మిస్త్రీ వారసుడి షార్ట్ లిస్ట్
సైరస్ మిస్త్రీ అనూహ్య తొలగింపు తర్వాత ఆయన వారసుల ఎంపికలో టాటా గ్రూపు బిజీబిజీగా ఉంది. టాటా అండ్ సన్స్ నూతన ఛైర్మన్ ఎంపికకు కసరత్తు అపుడే మొదలైంది. తాత్కాలికంగా రతన్ టాటా మధ్యంతర పదవీ బాధ్యతలు స్వీకరించినా కొత్త చైర్మన్ ఎంపికపై అభ్యర్థుల పేర్లను షార్ట్ లిస్ట్ చేసినట్టు తెలుస్తోంది. అత్యున్నత స్థాయి బృందం కొత్తఛైర్మన్ కోసం అన్వేషణ చేపట్టింది. ఈ నేపథ్యంలో పలువురు దిగ్గజాల పేర్లను సంస్థ పరిశీలిస్తోంది.
సైరస్ మిస్త్రీ ఉద్వాసన తరువాత, టాటా గ్రూప్ తదుపరి చైర్మన్ అభ్యర్థుల జాబితాలో ముఖ్యంగా టీసీఎస్ సీఈవో ఎన్.చంద్రశేఖరన్, జాగ్వార్ లాండ్ రోవర్ అధినేత రాల్ఫ్‌స్పెత్‌లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ట్రెంట్ లిమిటెడ్ ఛైర్మన్, మిస్త్రీ బావ నోయెల్ టాటా పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రాథమిక జాబితా మారే అవకాశం ఉందని, ఈ నియామకాన్ని పూర్తి చేసేందుకు సెర్చ్ కమిటీకి నాలుగు నెలలు సమయం ఉన్నట్టు సమాచారం.
అయితే ఈ అంచనాలపై టీసీఎస్ సీఈవో చంద్రశేఖరన్, స్పెత్ ఇద్దరూ స్పందించలేదు. అటు టాటా సన్స్ లిమిటెడ్ కూడా వ్యాఖ్యానించడానికి నిరాకరించింది. నోయల్ కూడా అందుబాటులో లేరు. కాగా 2012 నుంచి టాటా అండ్ సన్స్‌కి ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న సైరస్ మిస్త్రీని టాటా అండ్ సన్స్ తొలగించి మార్కెట్ వర్గాల్లో కలకలం రేపారు. ఇరువర్గాలు పరస్పర ఆరోపణలతో వివాదం ముదురుతున్న సంగతి తెలిసిందే.