
బిల్లును పార్లమెంటులో పెడతాం: సంఘ్వీ
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ బిల్లును వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెడతామని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్‌సింఘ్వీ స్పష్టంచేశారు. ఈ బిల్లును ఆంధ్రప్రదేశ్ శాసనసభ తిరస్కరిస్తూ తీర్మానం చేయటాన్ని ప్రస్తావించగా.. రాష్ట్ర విభజనకు శాసనసభ సమ్మతి అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని.. ఆ దిశగా యూపీఏ సర్కారు ఇప్పటికే ముందడుగు వేసిందని చెప్పారు. దీనికి సంబంధించి మొసలి కన్నీళ్లు కారుస్తున్న ఇతర పార్టీలు.. బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాక ఏ మేరకు సహకరిస్తాయన్నది చూడాలని, అప్పుడు ఆ పార్టీల రంగు బయటపడుతుందని పరోక్షంగా బీజేపీపై విమర్శలు ఎక్కుపెట్టారు.
ఆయన శుక్రవారం ఏఐసీసీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విభజన బిల్లును తిరస్కరిస్తున్నట్లు శాసనసభలో తీర్మానం చేయటం గురించి ప్రస్తావించగా.. ఇది అనూహ్యమైన పరిణామేమీ కాదని సింఘ్వీ బదులిచ్చారు. విభజనకు సంబంధించి రాష్ట్రం ముందుగా సమ్మతి తెలపాల్సిన అవసరం లేనప్పటికీ.. సంబంధిత ప్రక్రియను తాము విశ్వసిస్తాం కాబట్టి ఆ ప్రక్రియను తాము జాగ్రత్తగా పూర్తిచేశామన్నారు. బిల్లును అసెంబ్లీ తిరస్కరించటం రాజ్యాంగానికి విరుద్ధమన్నారు. ‘తిరస్కరణ బిల్లుకు మద్దతిచ్చిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ఇతర సీమాంధ్ర కాంగ్రెస్ నేతలపై క్రమశిక్షణ చర్యలు చేపడతారా?’ అని ప్రశ్నించగా.. భావోద్వేగపూరితమైన ఈ అంశంపై అభిప్రాయంలో చీలిక ఉంటుందని ఊహించామంటూ జవాబు దాటవేశారు. క్రమశిక్షణ అంశాన్ని ఉన్నతాధికార కమిటీ చూడాల్సిన వ్యవహారమని.. దాని గురించి తాను మాట్లాడనని చెప్పారు.
కోర్ కమిటీ భేటీ...
ఇదిలావుంటే.. కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటీ శుక్రవారం ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ నివాసంలో సమావేశమైంది. పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఇతర సీనియర్ నేతలతో పాటు.. ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. ఫిబ్రవరి 5వ తేదీ నుంచి మొదలు కానున్న పార్లమెంటు సమావేశాల ఎజెండాలో.. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్, ఆరు అవినీతి వ్యతిరేక బిల్లుల ఆమోదంతో పాటు.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు ఆమోదం కీలకమైన మూడు అంశాలుగా ఉంటాయని ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు ఒకరు పేర్కొన్నారు.