శరణార్థులను అక్కున చేర్చుకుంటాం
15 వేల మందికి బ్రిటన్ ఆశ్రయం!
లండన్: ఐఎస్ తీవ్రవాద దాష్టీకాలతో మరుభూమిగా మారిన సిరియా నుంచి యూరప్ వైపుగా తరలివస్తున్న శరణార్థుల విషయంలో మానవతాదృక్పథంతో వ్యవహరించాలని బ్రిటన్ భావిస్తోంది. 15,000 మంది సిరియన్ శరణార్థులకు ఆవాసం కల్పించడానికి సన్నద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. శరణార్థుల పరిస్థితిని అర్థం చేసుకొని ఈ నిర్ణయం తీసుకొన్నట్టుగా సమాచారం.
టర్కీ తీరానికి కొట్టుకొని వచ్చిన మూడేళ్ల బాలుడు అయలాన్ కుర్దీ మృతదేహం ఫొటోలు చూసి ప్రధాని డేవిడ్ కామెరాన్ చలించిపోయారని, సిరియన్ శరణార్థులకు ఆవాసం కల్పించడాన్ని నైతికబాధ్యతగా తీసుకోవాలని నిర్ణయించారు. మొదటగా 4 వేల మంది శరణార్థుల బాధ్యతలను తీసుకోవడానికి ముందుకు వచ్చిన బ్రిటన్ ఆ తర్వాత ఆ సంఖ్యను పదివేలకు పెంచింది. ఇప్పుడు పదిహేను వేల మంది నిరాశ్రయులకు ఆశ్రయమివ్వడానికి సన్నద్ధం అవుతోంది. మరోపక్క.. ఆస్ట్రియా మీదుగా జర్మనీకి తరలివస్తున్న వేలాది మంది శరణార్థులకు ఆశ్రయం కల్పించేందుకు సిద్దంగా ఉన్నట్లు జర్మనీ ప్రకటించింది.
ఈ ఏడాది 8 లక్షల మంది జర్మనీకి తరలిరావచ్చని అంచనా. ఆస్ట్రియా నుంచి శనివారం రైళ్లలో చేరుకున్న 8,000 మంది వలసదారులను జర్మన్ అధికారులు తాత్కాలిక శిబిరాలకు తరలించారు. ఆహారం, మంచి నీటి ప్యాకెట్లతో రైల్వేస్టేషన్ల వద్ద స్వచ్ఛంద సేవకులు కాందిశీకులను ఆహ్వానిస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకూ మధ్యధరా సముద్రమార్గంలో యూరప్‌కు అక్రమంగా 3,66,402 మంది వలసవచ్చారని, 2,800 మంది జలసమాధి అయ్యారని ఐరాస తెలిపింది.
‘మిగిలిన వాళ్లయినా కెనడా వస్తే మేలు’
వాంకోవర్: సిరియా నుంచి గ్రీస్‌కు వలస వెళుతూ సముద్రంలో దయనీయమైన పరిస్థితుల్లో మరణించిన మూడేళ్ల బాలుడు అయలాన్ కుటుంబంపై ప్రపంచ వ్యాప్తంగా సానుభూతి వ్యక్తమవుతోంది. కెనడాలో నివాసం ఉంటున్న అయలాన్‌కుర్దీ అత్త టిమాకుర్దీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన సోదరుడి భార్య, పిల్లలు దయనీయమైన పరిస్థితుల మధ్య మరణించడంపై విలపించారు. తమ కుటుంబంలో మిగిలిన వారిని అయినా కెనడాకు తీసుకురావాలని భావిస్తున్నారు.