తెలంగాణ బిల్లుపై కొనసాగుతున్న ఉత్కంఠ
న్యూఢిల్లీ : పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పెట్టే విషయంలో ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. ముందుగా బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్ర హోంశాఖ ....రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కోరింది. మరోవైపు లోక్ సభ స్పీకర్ మీరాకుమార్ అధ్యక్షతన ఈరోజు మధ్యాహ్నం 1.15 గంటలకు లోక్సభ వ్యవహారాల కమిటీ భేటీ కానుంది.
ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును సభలో ప్రవేశపెట్టే తేదీని ఖరారు చేసే అవకాశం ఉంది. అందు కోసం కేంద్ర హోంశాఖ ముందుగా బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టేందుకు సిఫార్సు చేయాలని రాష్ట్రపతి అనుమతిని కోరింది. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి అయ్యేందుకు సమయం పట్టనుంది. దాంతో బుధవారం లేదా...గురువారం బిల్లు పార్లమెంట్కు వచ్చే అవకాశం ఉంది.
ఇక రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సోమవారం విభజన బిల్లుకు ఆమోదం తెలుపుతూ కేంద్రానికి పంపిన విషయం తెలిసిందే. అయితే దాన్ని రాజ్యసభలో ప్రవేశపెట్టే అంశం చుట్టూ నిన్నంతా హస్తినలో పరిణామాలు ఆసక్తికర మలుపులు తిరిగాయి. బిల్లును మంగళవారమే రాజ్యసభలో ప్రవేశపెట్టేందుకు ముందు కేంద్రం రంగం సిద్ధం చేసింది.
మధ్యాహ్నం 12 గంటల సమయంలో సభలో బిల్లును ప్రవేశపెట్టాలని నిర్ణయించి ఆ మేరకు రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీకి సమాచారమిచ్చింది. మంగళవారం నాటి రాజ్యసభ ఎజెండాలో విభజన బిల్లు అంశం లేకపోయినా, మధ్యాహ్నం 12కు దాన్ని ప్రవేశపెట్టనున్నట్టు రాజ్యసభ బీఏసీ సభ్యుడు సత్యవ్రత చతుర్వేది మీడియాకు తెలిపారు.