కాపు సామాజిక వర్గ ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఉన్న నియోజకవర్గాన్ని ఏరి కోరి ఎంచుకున్నారు పవన్ కల్యాణ్. 2019 ఎన్నికల్లోనూ కాపుల ఓట్లపై ఆశలు పెట్టుకునే ఆయన బరిలో దిగి రెండు చోట్లా ఓడిపోయారు. పవన్ కల్యాణ్ మొదట్నుంచీ కాపు వ్యతిరేకి అయిన చంద్రబాబుతో అంటకాగడం వల్లనే కాపు మేథావులు పవన్ కల్యాణ్‌ను దూరం పెడుతున్నారన్నది రాజకీయ విశ్లేషకుల వాదన. కాపుల ఆరాధ్య నాయకుడైన వంగవీటి రంగా హత్య కేసులో అన్ని వేళ్లూ చంద్రబాబు నాయుడివైపే చూపిస్తోంటే.. పవన్ కల్యాణ్ ఆ చంద్రబాబుతోనే జట్టు కట్టి ఆయన్ను ముఖ్యమంత్రిని చేయడం కోసం కాపుల రాజకీయ ప్రయోజనాలను తాకట్టు పెట్టడంపై కాపుల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది.
తనకు కులాలు మతాలు లేవంటారు పవన్ కల్యాణ్. ఆ వెంటనే నేను రెల్లి కులస్థుడణ్నంటారు. టీడీపీ హయాంలో కాపుల రిజర్వేషన్ల కోసం ముద్రగడ పద్మనాభం ఉద్యమిస్తే.. కాపులకు రిజర్వేషన్లేంటి? కులాల పేరుతో ఉద్యమాలేంటి? అంటూ పోజు కొట్టారు పవన్ కల్యాణ్. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా కాపులకు రిజర్వేషన్లు ఏమయ్యాయంటూ అమాయకంగా అడిగారు ఇదే పవన్. వంగవీటి రంగా అంటే తనకు చాలా గౌరవం అన్నారు. ఆయన్ని జీవితంలో ఎప్పుడూ చూడలేదని ఒకసారి.. ఓ సారి రంగా మా ఇంటికి వస్తే టీ ఇచ్చానని మరోసారి చెప్పుకొచ్చారు పవన్.
వంగవీటి రంగా దారుణ హత్య వెనుక ఉన్నది చంద్రబాబు నాయుడే అని రంగా హత్య జరిగిన సమయంలో హోంమంత్రిగా ఉన్న కాపు నాయకుడు చేగొండి హరిరామ జోగయ్య ఆరోపించిన సంగతి తెలిసిందే. మరో కాపు నాయకుడు కన్నా లక్ష్మీ నారాయణ కూడా రంగాతో పాటు తనని కూడా హతమార్చడానికి చంద్రబాబు సుపారీ ఇచ్చారని ఆరోపించారు. అటువంటి చంద్రబాబు నాయుడు 371 కోట్ల రూపాయల మేరకు ప్రజాధనాన్ని దోచుకున్నరాన్న అభియోగంపై జైలుకెళ్తే పవన్ కల్యాణ్ చాలా బాధ పడ్డారట.
రంగా హత్యోదంతం నేపథ్యంలో కాపులు చంద్రబాబును ఏవగించుకుంటున్నారని గమనించిన పవన్ కల్యాణ్ చంద్రబాబు తరపున వకాల్తా పుచ్చుకుని కాపులు-కమ్మలు కలిసి ఉండాలంటూ కొత్త రాగం అందుకున్నారు. జగన్‌మోహన్‌రెడ్డిని ఓడించాలంటే కాపులు-కమ్మలు చేతులు కలపాల్సిందేనని పవన్ థియరీని విడుదల చేశారు. కాపుల్లో రంగాకి అపారమైన గౌరవాభిమానాలు ఉన్నాయి. అటువంటినేతను చంద్రబాబు నాయుడు పొట్టన పెట్టుకున్నారన్న కోపం కూడా కాపుల్లో ఉంది. కాపు ఓట్లతోనే గెలవగలను అనుకుంటోన్న పవన్ పిఠాపురం సీటును ఎంచుకున్నది చంద్రబాబు సలహాతోనే అంటున్నారు.
అయితే కాపుల్లో మాత్రం చాలా ప్రశ్నలు ఉన్నాయి. టీడీపీ కష్టాల్లో ఉన్నప్పుడు పొత్తు పెట్టుకుని సంక్షోభంలో ఉన్న టీడీపీకి మద్దతు పలికారు పవన్. అయినా ఎన్నికల పొత్తులో కనీసం ఓ 60 సీట్లు కూడా సాధించుకోకుండా ముష్టి 21 సీట్లతో సరిపెట్టుకోవడంపై విమర్శలు వచ్చాయి. అదికూడా చంద్రబాబును సిఎంని చేయడానికి పవన్ పరితపిస్తోన్న తీరు కాపులకు నచ్చడం లేదు. చంద్రబాబు నాయుడి కోసం కాపులకోసం ఎన్నో ఉద్యమాలు చేసిన ముద్రగడ పద్మనాభం, చేగొండి హరిరామ జోగయ్యలను సైతం పవన్ దూరం పెట్టేశారు. అంతే కాదు వారిని అవమానించేలా వ్యాఖ్యలు చేశారు.
మైక్ పట్టుకుని ఉపన్యాసాలు దంచేటపుడు తాను విశ్వమానవుణ్నని పవన్ చెబుతూ ఉంటారు. కొద్ది నిముషాల్లోనే అది మర్చిపోయి కులాల ప్రస్తావన తెస్తూ ఉంటారు. జగన్ మోహన్‌రెడ్డిపై ద్వేషంతో ఆయన నియోజకవర్గం అయిన పులివెందులను దూషిస్తూ పైశాచికానందాన్ని పొందుతూ ఉంటారు. కాపుల కోసం పవన్ ఏ నాడూ చిత్తశుద్ధిగా పనిచేయలేదు కాబట్టే భీమవరం, గాజువాక నియోజక వర్గాల్లో కాపులు కూడా ఆయనకు మనస్ఫూర్తిగా ఓటు వేయలేదు. అందుకే ఆయన ఓటమి చెందారు. ఈ ఎన్నికల్లో పిఠాపురంలోనూ అదే రిపీట్ అవుతుందంటున్నారు పాలక పక్ష నేతలు.
Comments
Please login to add a commentAdd a comment