మంత్రి జైరాం రమేశ్‌తో తెలంగాణ కాంగ్రెస్‌నేతలు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ బిల్లు ఆమోదించే భారమంతా కేంద్ర ప్రభుత్వంపైనే ఉందని, దాన్ని ఎలాగైనా గట్టెక్కించి ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని తెలంగాణప్రాంత కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కేంద్ర మంత్రి జైరాం రమేశ్‌తో విన్నవించుకున్నారు. ఎన్నో అడ్డంకులు దాటుకొని వచ్చిన బిల్లుకు ఆమోదం లభిస్తేనే తెలంగాణలో పార్టీకి మనుగడ ఉంటుందని, దీన్ని దృష్టిలో పెట్టుకొని త్వరితగతిన బిల్లు ఆమోదం పొందేలా చూడాలని ఆయనను కోరారు. మంగళవారం మంత్రులు జానారెడ్డి, గీతారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రసాద్‌కుమార్, సునీతారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, సుదర్శన్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, ఎంపీలు పొన్నం ప్రభాకర్, గుత్తా సుఖేందర్‌రెడ్డి, పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, విప్‌లు అనిల్, ఆరేపల్లి మోహన్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కేంద్రమంత్రి జైరాంని ఆయన కార్యాలయంలో కలిశారు.
సుమారు అరగంటసేపు జరిగిన సమావేశంలో బిల్లు ఆమోదం కోసం కేంద్రం తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. రాష్ట్ర అసెంబ్లీలోజరిగిన పరిణామాలు, బిల్లును అడ్డుకునేందుకు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి వేసిన ఎత్తుగడ, సుప్రీంలో పిటిషన్ల దాఖలు తదితర విషయాలను జైరాం రమేశ్‌కు జానారెడ్డి వివరించారు. జైరాం స్పందిస్తూ, బిల్లును ఆమోదింపజేసేందుకు ప్రభుత్వం చిత్తశుధ్ధితో ఉందని, అయితే సీమాంధ్ర ఎంపీల తీరు ఎలా ఉంటుందన్నది చూడాల్సి ఉందన్నారు. వారిని సస్పెండ్ చేసైనా బిల్లును ప్రవేశపెట్టాలనే దృఢ నిశ్చయంతో ఉన్నట్టు తనకు సంకేతాలున్నాయని, ప్రధాన ప్రతిపక్షం మద్దతుగా నిలుస్తుందనే తాము భావిస్తున్నామని వివరించినట్టు తెలిసింది. బీజేపీ చేసిన కొన్ని సవరణలపై పరిశీలన చేస్తున్నామని, వాటిపై ఆయా శాఖల మంత్రిత్వ శాఖ లు తమ అభిప్రాయాన్ని తెలియజేస్తాయని జైరాం చెప్పారు. ముఖ్యంగా పోలవరం ముంపు ప్రాంతాల్ని ఆంధ్రలో కలిపే అంశం తమ పరిశీలనలో ఉందని చెప్పినట్టు తెలిసింది. భేటీ అనంతరం మంత్రులు గీతారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిలు మాట్లాడుతూ ఆరునూరైనా బిల్లు ఆమోదం పొందుతుందనే గట్టిహామీ కేంద్రమంత్రి నుంచి లభించిందన్నారు. బీజేపీ సైతం తమ వాగ్దానంపై వెనుకకు వెళ్లదనే నమ్మకం కలిగించారని తెలిపారు.