చైనా పర్యటనకు బయల్దేరిన కేసీఆర్
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సోమవారం చైనా పర్యటనకు బయల్దేరారు. ఆయనతో పాటు 15మందితో కూడిన రాష్ట్ర ప్రతినిధి బృందం ఈ పర్యటనలో ఉన్నారు. వరల్డ్ ఎకనామిక్స్ ఫోరం ఆధ్వర్యంలో చైనాలోని డేలియన్ నగరంలో జరగనున్న 'న్యూ చాంపియన్స్-2015' సదస్సులో పాల్గొనడంతో పాటు అక్కడి ప్రధాన నగరాలైన బీజింగ్, షాంఘై, డేలియన్, హాంకాంగ్, షెంజన్‌లను ఈ బృందం సందర్శించనుంది. ఈ నెల 7 నుంచి 16వ తేదీ వరకు 10 రోజుల పాటు జరగనున్న ఈ పర్యటనలో కేసీఆర్ అక్కడి పలు సంస్థలతో ద్వైపాక్షిక చర్చలు జరపడంతో పాటు చారిత్రాత్మక ప్రాంతాలను సందర్శించనున్నారు.రాష్ట్రంలో పెట్టుబడుల కోసం పలువురు పారిశ్రామికవేత్తలతో చర్చిస్తారు.
ముఖ్యమంత్రి పర్యటన బృందంలో: రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు, శాసన మండలి చైర్మన్ కె.స్వామిగౌడ్, అసెంబ్లీ స్పీకర్ కె. మధుసూదనా చారి, పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలచారి, చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, అదనపు ముఖ్యకార్యదర్శి శాంతి కుమారి, పరిశ్రమల శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్, నిఘా విభాగం ఐజీ శివధర్‌రెడ్డి, ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ ఐజీ మహేశ్ భగవత్, సీఎంవో ప్రత్యేక కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, టీఎస్‌ఐఐసీ వీసీ ఎండీ ఈవీ నరసింహారెడ్డి, సీఎం కార్యాలయం నుంచి ఎం.సంతోష్, సుభాష్‌రెడ్డి, మిషన్ మేనేజర్లు జగదీశ్ రామడుగు, శివాని శంకర్ ఉన్నారు.