సాక్షి ప్రతినిధి, చెన్నై: హిందీ ఉత్తరాది భాష. దక్షిణాదిలో ఉన్న చాలామందికి హిందీ రాదు. ఎవరైనా హిందీలో అదే పనిగా మాట్లాడితే.. రానివారికి చిరాకు వేస్తోంది. మరీ తమిళ భాషకు అలవాటు పడిన ఓ పులికి అదే పనిగా హిందీలో ఆదేశాలిస్తే అది ఊరుకుంటుందా?.. ఇంతకు ఆ కథ ఏమిటంటే..
రాజస్థాన్ రాష్ట్రం ఉదయ్‌పూర్‌లోని సజ్జన్‌ఘర్ జూపార్కులో 'ధామిని' అనే ఆడ తెల్లపులి ఉంది. అది ఈ మధ్య ఈడుకొచ్చింది. దానికి సరైన మగ జోడీ కోసం దేశంలోని అన్ని జూపార్కులను అన్వేషించిన అధికారులు.. చివరకు చెన్నై వండలూరు జూపార్కులో ఉన్న 'రామ' అనే మగపులిని గుర్తించారు. జంతుమార్పిడి విధానం కింద ఉదయ్‌పూర్ జూ అధికారులు తెల్ల మగపులిని స్వీకరించి ఇందుకు బదులుగా రెండు నక్కలను వండలూరు జూపార్కుకు అందించారు. ఈ ఇచ్చిపుచ్చుకోవడాలు ఇటీవలే ముగిశాయి.
2011లో వండలూరు జూలో జన్మించిన 'రామ' పులి తమిళం మాత్రమే అర్థం చేసుకుంటుంది. ‘ఇంగెవా...అంగెపో’ (ఇక్కడికి రా...అక్కడికి పో) అనే తమిళ మాటలే దానికి తెలుసు. అలాంటి 'పులిరాజ'కు ఒక్కసారిగా ‘యహా ఆవో... వహా జావో’ అంటూ హిందీలో ఆదేశాలు ఇస్తే ఎలా ఉంటుంది. ఒళ్లు మండుకొస్తుంది. అందుకే సజ్జన్‌గార్ జూపార్కు సిబ్బంది హిందీలోనూ, స్థానిక భాషలోనూ ఆదేశాలిస్తే వారిని 'రామ' గుర్రున చూస్తోంది. వారి గుండెలదిరేలా గాండ్రిస్తోంది. తమిళ తెల్లపులితో వేగడం ఇక తమవల్ల కాదని, తమిళం తెలిసిన సిబ్బందిని తమకు కేటాయించామని జూపార్కు సూపరింటెండెంట్ మోహన్‌రాజ్ ఇటీవల చెన్నై వండలూరు జూపార్కు అధికారులకు ఉత్తరం రాశారు.
'రామ'కు హిందీలో చెప్తే.. అంతే సంగతులు!
Published Mon, Sep 26 2016 8:47 PM | Last Updated on Mon, Sep 4 2017 3:05 PM
Advertisement