డిప్యూటీ చైర్మన్ కురియన్
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ బిల్లు)ను సభ్యుల ఆందోళన మధ్య రాజ్యసభ ఈరోజు ఆమోదించింది. ఉదయం నుంచి అనేక సార్లు వాయిదాలు పడుతూ సభ సాగింది. పలువురు సభ్యుల ఆందోళన, నిరసన, అరుపులు, కేకలు, నినాదాల మధ్యనే కేంద్ర హొం మంత్రి సుశీల్ కుమార్ షిండే బిల్లును సభలో ప్రవేశపెట్టారు. బిల్లుకు వ్యతిరేకంగా, బిల్లుకు రాజ్యాంగ ప్రాతిపదిక లేదని, బిల్లును తిరస్కరించాలని పలువురు సభ్యులు నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులను సభ డిప్యూటీ చైర్మన్ కురియన్ చదివి వినిపించారు.
డిప్యూటీ చైర్మన్ అనుమతితో పలువురు సభ్యులు నిరసన-అరుపులు-కేకల మధ్యలోనే కేంద్ర హొం మంత్రి సుశీల్ కుమార్ షిండే బిల్లును చదివి వినిపించారు. ఆ తరువాత బిల్లుపై చర్చ జరిగింది. చర్చలో వెంకయ్య నాయుడు, అరుణ్ జైట్లీ, చిరంజీవి, సీతారాం ఏచూరి, రాజా, మాయావతి తదితరులు మాట్లాడారు. బిల్లును పలు విపక్షాలు వ్యతిరేకించాయి. చివరిగా ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ సభలో ఒక ప్రకటన చేశారు. తెలంగాణ బిల్లుపై చర్చ ముగిసిందని డిప్యూటీ చైర్మన్ ప్రకటించిన తరువాత క్లాజులవారీగా నాటకీయంగా మూజువాణి ఓటింగ్ జరిగింది. ఓటింగ్కు వెంకయ్య నాయుడు పట్టుపట్టినా డిప్యూటీ చైర్మన్ అంగీకరించలేదు. చివరకు సభ్యుల గందరగోళం మధ్య బిల్లు ఆమోదం పొందినట్లు కురియన్ ప్రకటించారు. ఆ తరువాత సభ రేపు ఉదయం 11 గంటలకు వాయిదా పడింది.