగా దూసుకుపోతున్నామని చెప్పే దేశాలన్నీ ఇంతవరకూ ఏమీ చేయలేకపోవడంపై వారు మండిపడుతున్నారు.

ఇదిలా ఉండగా, తప్పిపోయిన  విమానంలోని ప్రయాణికుల ఎన్డిఏ నమూనాలను వారి కుటుంబ సభ్యుల నుంచి ఇండోనేషియా పోలీస్ (ఫోరెన్సిక్) అధికారులు  సేకరిస్తున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement