ఉభయ సభలనుద్దేశించి ప్రసంగిస్తున్న గవర్నర్. పక్కనే మండలి చైర్మన్, స్పీకర్
వృద్ధి, సంక్షేమాల్లో తెలంగాణకు దేశంలో ప్రత్యేక గుర్తింపు
- రాష్ట్రంలో సుపరిపాలన: గవర్నర్
- ఉభయ సభలనుద్దేశించి ప్రసంగం
- తెలంగాణ వృద్ధిరేటు 13.7 శాతం
- జాతీయ వృద్ధిరేటు కంటే అత్యధికం
- హామీ మేరకు లక్ష ఉద్యోగాల భర్తీ
- సంక్షేమానికి బడ్జెట్‌లో 35 వేల కోట్లు
- గ్రామీణాభివృద్ధే లక్ష్యంగా కుల వృత్తుల పునరుద్ధరణ
- గవర్నర్ ప్రసంగం అంతా అబద్ధాలే అంటూ సభ నుంచి కాంగ్రెస్ వాకౌట్
సాక్షి, హైదరాబాద్
‘‘తెలంగాణ రాష్ట్రం అతి తక్కువ సమయంలోనే అభివృద్ధి సాధించింది. అటు వృద్ధిలోనూ, ఇటు సంక్షేమంలోనూ దేశంలో ప్రత్యేక గుర్తింపు పొంది నంబర్‌వన్‌గా నిలిచింది’’ అని గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ పేర్కొన్నారు. శుక్రవారం బడ్జెట్ సమావేశాల తొలి రోజున ఉభయసభలను ఉద్దేశించి శాసనసభలో ఆయన ప్రసంగించారు. తన ప్రభుత్వం రాజకీయ అవినీతికి ఆస్కారం లేకుండా పారదర్శక సుపరిపాలన అందిస్తోందని చెప్పారు. 2014లో ఇదే సభలో ఈ విషయమై హామీ ఇచ్చామని గుర్తు చేశారు. తన నమ్మకాన్ని వమ్ము చేయకుండా రెండున్నరేళ్లుగా అవినీతిరహిత పాలన సాగుతోందన్నారు. ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించిన గవర్నర్, తర్వాత ఇంగ్లిష్‌లో కొనసాగించారు. నిరంతర విద్యుత్ సరఫరా, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో దేశంలో తొలి స్థానం తదితరాలన్నీ ప్రభుత్వం సాధించిన ఫలితాలంటూ ప్రశంసించారు. గవర్నర్ ప్రసంగం యావత్తు అబద్ధాలమయమని ఆరోపిస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వాకౌట్ చేశారు.
జీఎస్‌డీపీలో టాప్
రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ) గణనీయంగా వృద్ధి చెందిందని, 2016–17 ముందస్తు అంచనాల ప్రకారం ప్రస్తుత ధరలకు దేశ వృద్ధి రేటు 11.5 శాతం కాగా తెలంగాణ జీఎస్‌డీపీ 13.7 శాతం వృద్ధిని నమోదు చేసిందని గవర్నర్ వివరించారు. ‘‘ప్రస్తుత ధరల ప్రకారం రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.6.54 లక్షల కోట్లుగా ఉంటుందని అంచనా వేశాం. వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలుండే ప్రాథమిక రంగం 17.2 శాతం వృద్ధి చెందింది. జాతీయ సగటుతో పోలిస్తే ఏకంగా 9 శాతం పెరిగింది. పరిశ్రమలు, తయారీ తదితరాలున్న మాధ్యమిక రంగంలో 9.7 శాతం, సేవారంగంలో 14.6 శాతం వృద్ధి చెందే అవకాశముంది. ఎన్నికల హామీ మేరకు ఐదేళ్లలో లక్ష ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కట్టుబడి ఉంది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటిదాకా కొత్తగా ఉద్యోగాల్లో చేరిన వారి సంఖ్య 27,481. త్వరలోనే మరో 12 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రానుంది. 20 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులతో పాటు విద్యుత్ రంగంలోని 24 వేల ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను ప్రభుత్వం క్రమబద్ధీకరించనుంది. కొత్త గురుకుల పాఠశాలల్లో 24 వేల ఉద్యోగాలు మంజూరయ్యాయి. వీటిలో 8,000 ఈ ఏడాది, మిగతావి వచ్చే రెండేళ్లలో భర్తీ చేస్తారు’’ అని పేర్కొన్నారు. గవర్నర్ ఇంకేం చెప్పారంటే...
