
'చంద్రబాబు సినిమావాళ్లను వాడుకున్నారు'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. చంద్రబాబు స్వప్రయోజనాల కోసం సినిమా వాళ్లను అడ్డం పెట్టుకుని ఎదిగారని విమర్శించారు. చంద్రబాబు తన అవసరం కోసం బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, పవన్కల్యాణ్లను వాడుకున్నారని ఆరోపించారు. సినిమా పరిశ్రమ విశాఖపట్నానికి తరలిరావాలని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదమన్నారు.
టీడీపీ నాయకులు ఓటుకునోటు కేసులో అడ్డంగా దొరికిపోయి జైలుకెళ్లారనీ, అలాంటి వారికి తమను విమర్శించే నైతిక హక్కు లేదని శ్రీనివాస యాదవ్ విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం విధ్యార్థుల కోసం సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తుండగా టీడీపీ నాయకులు ఆరోపణలు చేయడం సిగ్గు చేటన్నారు. దొడ్డు బియ్యాన్ని పాలిష్ చేసినంత మాత్రాన సన్న బియ్యమవుతుందా అని తలసాని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పథకాలలో ఏమైనా లోపాలుంటే నిరూపించి మాట్లాడాలన్నారు. నోరు ఉందని ఇష్టానుసారం మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు.