* కాపు కార్పొరేషన్ రుణానికి ప్రభుత్వం మెలిక
* రాష్ట్ర కాపునాడు విస్మయం
సాక్షి, హైదరాబాద్: కాపు రుణాల్లో పచ్చ చొక్కాలకే ప్రాధాన్యంఇస్తామంటున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా మరో మెలిక పెట్టింది. టీడీపీ ఎమ్మెల్యే, ఎంఎల్‌సీ లేదా ఆయా ప్రాంతాల్లో పేరున్న టీడీపీ నేతల సమ్మతి పత్రం ఉంటేనే రుణం మంజూరు చేయాలని కాపు కార్పొరేషన్‌కు షరతులు విధించింది. దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్నట్లుగా రుణం మంజూరైనా.. సమ్మతి పత్రం (విల్లింగ్ సర్టిఫికెట్) లేనిదే దరఖాస్తుదారులు కాపు కార్పొరేషన్ కార్యాలయం మెట్లెక్కే పరిస్థితి కనిపిం చడం లేదు.
దీనిపై ఏపీ రాష్ట్ర కాపునాడు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కాపునాడు రాష్ట్ర కన్వీనర్ కఠారి అప్పారావు శనివారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ రుణాలకు రాజకీయ పార్టీలతో పనేముందని ఆయన ప్రశ్నించారు. కాపు కార్పొరేషన్‌లో టీడీపీ ప్రత్యక్ష జోక్యానికి ఇది నిదర్శనం కాదా? అని నిలదీశారు. ఈ ఏడాదికి యూనిట్ రుణాన్ని రూ.2 లక్షల నుంచి 60 వేలకు కుదించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందులో రూ.30 వేలు కార్పొరేషన్, మిగతా రూ.30 వేలు బ్యాంకులు ఇస్తాయని, ఈ మొత్తం కోసం కూడా లబ్ధిదారులను ముప్పుతిప్పలు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంఎల్‌సీలు తమకు తెలిసిన వారికే సమ్మతి పత్రం ఇస్తున్నారని ఆరోపించారు.
రుణానికి అర్హత ఉందో లేదో నిర్ణయించేది కాపు కార్పొరేషనా లేక టీడీపీ నేతలా? అని ప్రశ్నించారు.
రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3.25 లక్షల మంది కాపు యువత రుణాల కోసం దరఖాస్తు చేసుకుంటే కేవలం 25 వేల మందికే ఈ ఏడాది రుణాలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం దారుణంగా వంచించిందని మండిపడ్డారు. తక్షణమే అర్హులందరికీరుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. టీడీపీ నేతల సమ్మతి పత్రం ఉంటేనే రుణాలు ఇస్తామన్న షరతును ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించవద్దని కాపు కార్పొరేషన్ చైర్మన్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ సమ్మతి పత్రం ఇచ్చేందుకు కొందరు టీడీపీ నేతలు డబ్బులు అడుగుతున్నారని కూడా కఠారి అప్పారావు ఆరోపించారు.
టీడీపీ నేతల సమ్మతి పత్రం ఉంటేనే రుణం
Published Sun, Mar 6 2016 4:33 AM | Last Updated on Fri, Aug 10 2018 9:42 PM
Advertisement
Advertisement