– బడ్జెట్లో ఏకంగా రూ.35 వేల కోట్లు సంక్షేమానికి ప్రభుత్వం కేటాయించింది. 30 సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది
– గొర్ల కాపర్లు, మత్స్యకారులు, నేతకారులు, క్షురకులు, చేతి వృత్తుల కార్యకలాపాల పునరుద్ధరణకు ప్రత్యేక నమూనా సిద్ధం చేసింది
– వరంగల్, సిరిసిల్ల, మహబూబ్‌నగర్‌లలో మెగా జౌళి పార్కులు ఏర్పాటు చేయనుంది
– అత్యంత వెనుకబడిన తరగతుల అభివృద్ధికి ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేస్తోంది
– ఎస్సీ, ఎస్టీలకు బడ్జెట్‌లో నిధుల కేటాయింపుకు కట్టుబడి ఉంది
– టీఎస్ ఐపాస్‌తో రాష్ట్రానికి ఇప్పటికే రూ.54 వేల కోట్ల పెట్టుబడులు తరలి వచ్చాయి
– 3,451 పరిశ్రమల ఏర్పాటుతో 2.2 లక్షల మందికి ఉద్యోగావకాశాలు లభించాయి
– ఐటీ ఎగుమతుల్లో దేశంలో హైదరాబాద్ రెండో స్థానంలో ఉంది
– 3.5 లక్షల చదరపు అడుగుల్లో టీ హబ్ రెండో దశను అభివృద్ధి చేసే ప్రణాళిక సిద్ధమైంది
– మెట్రో రైలు తొలి దశ ఈ ఏడాదే పూర్తవుతుంది
– కోటి ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంతో 23 భారీ, 13 మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం జోరందుకుంది
– చెరువుల పునరుద్ధరణ పథకం మిషన్ కాకతీయ దేశంలోనే ఆదర్శంగా నిలిచింది
– ఇంటింటికీ తాగునీరందించే మిషన్ భగీరథను 2017 అంతానికి పూర్తి చేసేందుకు కట్టుబడి ఉంది
– కేజీ టు పీజీలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలను వచ్చే విద్యా సంవత్సరం నుంచే ప్రారంభిస్తోంది
– ఎస్సీ మహిళలకు తొలిసారిగా 30 రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు మంజూరు చేసింది
– నాలుగు కొత్త పర్యాటక సర్క్యూట్లను అభివృద్ధి చేస్తోంది. ప్రధానాలయాల అభివృద్ధి చర్యలు తీసుకుంటోంది
– రూ.17 వేల కోట్ల రైతు రుణాలు మాఫీ చేసింది
– రుణమాఫీ చివరి వాయిదాను రాబోయే బడ్జెట్‌లో కేటాయిస్తుంది
– జర్నలిస్టులు, లాయర్ల సంక్షేమానికి నిధి ఏర్పాటు చేసింది
– జర్నలిస్టులకు రూ.50 కోట్లు, లాయర్లకు రూ.100 కోట్లు, బ్రాహ్మణ పరిషత్‌కు రూ.100 కోట్లు కేటాయించింది
నిరసనగా కాంగ్రెస్ వాకౌట్
గవర్నర్ చేసిన ప్రసంగానికి నిరసన తెలుపుతూ బడ్జెట్ సమావేశాల తొలి రోజు శుక్రవారం కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసింది. ప్రసంగం కొనసాగుతుండగానే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సీట్లలోంచి లేచి నిలబడ్డారు. ప్రసంగంలో అన్నీ అబద్ధాలేనంటూ నిరసన తెలిపారు. ‘‘కేజీ లేదు.. పీజీ లేదు. డబుల్ బెడ్రూం ఇళ్ల మాటే లేదు. అన్నీ అబద్ధాలే’’ అని నినదిస్తూ బయటకు వెళ్లిపోయారు.